బస్సులో చోరీ…ఆటోలో పరారీ

బస్సులో చోరీ…ఆటోలో పరారీ

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ జేబు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కె.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బహుదూర్​పురాకు చెందిన మహమూద్ రహీం ఖాన్, షేక్ అహ్మద్​లు బస్సుల్లోని ప్రయాణికుల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు . ఈనెల16న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికు చెందిన మహమూద్ షంషుద్దీన్ కిరాణా సరుకులు కొనేందుకు సిటీకి వచ్చాడు. సికింద్రాబాద్ నుంచి బస్సులో బేగంబజార్​కు బయలుదేరాడు. అబిడ్స్ జీపీఓకి బస్సు చేరుకోగానే జేబును చెక్​చేసుకున్నాడు. తాను తెచ్చిన రూ.లక్ష రూపాయలను ఎవరో జేబు కత్తిరించి దొంగలించినట్లు గుర్తించాడు. వెంటనే బస్సు నిలిపి బస్సులోని అందరినీ తనిఖీ చేశారు. దొరక్కపోవడంతో షంషుద్దీన్ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని ఎసై సంపత్ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. లిబర్టీ చౌరస్తా నుంచి ఎంజే మార్కెట్ వరకు ఉన్న 35 సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ వ్యక్తి బస్సు నుంచి అనుమానాస్పదంగా దిగి వెంటనే వెనుక ఉన్న ఆటోలో ఎక్కి వెళ్లాడని గుర్తించారు. ఆటో నెంబర్ ఆధారంగా బహుదూర్ పురా ప్రాంతానికి చెందిన మహమూద్ రహీం ఖాన్ , షేక్ అహ్మద్ లను అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు.

ఫుట్​బోర్డుపై మకాం…

రద్దీగా ఉండే బస్సుల్లో ఒకరు ప్రయాణించడం, మరొకరు బస్సును ఆటోలో అనుసరిస్తూ ఉండేవారు. ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ ప్రయాణికుల నుంచి డబ్బు, విలువైన వస్తువులను దొంగిలించి సిగ్నెల్స్, ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో బస్సు దిగి వెనుకనే ఉండే ఆటో ఎక్కి అక్కడి నుంచి పారిపోయే వారిమని నిందితులు మహమూద్ రహీం ఖాన్, షేక్ అహ్మద్​వెల్లడించారు. షంషుద్దీన్ ఫిర్యాదుతో ఇద్దరిని అదుపులోకి తీసుకొని రూ.81 వేల నగదు, ఆటోను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. వీరికి సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని
సీఐ రవి కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన ఎసై సంపత్, సిబ్బందిని సీఐ అభినందించారు.