
ముషీరాబాద్, వెలుగు: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్ఫూర్తి సభ నిర్వహించింది. ముఖ్య అతిథులుగా సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్పర్సన్విమలక్క, దివి కుమార్, జీవన్ కుమార్, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, ఎనిశెట్టి శంకర్, డాక్టర్ ఏకే ప్రభాకర్, విమల హాజరయ్యారు.
అరుణోదయ 50 సంవత్సరాల ఉద్యమ ప్రస్తావన ఆడియో, వీడియో సావనీర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. 50 ఏళ్ల సాంస్కృతిక ఉద్యమం అనేక అనుభవాలను ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఫాసిజంపై పోరాడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రజల కష్టాలు, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పాటల రూపంలో జనంలోకి తీసుకెళ్లిందని తెలిపారు. రైతులు, స్త్రీలు, పీడిత ప్రజల కోసం పోరాటం చేసిందని, ఎన్నో నిర్బంధాలను, అడ్డంకులను ఎదుర్కుందన్నారు.
అంటరానితనం, కుల నిర్మూలనపై పోరాటాలు, బహుజన బతుకమ్మ వంటి ఎన్నో కార్యక్రమాలను విమలక్క పాటల రూపంలో నడిపించారని కొనియాడారు. కార్యక్రమంలో రమేశ్, మల్సూర్, రాకేశ్, అనిత, ప్రొఫెసర్ కాసిం, మోత్కూరు శ్రీనివాస్, అరుణతోపాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు సుందరయ్య పార్క్ నుంచి వీఎస్టీ వరకు అరుణోదయ జెండాలు, గొంగళ్లతో వందలాది మంది కళాకారులు నృత్యాలు చేస్తూ ర్యాలీ తీశారు.