- బస్సుల ముట్టడి, తోపులాటలు, పోలీసుల లాఠీచార్జి
- చెల్లాచెదురైన కౌన్సిలర్లు.. చైర్‌పర్సన్ ఎన్నికలు వాయిదా
- ఇబ్రహీంపట్నంలో హైడ్రామాతో పోస్ట్‌పోన్
- క్యాంప్ రాజకీయాల నడుమ కాంగ్రెస్ హవా..
- ఉమ్మడి రంగారెడ్డిలో 3 చోట్ల హంగ్ మున్సిపాలిటీలు హస్తం కైవసం
మహబూబాబాద్/ జనగామ/ చేవెళ్ల/ పరిగి, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ పీఠాల ఎన్నికలు పలుచోట్ల రణరంగాన్ని తలపించాయి. ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న హోరాహోరీ పోరుతో పలుచోట్ల ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరగా, మరికొన్ని చోట్ల క్యాంప్ రాజకీయాలు, అనూహ్య సమీకరణలు తెరపైకి వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్ఎస్ (9), కాంగ్రెస్ (ఎక్స్‌అఫీషియోలతో కలిపి 9) బలాబలాలు సమానంగా ఉండటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఎంపీ కడియం కావ్య ఎక్స్‌అఫీషియో ఓటుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. మరోవైపు బీఆర్ఎస్ కౌన్సిలర్ (పేరు మీద వైన్‌షాప్ ఉండడంతో) అనర్హతపై కాంగ్రెస్ పట్టుబట్టింది. ఆ విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలని ఆర్డీవో చెప్పగా.. ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ కౌన్సిలర్లు కుర్చీలు, బెంచీలు కింద పడేశారు. దీంతో అధికారులు ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.
జనగామలో లాఠీచార్జి.. కిడ్నాప్ డ్రామా
జనగామలో మేజిక్ ఫిగర్ (17) కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ హోరాహోరీగా తలపడ్డాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా కిడ్నాప్ అయ్యారన్న ఫిర్యాదుతో పోలీసులు ఆమె ప్రయాణిస్తున్న బస్సును ఆపడంతో ఉద్రిక్తత పెరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం సమావేశం ప్రారంభం కాగానే 30 మంది కౌన్సిలర్లతో ఆర్డీవో గోపీరాం ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కడకంచి బాలమణి, బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపగాని సుగుణాకర్ పేర్లతో బీ ఫారాలు వచ్చినందున ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి లేచి బీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నదని ఆరోపించారు. కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఎఫ్ఐఆర్ నమోదైన విషయాన్ని వివరించారు. కిడ్నాప్‌పై విచారణ జరపాలని, 24 గంటలు ఎన్నిక ప్రకియ ఆపేయాలని కోరారు. అదే సమయంలోనే హఫీజ్ ఫాతిమా లేచి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ప్రకటించారు. దీంతో ఇద్దరు ఇండిపెండెంట్లతో కలిసి కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియంను చుట్టుముట్టి ఎన్నిక వాయిదా వేయాలని నినాదాలు చేశారు. దీంతో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.
పరిగిలో హైడ్రామా
పరిగిలో హైడ్రామా మధ్య చైర్‌పర్సన్ సీటును కాంగ్రెస్దక్కించుకున్నది. పరిగిలో 10 వార్డులుండగా, 8 బీఆర్ఎస్, 8 కాంగ్రెస్, రెండు ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు. ఇద్దరు ఇండిపెండెంట్ల ఓట్లు కీలకం కాగా ఒకరు కాంగ్రెస్‌కు, మరొకరు బీఆర్ఎస్‌కు మద్దతిచ్చారు. ఒకటో వార్డు కౌన్సిలర్ అక్కమ్మ బీఆర్ఎస్ క్యాంపులో చేరారు. ఆదివారం 1వ వార్డుకు చెందిన నస్కల్ గ్రామస్తులు.. అక్కమ్మ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ క్యాంపులో ఉన్న అక్కమ్మను అప్పగించాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. తర్వాత క్యాంపు నుంచి అక్కమ్మ రాగానే కుటుంబసభ్యులకు అప్పగించారు. తర్వాత ఎన్నికలో ఆమె కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. దీంతో 16వ వార్డు నుంచి గెలిచిన కుడుముల రజిత చైర్‌పర్సన్‌గా, మూడో వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన హనుమంతు (కమల్) వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నిక తర్వాత అక్కమ్మ మున్సిపల్ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. తనకు వైస్ చైర్మన్ కుర్చీ ఇస్తానంటేనే కాంగ్రెస్‌కు మద్దతు పలికానని, మరొకరికి పదవి ఇచ్చి తనను ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి మోసం చేశారన్నారు. అయితే, రాత్రి ఒక వీడియోలో తనతో కొందరు అలా మాట్లాడించారని, తాను ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు. అలియాబాద్‌లో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పీఠాన్ని దక్కించుకున్నది. కాంగ్రెస్‌కు చెందిన శిరీష చైర్‌పర్సన్‌గా, బీజేపీకి చెందిన మాలతి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అలియాబాద్‌లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని చూసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి పాచిక పారలేదు.
హంగ్ మున్సిపాలిటీల్లో హస్తం హవా
రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్జిల్లాల్లో హంగ్ఏర్పడిన 3 మున్సిపాలిటీలను కాంగ్రెస్కైవసం చేసుకున్నది. మూడు చోట్ల కూడా చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక కోసం పెద్ద హైడ్రామానే నడిచింది. అనూహ్యంగా కాంగ్రెస్‌కు ఒకచోట బీఆర్ఎస్ మద్దతు పలకగా, మరోచోట బీజేపీ సపోర్ట్‌చేయడం గమనార్హం. ఇంకోచోట బీఆర్ఎస్ క్యాంపులో చేరిన ఇండిపెండెంట్అభ్యర్థి.. కాంగ్రెస్‌కు జైకొట్టి ఆశ్చర్యపరిచారు. మొయినాబాద్ లో 26 వార్డులుండగా..10 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 4 బీజేపీ, ఐదుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. హంగ్ ఏర్పడడంతో చైర్పర్సన్పీఠం దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్‌వేశారు. మ్యాజిక్ ఫిగర్‌కు కాంగ్రెస్ కు నలుగురు అభ్యర్థులు అవసరం పడగా, 6,8,15 వార్డుల నుంచి గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు మద్దతు ప్రకటించారు. అలాగే ఐదుగురు ఇండిపెండెంట్లు కూడా మద్దతు తెలపడంతో 25 వార్డు నుంచి కాంగ్రెస్‌తరఫున గెలిచిన సోనియా దర్శన్ 18 ఓట్లతో చైర్పర్సన్అయ్యారు. 22వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన గరుగు రాజు వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
