తహసీళ్లకు తాళాలు.. ఖాళీగా ఠాణాలు

తహసీళ్లకు తాళాలు.. ఖాళీగా ఠాణాలు
  • విజయారెడ్డి హత్య తర్వాత విధులకు దూరంగా రెవెన్యూ ఉద్యోగులు
  • ఆర్టీసీ సమ్మెతో రోడ్ల మీదే పోలీసులు
  • రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్​లో పనులు
  • పోలీస్​స్టేషన్లలో పేరుకుపోతున్న కేసులు

జిల్లాల్లో పరిపాలనకు రెవెన్యూ, శాంతిభద్రతలకు పోలీస్​శాఖ గుండెకాయలాంటివి. కానీ  రాష్ట్రంలో ప్రస్తుతం ఈ రెండు శాఖల పనులన్నీ పెండింగ్​లో పడ్డాయి. ఆర్టీసీ సమ్మెలో భాగంగా  రోజుకో రూపంలో ఆందోళన చేస్తున్న కార్మికులను అణచివేసేందుకు సర్కారు పోలీస్​శాఖను పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. ఫలితంగా ప్రతి ఠాణా​లో ఒకరిద్దరు కానిస్టేబుళ్లు తప్ప మిగిలిన సిబ్బంది, పోలీస్​ ఆఫీసర్లంతా నెల రోజులుగా రోడ్ల మీదే గడుపుతున్నారు. పోలీస్​శాఖ పరిస్థితి ఇలా ఉంటే ఈ నెల 2న అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్​ హత్యను నిరసిస్తూ సుమారు 10రోజులుగా రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తహసీల్​ కార్యాలయాలకు తాళాలు వేలాడుతున్నాయి. ఫలితంగా అటు పోలీస్​స్టేషన్ల​ చుట్టూ కేసుల బాధితులు, ఇటు భూసమస్యలు, వివిధ సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ జనం చెప్పులరిగేలా తిరుగుతున్నారు.

తహసీల్దార్​ విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు పెన్​డౌన్​ చేస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని తహసీల్​ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. అక్కడక్కడా తెరుచుకుంటున్నా ఉద్యోగులు లేక ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా భూపరిపాలన వ్యవహారాలతో పాటు ప్రజలకు అవసరమైన మెజారిటీ సర్టిఫికెట్ల జారీ బాధ్యత తహసీల్దార్లకే ప్రభుత్వం కట్టబెట్టింది. కానీ రెవెన్యూ అధికారులు విధులు బహిష్కరించడంతో పాస్​బుక్​ల పంపిణీ, భూసర్వేలు, మ్యుటేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. విద్య, ఉద్యోగ అవసరాలకే కాకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్​లాంటి పథకాలకు  అవసరమైన క్యాస్ట్​, ఇన్​కం, రెసిడెంట్​ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది.

ఇప్పటికే అప్లై చేసుకున్న వారు అర్హులా కాదా? అని తేల్చేందుకు చేయాల్సిన ఎంక్వైరీలు కూడా జరగడం లేదు. ప్రభుత్వ, పబ్లిక్​ అవసరాల కోసం ఇసుక పర్మిట్లు జారీ చేయాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ అధికారులదే కాగా, పర్మిట్లు ఇచ్చేవారు లేక నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. వివిధ  ప్రకృతి విపత్తుల బారిన పడి మృతిచెందే వారి కుటుంబాలకు వివిధ పథకాల కింద ఇచ్చే తక్షణ సాయం కూడా అందడం లేదు. దీంతో ఆయా అవసరాల కోసం వచ్చే ప్రజలు పది రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.  ప్రధానంగా రైతులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

ఠాణాల్లో కేసుల పెండింగ్​..

అక్టోబర్​5న ఆర్టీసీ సమ్మె ప్రారంభం కాగా, సర్కారు ఆదేశాలతో కార్మికులను అణిచివేసేందుకు  పోలీసులంతా రోడ్లెక్కారు. డిపోలు, దీక్షా శిబిరాల ముందు, బస్​స్టేషన్లలో, ఆఖరుకు బస్సుల్లో కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 5గంటల నుంచి రాత్రి పొద్దుపోయేవరకు బందోబస్తులో బిజీగా గడుపుతున్నారు. రిటైర్​మెంట్​కు దగ్గరపడ్డ ఒకరిద్దరు కానిస్టేబుళ్లు తప్ప మిగిలినవారెవరూ ఠాణాల్లో కనిపించడం లేదు. ఎస్​ఐలు, సీఐలు మధ్యాహ్నం లంచ్​ టైమ్​లో కొంతసేపు, సాయంత్రం 6 గంటల తర్వాత కొంతసేపే రెగ్యులర్​ విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా పోలీస్​స్టేషన్లలో పెద్దసంఖ్యలో కేసులు పెండింగ్​ పడుతున్నాయి. ఉదాహరణకు సిద్దిపేట వన్ టౌన్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్ లో అక్టోబరు నెలలో 250 ఫిర్యాదులు రాగా కేవలం 49 కేసులే నమోదుచేశారు. అందులో ఐదింటినే పరిష్కరించారు. సంగారెడ్డి పట్టణ పోలీస్​స్టేషన్  పరిధిలో సమ్మెకు ముందు సగటున నెలకు 8 కేసులు పెండింగ్​లో  ఉండేవి. సమ్మె కారణంగా అక్టోబర్​లో పెండింగ్​ కేసుల సంఖ్య18కి పెరిగింది. ప్రతి జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వివిధ చోరీలు, హత్య కేసుల దర్యాప్తులోనూ వేగం మందగించినట్లు తెలుస్తోంది. ఫలితంగా బాధితుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

