
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: ఆసియా కప్‌కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియా ఎంపికపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో దుమ్మురేపిన ఒకరిద్దరు ప్లేయర్లు ఇప్పుడు టీ20 రేసులోకి రావడంతో జట్టులోకి ఎవర్ని తీసుకోవాలనేది కత్తిమీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతి మల్టీ నేషనల్ ఈవెంట్‌కు ముందు సంజూ శాంసన్‌పై ఉండే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
శాంసన్ తన చివరి ఐదు టీ20ల్లో కేవలం 51 రన్స్ మాత్రమే చేయడం మైనస్‌గా మారింది. ఇక హై ఎండ్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలోనూ అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో శాంసన్‌ను ఆసియా కప్‌కు ఎంపిక చేస్తారా..? ఒకవేళ అతన్ని పక్కనబెడితే ఎవర్ని తీసుకుంటారు..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆసియా కప్ కోసం వచ్చే వారం జట్టును ఎంపిక చేసే చాన్స్ ఉంది.
నిలకడలేమితో ఇబ్బంది..
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంసన్‌కు ఎనలేని ఉత్సాహం వచ్చింది. అప్పట్లో టీమిండియా తరఫున టీ20ల్లో దుమ్మురేపాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 34.78 సగటుతో 171.47 స్ట్రయిక్ రేట్‌తో 487 రన్స్ చేసి ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండటం మరో విశేషం. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల్లో కేవలం 51 రన్స్ చేశాడు. ఇందులో మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి. అంటే ఒక్కసారిగా నిలకడలేమితో ఫామ్ కోల్పోయాడు.
ఫలితంగా గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కొంతవరకే తీర్చాడు. శ్రీలంకలో తక్కువ వేగంతో ఉండే పిచ్‌లపై కూడా శాంసన్ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. వరుసగా రెండు డకౌట్లయ్యాడు. ఇక జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌లాంటి పేసర్ల బౌలింగ్‌ను ఆడటంలోనూ తడబడ్డాడు. అంతకుముందు జరిగిన ఐపీఎల్‌లోనూ గాయం కారణంగా అతను సగం మ్యాచ్‌లే ఆడాడు. అందులోనూ ఆకట్టుకునే పెర్ఫామెన్స్ చూపెట్టలేదు. ఈ మొత్తం పెర్ఫామెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే శాంసన్‌కు అవకాశం వస్తుందా..? గంభీర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది..? ఒకవేళ స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా చాన్స్ ఏమైనా ఇస్తారా..? దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
‘శాంసన్‌కు టీ20 రికార్డు మెరుగ్గానే ఉన్నా.. పెద్ద జట్లపై రాణించలేడు. ముఖ్యంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో చాలా ఇబ్బందిపడ్డాడు. సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఆడిన అత్యుత్తమ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇది. ఇందులో ఇండియా పూర్తి బలగంతో ఆడింది. కానీ ఈ సిరీస్‌లో శాంసన్ నిరాశపర్చాడు’ అని దీప్ దాస్ గుప్తా పేర్కొన్నాడు.
ముగ్గురి నుంచి పోటీ..
శాంసన్‌కు.. టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ నుంచి ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. ఈ ముగ్గుర్ని టీ20ల్లో సర్దుబాటు చేయాలంటే శాంసన్‌ను బెంచ్‌కు పరిమితం చేయక తప్పదు. ఎందుకంటే స్పోర్ట్స్ హెర్నియా గాయం నుంచి రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కోలుకున్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కాబట్టి అతన్ని కెప్టెన్‌గా కొనసాగించి గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.
ఐపీఎల్‌లో శాంసన్ గాయంతో ఇబ్బందిపడుతున్నప్పుడు గిల్ గుజరాత్ తరఫున 15 ఇన్నింగ్స్‌ల్లో 50 సగటుతో 155.8 స్ట్రయిక్ రేట్‌తో 650 రన్స్ చేశాడు. అలాగే స్థిరంగా బ్యాటింగ్ చేయడంలో అతను సిద్ధహస్తుడు. నాలుగో నంబర్‌లో కోహ్లీ పాత్రను పోషించే శక్తి సామర్థ్యాలు గిల్‌కు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఓపెనర్‌గా శాంసన్‌ను తీసుకోవాలనుకుంటే అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ అతని కంటే మెరుగ్గా ఆడుతున్నారు.
వీళ్ల ట్రాక్ రికార్డు కూడా బాగుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లను పక్కనబెట్టడం దాదాపు అసాధ్యం. వీరిద్దరు పేసర్లను కూడా దీటుగా ఎదుర్కోగలరు. మిడిల్‌లో సూర్యతో పాటు శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ కూడా ఉన్నారు. ఏడో నంబర్‌లో వికెట్ కీపర్‌గా జితేష్ శర్మ నుంచి గట్టి పోటీ ఉంది. కాబట్టి శాంసన్ జట్టులోకి రావాలంటే చాలా మందితో పోరాడాల్సి ఉంటుంది.