గడిచిన పదేళ్లకి విన్నర్‌గా నిలిచిన పదం ప్రకటన

గడిచిన పదేళ్లకి విన్నర్‌గా నిలిచిన పదం ప్రకటన

2010 సంవత్సరం నుంచి 2019 వరకు గడిచిన దశాబ్ధ కాలానికి ఓ పదాన్ని విన్నర్‌గా తేల్చారు ఇంగ్లిష్ భాషా శాస్త్రవేత్తలు. వర్డ్ ఆఫ్ ది డికేడ్‌గా ఒక సర్వనామాన్ని ఎంపిక చేశారు. అది “they” (దే). అమెరికాకు చెందిన లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్ సొసైటీ అయిన అమెరికన్ డైఎలక్ట్ సొసైటీ ఈ పదాన్ని ఎంపిక చేసింది. కొద్ది రోజుల క్రితమే అమెరికన్ డిక్షనరీ మెరియం వెబ్‌స్టర్ కూడా ఇదే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించింది.

పోటీ పడిన పదాలు

వర్డ్ ఆఫ్ ద డికేడ్‌గా నిలిచిన “they”కి పోటీ  ఇచ్చిన పదాల్లో మెమ్ (meme), క్లైమేట్ (climate) ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో ఈ మూడు పదాలకు టాప్-3గా ఓట్లు వచ్చాయని తెలిపింది అమెరికన్ డైఎలక్ట్ సొసైటీ. BlackLivesMatter, MeToo, emoji, opioid crisis, woke పదాలకు కూడా వర్డ్ ఆ ద డికేడ్ పోటీలో నిలిచినట్లు చెప్పింది.

లింగ సమానత్వ ప్రాధాన్యం చెప్పేలా..

ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులు, వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్‌లో వాడే సర్వనామం ఇది. ఆడ అయితే ఒక్కరిని షీ (she), మగ అయితే హీ (he) అంటారు. కానీ ఆ లింగ బేధాన్ని కచ్చితంగా చెప్పలేని సందర్భంలో ఒక్కరికి కూడా ఇంగ్లిష్‌లో దే అనే పదాన్ని వాడుతున్నారు. గడిచిన దశాబ్ధంలో “they” పదానికి చాలా ప్రాధాన్యం పెరిగిందని లింగ్విస్టిక్స్ అభిప్రాయపడుతున్నట్లు అమెరికన్ డైఎలక్ట్ సొసైటీ చీఫ్ బెన్ జిమ్మర్ అన్నారు. లింగ సమానత్వం ప్రస్తుత సమాజంలో ఎంతటి కీలకంగా మారిందన్నది ఈ పదం ఎంపికలోనే అర్థం అవుతోందని చెప్పారు.