V6 News

మూడేళ్లయినా పూర్తి కావట్లే..స్లోగా తీగల గుట్టపల్లి ఆర్వోబీ పనులు

మూడేళ్లయినా పూర్తి కావట్లే..స్లోగా తీగల గుట్టపల్లి ఆర్వోబీ పనులు
  •     రోజుకు 15 నుంచి 20 సార్లు పడుతున్న రైల్వే గేట్
  •     ఎమర్జెన్సీ టైంలో ఆగిపోతున్న అంబులెన్స్‌‌లు 
  •     ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్– మంచిర్యాల రహదారిలోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి మూడేళ్లు కావొస్తున్నా.. ఆర్వోబీ నిర్మాణం పూర్తి కాలేదు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డులో రైల్వే గేటు పడిందంటే తిప్పలు తప్పడం లేదు. యాక్సిడెంట్లు, హార్ట్ ఎటాక్‌‌కు గురైన పేషెంట్లను అత్యవసర పరిస్థితుల్లో తీసుకెళ్లే అంబులెన్స్‌‌లు సైతం గేటు పడిందంటే ఆగిపోతున్నాయి. సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఆగిపోవడంతో పేషెంట్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.  

రోజులో 15 నుంచి 20 సార్లు గేట్ పడుతుండడంతో అటువైపుగా వెళ్లే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన పేషెంట్‌‌ను అత్యవసరంగా సివిల్ హాస్పిటల్‌‌కు తీసుకెళ్తున్న ఓ అంబులెన్స్ రైల్వే గేటు పడడంతో 15 నిమిషాలపాటు ఆగిపోవాల్సి వచ్చింది. 

రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే స్లోగా పనులు

కేంద్ర ప్రభుత్వం సేతు బంధన్ స్కీమ్ కింద కరీంనగర్– చొప్పదండి మార్గంలో తీగలగుట్టపల్లి వద్ద రైల్వే గేట్ మీదుగా ఆర్వోబీ నిర్మించేందుకు రూ.128 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.28 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.156 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు లేన్లతో  750 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది. 2023 జూలై 18న అప్పటి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

ఇప్పటివరకు నాలుగు లైన్లలో రెండు లేన్లకు సంబంధించి ఇరువైపులా భారీ పిల్లర్లు, వాటి మీద బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావొచ్చింది. రైల్వే ట్రాక్ మీదుగా రెండు వైపులా బ్రిడ్జిని అనుసంధానించాల్సి ఉంది. ఈ బ్రిడ్జి విషయంలో స్ట్రక్చరల్ డిజైన్స్, డ్రాయింగ్‌‌ను కాంట్రాక్టర్‌‌‌‌కు అందజేయడలంలో రైల్వే శాఖ ఆలస్యం చేసింది. నిరుడు ఏప్రిల్‌‌లో డిజైన్లు అందాక గతంలో ఉన్న రైల్వే గేటు రోడ్డును మూసి వేసి.. పక్కన కొద్దిదూరం నుంచి వాహనాల రాకపోకలను మళ్లించారు. కానీ పనులు మాత్రం వేగవంతం చేయలేదు. 

కేంద్ర మంత్రి ఆదేశించినా స్పీడందుకోవట్లే.. 

ఆర్వోబీ పనులను గతంలో పలుమార్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆర్‌‌‌‌అండ్‌‌బీ ఆఫీసర్లు, కాంట్రాక్టర్‌‌‌‌ను ఆదేశించారు. అయినా పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడంలేదు. తీగలగుట్టపల్లి ఆర్వోబీని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పలుమార్లు డిమాండ్ చేసినా, అధికారులతో మాట్లాడినా ఫలితం కనిపించడం లేదు. బ్రిడ్జి సమస్య పొలిటికల్ లీడర్లకు తరచూ ఎజెండాగా మారుతుందే తప్పా.. పనులు మాత్రం పూర్తి కావడం లేదని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.