చనిపోయిందనుకుని శ్మశానానికి తీసుకెళ్తుండగా యువతిలో కదలిక

చనిపోయిందనుకుని శ్మశానానికి తీసుకెళ్తుండగా యువతిలో కదలిక

మహదేవపూర్, వెలుగు: చనిపోయిందనుకొని యువతిని స్మశానానికి తీసుకెళ్తుండగా కదలిక కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో యువతి చనిపోయిందని డాక్టర్లు కన్ఫామ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు తిరిగి యువతి డెడ్​బాడీని శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలో బుధవారం జరిగింది. కుదురుపల్లికి చెందిన మెండ లక్ష్మయ్య, లక్ష్మీల కూతురు గీతాంజలి(19)  కొద్ది రోజులుగా జ్వరంతో ఉంది. బుధవారం తెల్లవారుజామున గీతాంజలి చలనం లేకుండా ఉండిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని రిలేటివ్స్, గ్రామస్తుల సమక్షంలోనే ఆమె బాడీని శవపేటికలో పెట్టి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. స్మశానానికి తీసుకెళ్తుండగా దింపుడు కళ్లెం దగ్గర శవపేటికను తెరిచి చూడగా యువతి నుంచి మూలిగిన శబ్ధం వినిపించడంతో.. వెంటనే అంబులెన్సులో మహదేవ్ పూర్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు.. టెస్టులకు తీసుకెళ్లి యువతిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆప్పటికే ఆలస్యమయిందని, గీతాంజలి చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు డెడ్ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు గ్రామస్తులు చెప్పారు. అయితే,  వారం రోజులకు పైగా యువతి జ్వరంతో ఉన్నా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లలేదని, ప్రార్థనలతో నయమవుతుందని ఫోన్ లలో ప్రేయర్లు చేయిస్తూ ఆమె చనిపోవడానికి కారకులయ్యారని కొందరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.