- రూ. 6 లక్షలు సొంతానికి వాడుకున్న సంఘం లీడర్ భర్త
తూప్రాన్, వెలుగు : మహిళా సంఘం సభ్యుల నుంచి లోన్ పైసలు వసూలు చేసి బ్యాంక్‌లో కట్టకుండా సొంతానికి వాడుకున్న సంఘం లీడర్ భర్తను గ్రామస్తులు కరెంట్ స్తంభానికి కట్టేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడాలపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. మహిళా సంఘం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పడాలపల్లికి చెందిన అంబేద్కర్ మహిళా సంఘం సభ్యులు రెండేండ్ల కింద ఎస్‌బీఐలో రూ. 10 లక్షల లోన్ తీసుకున్నారు. గ్రూప్ ఫస్ట్ లీడర్ మిన్నీ మోల్, సెకండ్ లీడర్ సిద్దమ్మ కలిసి సభ్యుల నుంచి నెల నెలా డబ్బులు వసూలు చేసి బ్యాంక్‌లో కట్టేవారు. 11 నెలల కింద మిన్నీమోల్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె భర్త భిక్షపతి సభ్యుల నుంచి పైసలు తీసుకొని బ్యాంక్‌లో కట్టి వస్తానని చెప్పాడు. బ్యాంక్‌లో అప్పుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని మిన్నీమోల్ ఆరు నెలలుగా అడుగుతున్నా భిక్షపతి పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన మిన్నీమోల్ గట్టిగా నిలదీయడంతో సుమారు రూ. 6 లక్షలు భిక్షపతి సొంతానికి వాడుకున్నట్లు తేలింది.
విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెప్టెంబర్ 10 వరకు డబ్బులు చెల్లిస్తానని, లేకపోతే తన ఇంటిని జప్తు చేసుకోవాలని కాగితం రాసిచ్చాడు. గడువు ముగియడంతో లోన్ డబ్బుల గురించి అడిగేందుకు మంగళవారం మహిళలు వెళ్లగా గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా సంఘం సభ్యులు భిక్షపతిని విద్యుత్ స్తంభానికి కట్టేశారు. గ్రామస్తులు జోక్యం చేసుకొని అతడిని విడిపించారు. బుధవారం ఉదయం మహిళలు బ్యాంక్‌కు వెళ్లగా మొత్తం రూ. 7.50 లక్షలు చెల్లించాల్సి ఉందని మేనేజర్ చెప్పాడు. దీంతో 11 నెలలుగా డబ్బలు కట్టకుంటే బ్యాంక్ ఆఫీసర్లు, ఆర్పీలు ఎందుకు పట్టించుకోలేదని బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం భిక్షపతిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అలాగే తనపై దాడి చేశారని భిక్షపతిపై సైతం తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐదుగురిపై కేసు నమోదు అయింది.