మెడికల్ కాలేజీల్లో సీట్లు పెరిగాయి.. సార్లు లేరు?

మెడికల్ కాలేజీల్లో సీట్లు పెరిగాయి.. సార్లు లేరు?

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ర్టంలోని ప్రభుత్వ మెడికల్‌‌ కాలేజీల్లో ఇటీవల 300 ఎంబీబీఎస్‌‌ సీట్లు పెరిగాయి. మొత్తం సీట్ల సంఖ్య 1,550కి చేరింది. ప్రైవేటు కాలేజీల్లో మరో 450 సీట్లు పెరిగాయి. ఇవిగాక ఈడబ్ల్యూఎస్‌‌ కోటాలో మరో 300 సీట్ల వరకూ పెరిగే అవకాశముంది. ఇదంతా బాగానే ఉంది. ఇంత మంది విద్యార్థులకు చదువు చెప్పేందుకు ప్రభుత్వ కాలేజీల్లో సరిపడా ప్రొఫెసర్లు ఉన్నారా? అంటే లేరు. ఆగస్టు నుంచి ఎంబీబీఎస్‌‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి గందరగోళానికి గురి చేస్తోంది.

పట్టించుకోలే..

రెండు మూడ్రోజుల్లో నీట్‌‌ రాష్ర్ట మెరిట్ జాబితా విడుదల కానుంది. ఆ వెంటనే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు నుంచి ఎంబీబీఎస్‌‌ క్లాసులు ప్రారంభమయ్యేలా మెడికల్‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్‌‌ ఇండియా షెడ్యూల్‌‌ తయారు చేసింది. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రొఫెసర్ల కొరతపై దృష్టి పెట్టలేదు. ఇప్పటికిప్పుడు నియామకాలు చేపట్టేందుకు సిద్ధంగా లేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఎదుట రెండు మార్గాలున్నాయి. ప్రొఫెసర్ల వయసు పెంపు, టైమ్‌‌ బాండ్‌‌ ప్రమోషన్లు. ప్రభుత్వ కాలేజీల్లో ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 58 ఏండ్లు ఉంటే, ప్రైవేటు కాలేజీల్లో 70 ఏండ్లుగా ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో వయసు పెంపునకు కేంద్రం రెండేండ్ల క్రితమే అనుమతినిచ్చింది. దీంతో పలు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు పెంచారు. ఏపీలో 63 ఏండ్లుజేశారు. అయితే జూనియర్‌‌‌‌ డాక్టర్లు వ్యతిరేకిస్తుండటం, వేతనాల భారం వంటి పలు కారణాల వల్ల రాష్ర్ట ప్రభుత్వం తటపటాయిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 1,500 పోస్టులు ఖాళీగా ఉండగా, నెలకు ఒకరిద్దరు ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేస్తున్నారు.

పెంపు వద్దంటున్న జూనియర్లు

సర్కారు కాలేజీల్లో ప్రొఫెసర్‌‌ పోస్టులను నేరుగా భర్తీ చేయరు. అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌‌‌ పోస్టులను భర్తీ చేసి, అసోసియేట్లు, ఆ తర్వాత ప్రొఫెసర్లుగా ప్రమోషన్‌‌ ఇస్తారు. అయితే కొన్నేండ్లుగా అవసరమైన మేర అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేపట్టకపోవడంతో ఖాళీలు అలాగే ఉండిపోతున్నాయి. 2017లో టీఎస్‌‌పీఎస్సీ ద్వారా 274 అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ ఇచ్చినా, ఇప్పటికీ పూర్తి కాలేదు. మరోవైపు అసిస్టెంట్‌‌, అసోసియేట్‌‌ ప్రొఫెసర్లు తమకు టైమ్‌‌ బాండ్‌‌ ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. రిటైర్మెంట్ వయసు పెంపునకు బదులు, ప్రమోషన్లు ఇస్తే ప్రొఫెసర్ల కొరత ఉండదంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలు, ప్రమోషన్లతో ఖాళీ అయ్యే అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌‌‌ పోస్టులకు రిక్రూట్‌‌మెంట్‌‌ నిర్వహించాలని డిమాండ్ చూస్తున్నారు. టైమ్‌‌ బాండ్‌‌ ప్రమోషన్లకు సంబంధించిన కెరీర్‌‌‌‌ అడ్వాన్స్‌‌మెంట్‌‌ స్కీమ్‌‌ ఫైల్‌‌, రిటైర్మెంట్ వయసు పెంపు ఫైల్‌‌ ప్రభుత్వం వద్ద పెండింగ్‌‌లోనే ఉంది.