కాంగ్రెస్​ పార్టీకి కమల్ నాథ్ గుడ్ బై?

కాంగ్రెస్​ పార్టీకి కమల్ నాథ్ గుడ్ బై?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆ పార్టీని వీడుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. కమల్ నాథ్ కొడుకు, ఎంపీ నకుల్ నాథ్ తన ఎక్స్ బయో నుంచి కాంగ్రెస్‌‌‌‌ పేరును తొలగించారు. దీంతో నకుల్ నాథ్ కూడా తండ్రితో కలిసి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు బలం చేకూర్చింది. శనివారం కమల్ నాథ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మార్పు గురించి మీడియా అతన్ని ప్రశ్నించగా.. "అలాంటిది ఏదైనా ఉంటే, ముందుగా మీకే తెలియజేస్తాను" అని బదులిచ్చారు. కమల్ నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఛింద్వారా నుంచి 9 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన కొడుకు నకుల్ నాథ్ ఛింద్వారా నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.