సర్కార్ దవాఖాన్లలో  కార్డియాక్ సేవల్లేవ్

సర్కార్ దవాఖాన్లలో  కార్డియాక్ సేవల్లేవ్
  • రెండేండ్లుగా  పట్టించుకోని సర్కార్
  • రోగులను ప్రైవేటుకు పంపుతున్న డాక్టర్లు
  • ఆరోగ్యశ్రీ కింద వేలల్లో సర్జరీలు 
  • ఖజానాకు వందల కోట్ల గండి
  • బాధితులకు ప్రైవేటులో రూ.లక్షల్లో ఖర్చు
  • ఉస్మానియా, గాంధీలో పనిచేయని క్యాథల్యాబ్స్‌‌


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేదోనికి గుండె జబ్బులొస్తే సర్కారు వైద్యానికి దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్‌‌లో క్యాథల్యాబ్ ఏడాదిన్నరగా పని చేయడం లేదు. గాంధీలో ఉన్న ల్యాబ్ రెండేళ్లుగా పనిచేస్తలేదు. ఈ రెండింటిలో తప్ప మరే ప్రభుత్వ దవాఖాన్లలోనూ క్యాథల్యాబ్స్‌‌, కార్డియాలజీ సేవలు లేవు. దీంతో ఈ దవాఖాన్లకు వచ్చే గుండె జబ్బుల పేషెంట్లను డాక్టర్లు ప్రైవేటుకు రెఫర్ చేస్తున్నారు. పేదరికంతో చాలా మంది ప్రైవేటుకు వెళ్లలేక మెడిసిన్ వాడుతూనే మరణిస్తున్నారు. ఇంకొంత మంది ట్రీట్​మెంట్ ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకుంటూ, అప్పులు చేస్తూ నిరుపేదలుగా మారుతున్నారు. మరోవైపు ఏటా ఆరోగ్య శ్రీలో కేవలం గుండె జబ్బుల ఆపరేషన్లకు చెల్లించేది దాదాపు రూ.200 కోట్లపైన ఉంటుంది. ఏటా ఇన్ని డబ్బులు ప్రైవేటు దవాఖాన్లకు ధారపోస్తున్న సర్కార్.. ప్రభుత్వ దవాఖాన్లలో మాత్రం కనీస సౌలత్​లు కల్పిస్తలేదు.
బ్యాటరీల్లేక రెండేండ్లుగా మూలకు
ఉస్మానియా ల్యాబ్‌‌లోని యంత్రాల గడువు 2016లోనే ముగిసింది. ఆ తర్వాత కూడా దానికే రిపేర్లు చేపిస్తూ నెట్టుకొచ్చారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ మిషన్ పూర్తిగా పనిచేయడం లేదు. యుద్ధప్రాతిపదికన కొత్త ల్యాబ్ ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చివరకు ఆరోగ్యశ్రీ కింద వచ్చిన నిధులతో క్యాథల్యాబు ఏర్పాటు చేయాలని హాస్పిటల్ మేనేజ్​మెంట్ నిర్ణయించింది. ప్రస్తుతం ల్యాబ్ పనులు నత్తనడకన సాగుతుండగా, ఇంకో ఆర్నెళ్లైనా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. గాంధీలో కరోనాకు ముందు నుంచే క్యాథల్యాబ్స్ పనిచేయడం లేదు. కరోనా హాస్పిటల్‌‌గా మార్చాక కార్డియాలజీ సేవలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఫస్ట్ వేవ్ తర్వాత నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించినా, క్యాథల్యాబ్ బ్యాటరీస్‌‌లో సమస్య ఉందని సర్జరీలు చేయలేదు. ఇప్పటికీ ఆ బ్యాటరీల సమస్య అలాగే ఉండడం గమనార్హం. రిపేర్ చేపిస్తే రోజుల వ్యవధిలో పరిష్కరమయ్యే సమస్యను నెలల తరబడి సాగదీస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
ప్రైవేటుకు పోలేక ప్రాణాలు వదుల్తున్నరు
గాంధీ, ఉస్మానియాకు దవాఖాన్లకు రోజూ 200 నుంచి 250 మంది రకరకాల గుండె జబ్బులతో వస్తున్నారు. వీళ్లను పరీక్షిస్తున్న డాక్టర్లు టెస్టులు, సర్జరీల కోసం నిమ్స్‌‌కు, ప్రైవేటు హాస్పిటళ్లకు రిఫర్ చేస్తున్నారు. నిమ్స్‌‌కు రోగుల తాకిడి పెరగడంతో ఆపరేషన్ల కోసం వెయిటింగ్ లిస్ట్‌‌ ఉంటోంది. దీంతో బాధితులకు ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లక తప్పడం లేదు. ప్రైవేటు హాస్పిటళ్లలో గుండె సంబంధిత ఆపరేషన్లకు రూ.లక్షల్లో బిల్లులు వేస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ వాటి ప్యాకేజీల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ నుంచి వచ్చే డబ్బులకు అదనంగా పేషెంట్ మరికొంత భరిస్తే తప్ప, సర్జరీలు చేసేందుకు హాస్పిటళ్ల యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. నిమ్స్‌‌లో కూడా సర్జికల్స్‌‌, మెడిసిన్ కోసం ఆరోగ్యశ్రీ రోగులను బయటకే పంపుతుండడం గమనార్హం.
ఖజానాకు కోట్లలో ఖర్చు
రాష్ట్రంలో గుండె సంబంధిత రోగాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ కోసం పెట్టే ఖర్చులో ఏటా రూ.200 కోట్లు కార్డియాలజీ చికిత్సల కోసమే పెడుతున్నారు. ఏటా 29 వేల మంది గుండె సంబంధిత వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్నారు. ఒక్కో కార్పొరేట్ హాస్పిటల్‌‌లో నెలకు సగటున 300 మందికి స్టంట్లు వేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆగస్ట్ చివరి నాటికే ఆరోగ్యశ్రీ కింద 16,600 మంది గుండె సంబంధిత రోగాలకు ట్రీట్‌‌మెంట్ తీసుకున్నారు. ప్రైవేటు హాస్పిటళ్లకు వందల కోట్లు ధారపోస్తున్న సర్కార్.. ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ దవాఖాన్లలో సేవలను మెరుగుపర్చడంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.
నేర్చుకునుడు ఎట్ల?
ఉస్మానియా మెడికల్ కాలేజీలో 7, గాంధీ కాలేజీలో 3 కార్డియాలజీ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం రెండు కాలేజీల్లో కలిపి 30 మంది కార్డియాలజీ స్పెషాలిటీ స్టూడెంట్లు ఉన్నారు. క్యాథల్యాబ్స్ పనిచేయకపోవడంతో ఆపరేషన్లు చేయడం నేర్చుకునే అవకాశం వీరికి దక్కడం లేదు. ఇప్పటికే గాంధీలో రెండు బ్యాచ్​ల స్టూడెంట్లు, ఉస్మానియాలో ఓ బ్యాచ్‌‌ స్టూడెంట్లు ఆపరేషన్లు చేయడం నేర్వకుండానే సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేశారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో అసిస్టెంట్లుగా చేరి ఆపరేషన్లు చేసుడు నేర్చుకుంటున్నామని వారు చెబుతున్నారు. తమ పరిస్థితి ఏంటని ప్రస్తుతం ఉన్న స్టూడెంట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రఫీ, వాల్వ్ రిప్లేస్‌‌మెంట్, పేస్‌‌మేకర్ వేయడం, నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం, స్టంట్స్ వేయడం వంటివన్నీ క్యాథల్యాబ్‌‌లోనే చేస్తారు. అసలు ల్యాబ్ లేకపోవడంతో అవేవీ నేర్చుకునే అవకాశం కార్డియాలజీ స్టూడెంట్లకు దక్కడం లేదు.