అభద్రతాభావంలో రెవెన్యూ  ఉద్యోగులు..

తహసీల్దార్​ విజయారెడ్డి హత్య తర్వాత తాము స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయిందని రెవెన్యూ  ఉద్యోగులు, అధికారులు అంటున్నారు. ఎప్పుడు,  ఎక్కడ, ఎవరు,  ఏ రూపంలో తమపై దాడి  చేస్తారో తెలియడం లేదని చెబుతున్నారు. విజయారెడ్డి హత్య తర్వాత తమకు బెదిరింపు ఫోన్​ కాల్స్​ పెరుగుతున్నాయనీ, ఈ క్రమంలో ప్రభుత్వం తమ భద్రతపై హామీ ఇవ్వడంతో పాటు కొన్ని డిమాండ్లు పరిష్కరిస్తేనే విధులకు హాజరవుతామని రెవెన్యూ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని వేలాది ఎకరాల వివాదాస్పద భూములను పార్ట్​ బీలో చేర్చారు. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను సర్కారు వెంటనే విడుదల చేసి, ధరణి సాఫ్ట్​వేర్​లోని సమస్యలను పరిష్కరించాలనీ, డిజిటల్​ సంతకాలు పూర్తి అయిన ఖాతాలకు సంబంధించి పాస్​బుక్​లను లబ్ధిదారులకు వెంటనే అందించాలనీ, రెవెన్యూ సమస్యల పరిష్కరానికి  వెంటనే సీసీఎల్​ఏను నియమించాలనే ప్రధాన డిమాండ్లను రెవెన్యూ ఉద్యోగులు ఉన్నతాధికారుల ముందు ఉంచారు. కానీ ప్రభుత్వం నుంచి నేటికీ స్పష్టత లేకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ఇన్​కం సర్టిఫికెట్ కావాలె..

నేను గతంలో గల్ఫ్​ వెళ్లి వచ్చాను. ఇక్కడే ఉపాధి చూసుకుందామని మైనార్టీ కార్పొరేషన్  కింద టాక్సీ కారు కోసం అప్లై చేయాలనుకున్నాను. ఇందుకోసం అక్కడి అధికారులు ఇన్​కం సర్టిఫికెట్​ అడుగుతున్నారు. దీంతో వారం రోజులుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి వెళుతున్నాను. లోన్ అప్లై చేసేందుకు  ఈ నెల 15 ఆఖరి తేదీ. అప్పటివరకు అధికారులు విధులకు వస్తారో, రారో తెలియడం లేదు. – అమానుల్లా, రాగంపేట, చొప్పదండి మండలం, కరీంనగర్​ జిల్లా

ఓబీసీ సర్టిఫికెట్ కోసం ..

పోస్టల్ డిపార్ట్మెంట్​లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు కు ఈ నెల14 దాకానే గడువుంది. నేను క్యాస్ట్ ఇన్​కాం, ఓబీసీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేస్తే ఓబీసీ తప్ప అన్ని ఇచ్చారు. అంతలోనే తహసీల్దార్ హత్యకు గురైంది. దీంతో ఓబీసీ సర్టిఫికెట్ కోసం రోజూ తిరుగుతున్న. – అనీఫ్ అలీ, నెన్నెల, మంచిర్యాల జిల్లా

పాస్​బుక్​ కోసం తిరుగుతున్న..

కొత్త పాస్​బుక్​ కోసం కొన్ని రోజుల నుంచి తహసీల్దార్​ ఆఫీసు చుట్టూ తిరుగుతన్న. అప్పట్ల రేపు, మాపు అంట తిప్పిన్రు. పది రోజుల నుంచైతే  ఆఫీసు తాళం తీయట్లేదు. రోజూ పొద్దున వచ్చి, పొద్దూకె దాకా ఇక్కడే కూర్చుంటున్న.  పాస్​బుక్​ లేక రైతుబంధు రావట్లే. నాకు న్యాయం చేయాలె. – బుచ్చా, మన్సూర్ తాండ, ఖమ్మం జిల్లా

The works of the Revenue and Police Departments in the state is currently pending