హైదరాబాద్: గ్రేటర్ సైబరాబాద్ పరిధిలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ ఘటన కలకలం రేపింది. నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లో ఆదివారం(సెప్టెంబర్ 27) తెల్లవారుజామున సుమారు 3.20 గంటల సమయంలో దుండగులు చోరీకి పాల్పడినట్లు సమాచారం.సుమారు ఆరుగురు అనుమానితులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరు ‘చడ్డీ గ్యాంగ్’కు చెందినవారై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అపార్ట్మెంట్ వెనుక వైపు చెరువు ప్రాంతానికి ఉన్న బౌండరీ ఫెన్సింగ్‌ను కత్తిరించి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు సమాచారం. అనంతరం మెట్ల మార్గం ద్వారా సీ బ్లాక్‌లోకి వెళ్లిన వారు, నగరంలో లేని ఓ కుటుంబానికి చెందిన ఫ్లాట్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది.ఫ్లాట్‌లోని విలువైన వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. అయితే చోరీకి గురైన వస్తువుల పూర్తి వివరాలు, వాటి విలువపై పోలీసులు విచారణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
చోరీ సమయంలో మరో అపార్ట్మెంట్ వాసి అనుమానితుల కదలికలను గుర్తించినట్లు తెలుస్తోంది. వారిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, అనుమానితులు అతడిపై దాడికి యత్నించినట్లు సమాచారం. వారి వద్ద ఆయుధాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.అదే సమయంలో పాల సరఫరా చేసేందుకు వచ్చిన వ్యక్తి సైతం అపార్ట్మెంట్ పరిసరాల్లో అనుమానాస్పద కదలికలను గమనించినట్లు సమాచారం.
►ALSO READ | హైదరాబాద్-బెంగళూరు హైవేపై రన్నింగ్ కారులో మంటలు.. క్షణాల్లో పూర్తిగా దగ్ధం
ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు వెంటనే అపార్ట్‌మెంట్‌కు చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అపార్ట్మెంట్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫుటేజీ ఆధారంగా అనుమానితులను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది.
నెక్నాంపూర్, అల్కాపూర్ టౌన్‌షిప్‌తో పాటు పరిసర కాలనీల్లో రాత్రి వేళ పోలీసుల పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు. అపార్ట్మెంట్ల వెనుక వైపు, ఖాళీ ప్రదేశాలు, చెరువు ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, స్థానికుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అనుమానితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
