
తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం పాలవక్కంలోని తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. రెండ్రోజులుగా ఫోన్ తీయకపోవడంతో అతని మిత్రుడు ప్రదీప్ ఇంటికి వెళ్లి చూడగా ఆయన చనిపోయిన విషయం తెలిసింది. తలకు బలమైన గాయం తగలడం లేదా గుండెపోటుతో మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
విలన్, కమెడియన్‌గా అలరించిన ప్రదీప్.. టెడ్డీ, ఇరుంబు తిరై, లిఫ్ట్, ఆడై వంటి సినిమాల్లో నటించారు. ప్రదీప్‌కు ఇంకా పెళ్లి కాలేదు. చెన్నైలోని పాలవాక్కమ్‌లో గల ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. ప్రదీప్ కు తరచుగా ఊపిరి ఆడకపోవడం, తలతిరగడం వంటివి వస్తాయని అతని స్నేహితులు చెబుతున్నారు.
ప్రదీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీని రిపోర్ట్ రావాల్సి ఉంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రదీప్ మృతిపై సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.