సర్కారు బడుల్లో సార్లేరి?

సర్కారు బడుల్లో సార్లేరి?

హైదరాబాద్‌‌, వెలుగుసర్కారు బడులల్ల.. స్టూడెంట్ల సంఖ్యతో పోలిస్తే టీచర్లు భారీగానే ఉన్నారని చెప్తున్న రాష్ట్ర  ప్రభుత్వ పెద్దల మాటలకు కేంద్రం గట్టి సమాధానమిచ్చింది. రాష్ర్టంలో  32 శాతం అప్పర్‌‌ ప్రైమరీ స్కూళ్లలో మూడు సబ్జెక్ట్‌‌లకు, 8 శాతం హైస్కూళ్లలో 4 సబ్జెక్ట్‌‌లకు టీచర్లు లేరని లెక్కలతో సహా,  విద్యాశాఖలోని లోపాలను ఎత్తిచూపింది. వీటితో పాటు 2,379 బడుల్లో బాలురకు టాయ్‌‌లెట్స్‌‌ లేవని, మరో 1,878 బడుల్లో తాగునీటికీ తిప్పలేనని చెప్పింది. ప్రైమరీ స్థాయిలో సర్కారు, ఎయిడెడ్‌‌ బడుల్లో గతేడాది కంటే 6 శాతం ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ తగ్గిందని తెలిపింది. ఇవన్నీ  రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన లెక్కల నుంచే గుర్తించినట్టు పేర్కొంది. ముందు పాఠశాల విద్యా శాఖలోని లోపాలను సరిచేసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీలో మే 21న  రాష్ర్ట అధికారులతో ప్లానింగ్‌‌ అప్రూవల్‌‌ బోర్డు (పీఏబీ) సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వ 2019-–20 వార్షిక ప్రణాళికతో పాటు బడ్జెట్‌‌ ప్రతిపాదనలను పీఏబీ ముందు పెట్టారు. బడుల్లోని సమస్యలనూ పేర్కొన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌‌ఎస్‌‌ఏ) ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు రూ.౩ వేల కోట్లకుపైగా ఇవ్వాలని ప్రతిపాదనలను ఇచ్చారు. రూ.2631.61కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం ఓకే చేసినా ప్రస్తుతానికి రూ.1,825 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంట్లో కేంద్రం వాటా రూ.1,095 కోట్లు కాగా రాష్ర్ట ప్రభుత్వం వాటా రూ.730 కోట్లు. కేంద్ర నిధుల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌‌కు రూ.847.43 కోట్లు, హైస్కూళ్లకు రూ.240.36 కోట్లు, టీచర్‌‌ ఎడ్యుకేషన్‌‌కు రూ.7.45 కోట్లు ఇవ్వనున్నది. అక్టోబర్‌‌, నవంబర్‌‌లో సప్లిమెంటరీ పీఏబీ భేటీ నిర్వహించి మిగిలిన నిధులపై ఆలోచిస్తామని కేంద్రం చెప్పింది.

ఎస్‌‌ఎస్ఏ సిబ్బందికి పాత జీతాలే.. 

ఎస్‌‌ఎస్‌‌ఏ పరిధిలోని వేలాది కాంట్రాక్ట్‌‌, ఔట్‌‌సోర్సింగ్‌‌ ఉద్యోగుల జీతాల కోసం 2018–-19లో ప్రతిపాదించిన వేతనాలనే 2019-–20కూ అధికారులు ప్రతిపాదించారు. ఏటా 10 శాతమైనా పెంచాల్సి ఉన్నా పాత లెక్కలనే పంపించడంపై ఉద్యోగులు విమర్శిస్తున్నారు. వేతనాల్లో 60 శాతం కేంద్రం ఇస్తుండగా 40 శాతం రాష్ర్టం ఇవ్వాల్సి ఉంది. అయితే గతేడాది ప్రతిపాదించిన వేతనాలనే చెల్లించలేదు. కనీసం ఈ ఏడాది ప్రతిపాదించిన వేతనాలనైనా ఇస్తారో.. లేదో.. అని ఎస్‌‌ఎస్‌‌ఏ సిబ్బంది
సోచాయిస్తుండటం గమనార్హం.