రిజిస్ట్రేషన్ల శాఖ, కమర్షియల్ ట్యాక్స్ లో సిబ్బంది కొరత

రిజిస్ట్రేషన్ల శాఖ, కమర్షియల్ ట్యాక్స్ లో సిబ్బంది కొరత

హైదరాబాద్, వెలుగురిజిస్ట్రేషన్ల శాఖ, కమర్షియల్​ ట్యాక్స్​లో సిబ్బంది కొరత వేధిస్తోంది. వివిధ కేటగిరీల్లో రిజిస్ట్రేషన్ల శాఖలో 364 పోస్టులు, కమర్షియల్​ ట్యాక్స్​లో 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్​రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో 1,302 మంది ఉద్యోగుల అవసరం ఉంది. కానీ, 938 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 364 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  వీటిలో ప్రధానంగా సబ్​రిజిస్ట్రార్​/సూపరింటెండెంట్‌–2 పోస్టులు 30,  జూనియర్​ అసిస్టెంట్​ 158, షరాఫ్​ 65, ఆఫీస్​ సబార్డినేట్​ 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో ఆఫీసులో 11 నుంచి 15 మధ్య ఉద్యోగులు కావాల్సి ఉన్నా కేవలం నలుగురైదుగురే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రైవేట్​ వ్యక్తులను తొలగించడంతో ఆ సంఖ్య ముగ్గురికి పడిపోయింది. రోజూ వందలాది దరఖాస్తులు వస్తుండడంతో కొందరు ప్రైవేట్​ డాక్యుమెంట్​ రైటర్లను రిజిస్ట్రార్లు నియమించుకున్నారు. వాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. మే 30న యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్​ ఆఫీసుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నలుగురు సిబ్బందే ఉన్నా ఐదు నెలల్లోనే 16,600 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించారు. దీంతో ప్రైవేట్​ వ్యక్తులను తీసుకోవద్దంటూ స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్​ శాఖ ఐజీ చిరంజీవులుకు ఏసీబీ సూచించింది. వెంటనే వాళ్లను తీసేయాల్సిందిగా జూన్​ 1న చిరంజీవులు రిజిస్ట్రార్లకు ఉత్తర్వులిచ్చారు.

కమర్షియల్​ ట్యాక్స్​లో 250 ఖాళీలు

ఏటా కమర్షియల్​ ట్యాక్స్​ ఆదాయం, రిటర్న్స్​ పెరుగుతున్నా అందుకు తగ్గట్టు సిబ్బందిని మాత్రం నియమించట్లేదు. ప్రస్తుతం 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటెండర్​ నుంచి కమిషనర్​ వరకు 1674 మంది ఉద్యోగులున్నారు.  జీఎస్టీ వచ్చాక ఉన్న ఉద్యోగులపైనే అదనపు పనిభారం పడింది. దీంతో 3500 నుంచి 4 వేల వరకు సిబ్బంది సంఖ్యను పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రతి సర్కిల్​లో 8 నుంచి 10 మంది మాత్రమే ఉండగా ఆ సంఖ్యను 20 నుంచి 30కి పెంచాలని డిమాండ్​ చేస్తున్నారు. హైదరాబాద్​కు బదిలీ అయిన ఉద్యోగులకు హెచ్​ఆర్​ఏ 30 శాతం ఇవ్వాల్సి ఉండగా, 12 నుంచి 14 శాతం మాత్రమే ఇస్తున్నారు.