రూల్స్ పాటిస్తాం.. సిన్మాలు ఆడనీయండి

రూల్స్ పాటిస్తాం.. సిన్మాలు ఆడనీయండి

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి నుంచి సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్స్‌‌లు మూతబడే ఉన్నాయి. షాపింగ్‌‌ మాల్స్‌‌, మార్కెట్లు, ఆఫీసులు మొదలైన వాటిని ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్లిచ్చిన ప్రభుత్వం, సినిమా థియేటర్లను ఓపెన్‌‌ చేసుకోవడానికి అన్‌‌లాక్‌‌ 2.0 లో కూడా అనుమతివ్వలేదు. లాక్‌‌డౌన్‌‌తో ఇప్పటికే భారీగా నష్టపోయామని, అనుమతులివ్వడంపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని సినిమా థియేటర్స్‌‌, మల్టీప్లెక్స్‌‌ సెక్టార్‌‌‌‌ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇండియన్‌‌ ఫిల్మ్ ఇండస్ట్రీకి సినిమా థియేటర్లే వెన్నెముక అని, ఈ ఇండస్ట్రీపై పది లక్షల మందికి పైగా ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు. ఎకానమీ రీఓపెన్‌‌ అవుతున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. వీటిని ఓపెన్‌‌ చేసుకోవడానికి పర్మిషన్లివ్వక పోవడంపై మల్టీప్లెక్స్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(ఎంఏఐ) ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉంది. తొందరగా ఓ నిర్ణయం తీసుకుంటే వనరులను సమకూర్చుకోవడానికి వీలుంటుందని ఈ అసోసియేషన్‌‌ తెలిపింది. ఫ్రాన్స్‌‌, ఇటలీ, స్పెయిన్‌‌, యూఏఈ, అమెరికా వంటి దేశాలలో సేఫ్టీ ప్రొటోకాల్స్‌‌ను మెయింటైన్‌‌ చేస్తూ సినిమా థియేటర్లను ఓపెన్‌‌ చేసుకోవడానికి అవకాశమిచ్చారని ఎంఏఐ గుర్తుచేసింది. ఇతర సెక్టార్ల మాదిరిగానే కంటైన్‌‌మెంట్‌‌ జోన్లను మినహాయించి మిగిలిన చోట్ల ఓపెన్‌‌ చేసుకోవడానికి తమకూ అవకాశం ఇవ్వాలని కోరింది. దేశంలో ఎకానమీ తిరిగి ఓపెన్‌‌ అవుతోంది. డొమెస్టిక్ ట్రావెల్స్‌‌, ఆఫీసులు, స్ట్రీట్‌‌ మార్కెట్లు, షాపింగ్‌‌ కాంప్లెక్స్‌‌లను ఓపెన్‌‌ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌‌లను ప్రొహిబిటెడ్‌‌ లిస్ట్‌‌లో ఉంచడంపై అసంతృప్తిగా ఉన్నామని ఎంఏఐ మెంబర్‌‌‌‌ అలోక్‌‌ టాండన్‌‌ అన్నారు.

సినిమా ఇండస్ట్రీకి థియేటర్లే ముఖ్యం..

విద్యాసంస్థలు, మెట్రో రైల్‌‌ సర్వీస్‌‌లు, సినిమా హాల్స్‌‌ను, జిమ్స్‌‌ను క్లోజ్‌‌లోనే ఉంచాలని అన్‌‌లాక్‌‌ 2.0 గైడ్‌‌లైన్స్‌‌లో ప్రభుత్వం పేర్కొంది. అనార్గనైజ్డ్‌‌ సెక్టార్‌‌‌‌లా కాకుండా మల్టీప్లెక్స్‌‌లు, సినిమా థియేటర్లలో జనాలను అదుపు చేయడానికి, సోషల్‌‌ డిస్టెన్సింగ్‌‌ను పాటించడానికి వీలుంటుందని టాండాన్‌‌ అన్నారు. దేశంలో మల్లిప్లెక్స్‌‌లు, సినిమా థియేటర్లు రెండు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. మరోవైపు స్పాట్‌‌ బాయ్స్‌‌ నుంచి మేకప్‌‌ ఆర్టిస్టులు, డిజైనర్లు, ముజిషియన్లు, డైరెక్టర్లు, యాక్టర్లు వరకు 10 లక్షల మంది సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. ఈ ఫిల్మ్‌‌ ఇండస్ట్రీ 60 శాతానికి పైగా సినిమా థియేటర్లపైనే ఆధారపడి ఉందని, తమకు అనుమతులివ్వడంతో ఇండియన్‌‌ ఫిల్మ్‌‌ ఇండస్ట్రీ కూడా తిరిగి కోలుకోవడానికి వీలుంటుందని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం అనుమతులిచ్చినా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌‌ సెక్టార్‌‌‌‌ తిరిగి కోలుకోవడానికి సుమారుగా 36 నెలల టైమ్‌‌ పడుతుందని టాండన్‌‌ చెప్పారు. తిరిగి షూటింగ్‌‌లు స్టార్ట్‌‌ కావడంలో ఆలస్యమవుతుందని, కస్టమర్లు కూడా సినిమా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించకపోవచ్చని పేర్కొన్నారు.

ఓటీటీలోనే సినిమాలు రిలీజ్​

థియేటర్లు బంద్‌‌ ఉండడంతో తాజాగా కొన్ని సినిమాలను డైరక్ట్‌‌గా అమెజాన్‌‌, నెట్‌‌ఫ్లిక్స్‌‌ వంటి ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌‌లోనే రిలీజ్‌‌ చేస్తున్నారు. ఏడు సినిమాలను డైరక్ట్‌‌గా తమ ప్లాట్‌‌ఫామ్‌‌లోనే రిలీజ్‌‌ చేయనున్నామని డిస్నీ+హాట్‌‌స్టార్‌‌‌‌ గత వారం ప్రకటించింది. గతంలో గులాబో సితాబో అమెజాన్‌‌ ప్రైమ్‌‌ వీడియోలో డైరక్ట్‌‌గా రిలీజ్‌‌ అయ్యింది.