పచ్చని తెలంగాణపై ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారు

పచ్చని తెలంగాణపై ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారు
  • పేదలకు ఏమీ చేయనోళ్లు డబుల్ ఇంజన్ సర్కార్ తెస్తామంటున్నారు
  • మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: నిరుపేదల సంక్షేమం కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టని బీజేపీ నేతలు.. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తెస్తామంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న  సంక్షేమ పథకాలను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతూ.. పచ్చని తెలంగాణపై ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో 129 మంది లబ్దిదారులకు రూ. కోటి 29 లక్షల పై చిలుకు విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను బీసీనని చెప్పుకునే ప్రధాని మోడీ బడుగు బలహీనర్గాలకు ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రకటించలేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న  సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నయా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణను తిరిగి ఆంధ్రప్రదేశ్ లో కలుపుతామని మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఒక వ్యక్తి కాదు మనం తయారు చేసుకున్న ఆయుధం,  మన కేసీఆర్ ను మనం కాపాడుకుందామని మంత్రి గంగుల కమలాకర్ కోరారు.