
సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే భారీ అంచనాలు ఉండటం కామన్. ఇంకా షూటింగ్ మొదలవని ‘పుష్ప 2’పై కూడా అలాంటి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన ‘పుష్ప’ సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి సక్సెస్ సాధించింది. పాటలు, డైలాగ్స్, మేనరిజమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. దాంతో అందులోని డైలాగ్‌ని పేరడీ చేస్తూ ‘సెకెండ్ పార్ట్ ఎప్పుడు పుష్పా’ అంటున్నారు అభిమానులు. అయితే అంచనాలను మించి సీక్వెల్ ఉండాలని స్క్రిప్ట్ వర్క్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టారు సుకుమార్. అల్లు అర్జున్ కూడా వేరే సినిమా ఏదీ స్టార్ట్ చేయకుండా ఈ మూవీ షూట్ కోసమే ఎదురుచూస్తున్నాడు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఈలోపు ‘పుష్ప’ ఫ్రాంచైజీలో మూడో భాగం కూడా ఉండబోతోందనే ప్రచారం మొదలైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫహాద్ ఫాజిల్ చేసిన కామెంట్స్ ఈ ప్రచారానికి మరింత బలాన్నిస్తున్నాయి. ‘మొదట నాకు స్టోరీ చెప్పినప్పుడు ‘పుష్ప’ అనేది ఒకటే సినిమా. కానీ ఆ తర్వాత కథ చాలా పెద్దదని భావించి రెండు భాగాలుగా తీశారు. ఇటీవల సుకుమార్‌తో మాట్లాడినప్పుడు ‘పుష్ప 3’కి కూడా ఉండే అవకాశం ఉందని అర్థమయ్యింది. అందుకు తగ్గ మెటీరియల్ ఉందని ఆయన నాతో అన్నారు. ఈ కథని మొదట వెబ్ సిరీస్‌గా చేద్దామనుకున్నారు కూడా’ అంటూ ‘పుష్ప’ ఫ్రాంచైజీ గురించి చెప్పారు ఫహాద్. పార్ట్ 3 అనేది ఆలోచనకు మాత్రమే పరిమితమవుతుందా లేక త్వరలోనే దానిపై కూడా అనౌన్స్‌మెంట్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది!