జాబ్ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20 లక్షలు వసూలు!

జాబ్ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20 లక్షలు వసూలు!

మంచిర్యాల జిల్లా: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం పైరవీలు జోరందుకున్నాయి. కొంత మంది వ్యక్తులు గ్రూప్ గా ఏర్పడి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.  దీనికి సంబంధించిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీరాంపూర్‌ ఆర్కే న్యూటెక్‌ గని కార్మికుడితోపాటు భూపాలపల్లికి చెందిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్న దళారులు... సొమ్మును విడతల వారీగా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అభ్యర్థులకు ప్రశ్నాపత్రం ముందుగానే లీక్‌ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు, అందుకోసం అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. సమాచారం అందుకున్న సింగరేణి విజిలెన్స్ అధికారులు, పోలీసులు ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. 

జిల్లాకు చెందిన ఓ కోచింగ్ ఇన్సిట్యూట్ నిర్వాహడు ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రదారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అతడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సింగరేణి సంస్థ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 98 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సంబంధించిన పరీక్షను ఇవాళ నిర్వహించారు.