317 జీవో వెనకాల ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయి

317 జీవో వెనకాల ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయి
  • భార్యా భర్తలు వేర్వేరు జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి
  • సీనియర్లు అర్బన్ కు.. జూనియర్లు రూరల్ కు వెళ్తున్నారు
  • తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన 317 జీవో వెనకాల ఎన్నికుట్రలు దాగి ఉన్నాయి.. కేసీఆర్ అధికారం కోసం ఏమైనా చేస్తాడు.. భార్యా భర్తలు వేర్వేరు జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి.. సీనియర్లు పట్టణ ప్రాంతాలకు.. జూనియర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సోమాజిగూడలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జీవో 317 రద్దు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.  కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కో-ఇంచార్జ్ ఇందిరా శోభన్, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కో-ఇంచార్జి ఇందిరా శోభన్ మాట్లాడుతూ రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి దారుణంగా తయారైందని, ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎండి అయిన తర్వాతే ఒకటో తారీఖు నాడు ఆర్టీసీ కార్మికులకు వేతనాలు వస్తున్నాయన్నారు. అప్పట్లో జయశంకర్ సార్  అన్నాడు...తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉద్యోగాల కోసం మరో పోరాటం చేయవలసి వస్తుందన్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వమే కేసీఆర్ ను పెంచి పోషిస్తోందని ఆమె ఆరోపించారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంలో కేసీఆర్ కే క్లారిటీ లేదన్నారు. ఎన్జీవో నాయకులు ప్రభుత్వానికి బానిసలు గా మారారు అని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. అమరవీరుల కుటుంబాల సభ్యులను ఒక్కనాడైనా  ప్రగతి భవన్ పిలిచి బుక్కెడు బువ్వ పెట్టిన పాపాన పోలేదు  కేసీఆర్ అని విమర్శించారు. బదిలీల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల బాధ్యత  పూర్తిగా  ప్రభుత్వమే తీసుకోవాలని, రాష్ట్రంలో 317 జీవోను రద్దు చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. అలాగే స్థానిక ఉద్యోగులకు స్థానికంగా ఉండే ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు ఆత్మ హత్యలు చేసుకోవద్దని ఆమె సూచించారు. 

 

 

ఇవి కూడా చదవండి..

రైతుబంధు వారోత్సవం.. భారీగా ట్రాఫిక్ జామ్

అధికార పార్టీ నేతలే కోవిడ్ రూల్స్ పాటించడం లేదు

జీవో317 ఉద్యోగులకు యమపాశంగా మారింది