అనాథలకు నీడ లేదు!

అనాథలకు నీడ లేదు!

కొత్త జిల్లాల్లో కనిపించని బాలసదన్లు, శిశుగృహాలు
ఉన్నవి సైతం మూతపడుతున్నయ్
పెరుగుతున్న ప్రైవేట్ ఆశ్రమాలు

నల్గొండ, వెలుగు: అనాథ శిశువులు, పిల్లల ఆలనాపాలనా చూసే శిశుగృహాలు, బాలసదన్లు కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఆరేళ్లలోపు అనాథ చిన్నారులను శిశుగృహాల్లో, 7 నుంచి 18 సంవత్సరాలున్న వారికి బాలసదన్లో ఆశ్రయం కల్పించాలి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో బాలసదన్లు, శిశుగృహాలు పనిచేస్తున్నాయి. జిల్లాల పునర్విభజన జరిగాక కొత్త జిల్లాల్లో మాత్రం వీటిని ఏర్పాటు చేయలేదు. వీటిని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు కేంద్రం మంజూరు చేస్తుంది. నిర్వహణకు కేంద్రం 60 శాతం నిధులు కేటాయిస్తే.. స్టేట్ గవర్నమెంట్ 40 శాతం భరించాల్సి ఉంటుంది. నిధుల వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రభుత్వం హోమ్స్ పెట్టకుండా నిరక్ష్ల్యంగా వ్యవహరిస్తోంది.

చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లతోనే సరి
పిల్లల సంరక్షణకు, పునరావాసం కల్పించేందుకు అన్ని జిల్లాల్లో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లను 2018లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిస్క్ నుంచి సేవ్ చేసిన పిల్లలను ఈ కమిటీ ముందు హాజరుపరిచాక వారి సంరక్షణ కోసం బాలసదన్లు లేదా శిశుగృహాల్లో ఉంచుతారు. అయితే అన్ని జిల్లాల్లో కేవలం కమిటీల నియామకం మాత్రమే జరిగింది తప్ప చైల్డ్ హోమ్స్ ఏర్పాటు చేయలేదు. దీంతో అనాథలు, రిస్క్ నుంచి కాపాడిన పిల్లలను ప్రైవేటు ఆశ్రమాలకు, పాత జిల్లా కేంద్రాల్లోని హోమ్స్ కు తరలిస్తున్నారు. జువెనైల్ డిపార్మ్టెంట్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా బాలుర కోసం హైదరాబాద్లో మాత్రమే ఒక బాలసదన్ పనిచేస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో బాలికల కోసం పాత జిల్లాల్లో బాలసదన్లు, శిశుగృహాలు
పనిచేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో కాపాడిన బాలురను అయితే హైదరాబాద్ లేదంటే ప్రైవేట్ ఆశ్రమాలకు తరలిస్తున్నారు. జువెనైల్ జస్టిస్ ప్రకారం పిల్లలను అనాథ ఆశ్రమాల్లో చేర్పించడం అనేది లాస్ట్ ఆప్షన్ మాత్రమే. సాధ్యమైనంత వరకు పిల్లలను దత్తత ఇవ్వడం లేదా తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని చట్టం చెప్తోంది. కానీ ప్రభుత్వం హోమ్స్ ఏర్పాటు చేయకపోగా ప్రైవేటు హోమ్స్ ను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 440 ప్రైవేటు హోమ్స్ ఉండగా, ఒక్క మేడ్చల్ ఏరియాలోనే 180 పైగా పనిచేస్తున్నాయి.

మూతపడ్డ బాలసదన్లు
రాష్ట్రంలో ప్రస్తుతం బాలికల కోసం 39 బాలసదన్లు ఉన్నప్పటికీ వీటిల్లో చాలావరకు మూతపడ్డాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి, మిర్యాలగూడెంలో బాలసదన్లు మూతపడగా, నల్గొండలో మాత్రమే పనిచేస్తోంది. అదేవిధంగా శిశుగృహాలు నల్గొండలో మాత్రమే ఉండగా సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఏర్పాటు చేయలేదు. సూర్యాపేటలో బాలసదన్ కూడా లేదు.

శిశుగృహాల్లోనే మగ్గుతున్న బాల్యం
రాష్ట్రవ్యాప్తంగా 2019 డిసెంబర్ నాటికి శిశుగృహాల్లో 327 మంది పిల్లలు ఉండగా, దీంట్లో తాత్కాలిక షెల్టర్ కింద 189 మంది ఉన్నారు. అడాప్షన్ జోన్లో 138 మంది పిల్లలు ఉన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల్లో గుర్తించిన 36 మంది చిన్నారులను తాత్కాలిక షెల్టర్
కల్పించడంలో భాగంగా కొందరిని ఆమనగల్లు ప్రైవేటు ఆశ్రమంలోనూ, ఆరేళ్లలోపు 14 మంది చిన్నారులను నల్గొండ శిశుగృహలో ఉంచారు. ఈ సంఘటన జరిగి మూడేళ్లు కావొస్తోంది. ప్రస్తుతం నల్గొండ శిశుగృహంలో చిన్నారుల వయస్సు ఆరేళ్లు దాటింది. వయసు పెరిగిపోతున్న పిల్లలను జువెనైల్ చట్టం ప్రకారం బాలసదన్లో చేర్పించాలి. లేదంటే పోలీస్, కోర్టుల సమన్వయంతో కేసు త్వరగా పరిష్కారమైతే దత్తత జోన్లోకి తీసుకొచ్చే అవకాశం ఉండేది. అలా జరగకపోవడంతో ప్రస్తుతం చిన్నారులను భువనగిరి తరలించాలని కమిషనర్ కు లెటర్ రాశారు. అయితే యాదాద్రి
జిల్లాలో బాలసదన్ లేకపోవడంతో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

పిల్లలు లేరని క్లోజ్ చేశాం
పిల్లలు లేకపోవడం, బాలసదన్ నిర్వహణకు స్టాఫ్ లేకపోవడంతో అనవసరంగా మెయింటెనెన్స్ చెల్లించాల్సి వస్తోందని క్లోజ్ చేశాం. యాదాద్రి జిల్లాలో గుర్తించిన పిల్లలు నల్గొండ శిశుగృహలో ఉంటున్నారు. ప్రతి జిల్లాకు పత్యేకంగా జిల్లా సంక్షేమ అధికారి ఉండగా, యాదాద్రి పిల్లలు నల్గొండలో ఎందుకు ఉంటున్నారని సీడబ్ల్యూసీ వాళ్లు అడిగారు. దీంతో కమిషనర్ ఆఫీసుకు లెటర్ కూడా వచ్చింది. అయితే ఐదో తరగతి వరకు మాత్రమే బాలసదన్ ఉంచాలనే రూల్ ఉంది. ఆ లోపు వయసున్న పిల్లలు ఎవరూ బాలసదన్లో ఉండటం లేదు.
– స్వరాజ్యం,యాదాద్రి జిల్లా ఏసీడీవో

For More News..

ఆర్టీపీసీఆర్ టెస్టులకు క్యూ కడుతున్న జనాలు

టెన్షన్లకి చెక్ పెట్టండిలా..

రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాలు దాటిన సాగు