వందల్లో వస్తున్నరు
15 ఏండ్ల కిందట నేను ప్రాక్టీస్‌‌ స్టార్ట్ చేసినప్పుడు, గుండె జబ్బులతో 65 ఏండ్ల వాళ్లు ఎక్కవ మంది వచ్చేవారు. ఇప్పుడు. 40-–45 ఏండ్ల మధ్య వయసు వాళ్లు వస్తున్నారు. వర్క్ ప్రెజర్, మారిన ఫుడ్ హాబిట్స్‌‌, ఫిజికల్ వర్క్ లేకపోవడం వల్ల చాలా యంగ్ ఏజ్‌‌లో హార్ట్ ప్రాబ్లమ్స్‌‌ వస్తున్నాయి. సడెన్ స్ట్రోక్‌‌తో చనిపోయేవాళ్ల సంఖ్య పెరిగింది. హార్ట్ రిలేటెడ్ సమస్యలతో వందల మంది వస్తున్నారు. మా దగ్గర నెలకు 250 నుంచి 300 సర్జరీస్ చేస్తున్నాం.
                                                                                                                     ‑ డాక్టర్ కృష్ణ ప్రసాద్‌‌, కార్డియో థొరాసిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్‌‌


కళ్ల ముందే చనిపోతున్నరు
ఇప్పుడు నేను ఫైనల్‌‌ ఇయర్‌‌‌‌.. ఇప్పటివరకూ క్యాథల్యాబ్స్‌‌కు మినిమమ్ ఎక్స్‌‌పోజర్ లేదు. ఏడాదిన్నర నుంచి క్యాథల్యాబ్ పనిచేస్తలేదు. మా సీనియర్లు సర్జరీలు చేయడం నేర్చుకోకుండానే బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు బయట హాస్పిటళ్లలో అసిస్టెంట్లుగా చేరి నేర్చుకుంటున్నారు. మా పరిస్థితి కూడా అదే అవుతుందేమో అనిపిస్తోంది. హార్ట్ ప్రాబ్లమ్స్‌‌తో ఓపీకి రోజూ వంద మంది వస్తున్నారు. కొంత మందికి మెడిసిన్‌‌ ఇచ్చి పంపిస్తున్నాం. ఇంకొంత మందిని నిమ్స్‌‌కు, ప్రైవేటు హాస్పిటల్స్‌‌కు రిఫర్ చేస్తున్నాం. ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లలేని వాళ్లు మెడిసిన్ వాడుతూనే ప్రాణాలు కోల్పోతున్నారు. అన్ని తెలిసినా ఏం చేయలేక పోతున్నాం.                                                                                                               ‑ కార్డియాలజీ స్టూడెంట్‌‌, ఉస్మానియా