చంద్రబాబు కుప్పం పర్యటనపై హైటెన్షన్

చంద్రబాబు కుప్పం పర్యటనపై హైటెన్షన్

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాక కోసం బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో విమానాశ్రయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఎలాంటి అంవాఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు  భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు.

మరోవైపు చిత్తూరు జిల్లా చంద్రబాబు కుప్పం పర్యటనపై  హైటెన్షన్ నెలకొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం చంద్రబాబు రోడ్‌షో, సభలకు అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతిపురం వెళ్లాల్సిన ప్రచార రథం, సౌండ్ వాహనాలు నిలిపివేశారు. ప్రచార రథం, సౌండ్ వాహనాలను గుడిపల్లి పీఎస్ కు తరలించారు. వాహన డ్రైవర్లు, సహాయక సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. శాంతిపురం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.  మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు శాంతిపురం మండలం పెద్దూరుకు చంద్రబాబు చేరుకోనున్నారు. 

పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా కుప్పంలో ఎక్కడైనా.. సభలు నిర్వహించే హక్కు చంద్రబాబుకు ఉందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు సభను నిర్వహించి తీరుతామని  టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ శ్రేణులను అడ్డుకుంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల గుంటూరులో జరిగిన 'చంద్రన్న సంక్రాంతి కానుక' వస్త్రాల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. డిసెంబర్ 28న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో‌లో జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సభలు, సమావేశాలకు అనుమతి లేదని జీవో జారీ చేసింది.