
హైదరాబాద్, వెలుగు: ఆషాఢ మాసం రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెండ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభకార్యాలకు బ్రేక్ పడింది. శ్రావణం మొదలైన తర్వాత ఆగస్ట్ 3వ తేదీ నుంచి శుభ ముహుర్తాలు ఉన్నాయి. అయితే ఆ మాసంలో 10 మాత్రమే మంచి ఘడియలు ఉన్నాయని, అవి పూర్తయితే మళ్లీ డిసెంబర్ దాకా శుభ ముహూర్తాలు లేవని పురోహితులు చెప్తున్నారు. మధ్యలో పదిపన్నెండు రోజులు తప్ప దాదాపు 5 నెలలు పెండ్లి తదితర వేడుకలకు సంబంధించిన బిజినెస్ కళకోల్పోనుంది. లక్షల మందికి ఉపాధి బంద్ కానుంది.
పెండ్లి సామగ్రి దుకాణాలకు గిరాకీ కరువు
మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెండ్లిళ్లు, ఇతర వేడుకల కొనుగోలుదారులతో కళకళలాడిన పెండ్లి సామగ్రి దుకాణాలు బోసిపోనున్నాయి. 4 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు సమాచారం. బట్టలు, బంగారం, ఫంక్షన్ హాల్స్, ప్రింటింగ్ ప్రెస్‌లు, పూలు, పండ్లు, డెకరేషన్, ఈవెంట్ ఆర్గనైజర్లు, వంటవారు, బాజాబజంత్రీలు, నాదస్వరం, పురోహితులు ఆగస్టు వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి.
నెల రోజులు పనుల్లేవ్
పెండ్లిళ్లు, ఇతర శుభకార్యక్రమాలపై ఆధారపడిన వారు నెల రోజులు ఎటువంటి ముహూర్తాలు లేకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. 4 నెలల నుంచి పెళ్లిళ్లు, ఫంక్షన్ల బిజినెస్‌పై ఆధారపడ్డ లక్షల కుటుంబాలు ఇపుడు ఖాళీగా ఉండనున్నాయి. సీజన్‌లో వచ్చిన ఆదాయం నుంచే నెలంతా నిత్యావసరాలకు, పిల్లల చదువులకు ఖర్చు చేయాల్సిందేనని చెప్తున్నారు. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోకుంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
ఎంగేజ్ మెంట్లు ముందే చేసుకున్నరు
ఆగస్టు, డిసెంబర్‌లో కొన్ని రోజుల్లోనో ముహూర్తాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తమ పిల్లలకు ముందుగానే ఎంగేజ్మెంట్లు పూర్తి చేస్కున్నారు. కొత్తగా ఇండ్లు, అపార్ట్ మెంట్లు కొన్న వారు ఇంటీరియర్, ఇతర పనులు పూర్తి కాకున్నా పాలు పొంగించుకున్నారు. పనులన్నీ పూర్తయ్యాక ఏ రోజైనా ఇంట్లోకి వెళ్లొచ్చన్న ఉద్దేశంతో మంచి ముహూర్తం ఉన్నపుడే గృహప్రవేశం పూర్తి చేసుకున్నరు.
డిసెంబరు వరకు ఉన్న ముహూర్తాలు
జులై: ఆషాఢ మాసం కావడంతో శుభ ముహూర్తాలు లేవు.
ఆగస్ట్: 3, 4, 5, 6, 10, 11, 13, 17, 20, 21 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.
సెప్టెంబరు: భాద్రపద మాసం, శుక్ర మౌఢ్యం(మూఢం) ప్రారంభం.
శుభ ముహూర్తాలు లేవు.
అక్టోబరు: శుక్ర మౌఢ్యం శుభ ముహూర్తాలు లేవు.
నవంబరు: శుక్ర మౌఢ్యం శుభ ముహూర్తాలు లేవు.
డిసెంబర్: 2, 7,8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. తరువాత ధనుర్మాసము. శుభ ముహూర్తాలు లేవు.
ఆగస్టు 3 నుంచి ముహూర్తాలు
ఆషాఢ మాసం ప్రభావంతో జులై నెలలో శుభ ముహూర్తాలు లేవు. మళ్లీ ఆగస్టు 3వ తేదీ నుంచి వివాహ ముహూర్తాలున్నాయి. అవి కూడా కేవలం 10 రోజులే ఉన్నాయి. తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో శుక్ర మౌఢ్యం(మూఢం) ఉంటుంది. ఈ మూడు నెలలు శుభ ముహూర్తాలు ఉండవు. మళ్లీ డిసెంబర్‌లో 10 మంచి రోజులు తర్వాత ధనుర్మాసం ప్రారంభమవుతుంది.
- బాలాజీ, పురోహితుడు, ఖమ్మం జిల్లా