కొత్త రేట్ల ప్రకారమే చార్జీలు..LRS సవరణతో పెద్దగా రిలీఫ్ లేనట్టే

కొత్త రేట్ల ప్రకారమే చార్జీలు..LRS సవరణతో పెద్దగా రిలీఫ్ లేనట్టే
  • జీవో 131ను సవరిస్తూ సర్కారు ఉత్తర్వులు
  • కొన్నప్పటి వాల్యూ ప్రకారమే చార్జీలని సభలో చెప్పిన మంత్రి కేటీఆర్‌‌..
  • ప్రస్తుత వాల్యూ ప్రకారమే కట్టాలంటూ ప్రభుత్వం జీవో
  • మార్కెట్​ వాల్యూ గజం రూ. 10 వేలకు పైనున్నోళ్లకే ఊరట

హైదరాబాద్, వెలుగులే ఔట్ రెగ్యులరైజేషన్ కోసం జారీ చేసిన జీవో 131ను సవరిస్తామని.. పేద, బడుగు, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్ చెప్పినా జీవోలో మాత్రం సర్కారు ఇంకోటి ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌‌ తేదీ నాటి మార్కెట్‌‌ వాల్యూ ప్రకారమే చార్జీలు వసూలు చేస్తామని బుధవారం సభలో కేటీఆర్‌‌ చెప్తే.. ప్రస్తుత మార్కెట్‌‌ వాల్యూ ప్రకారమే ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ చార్జీలు చెల్లించాలని గురువారం జీవో విడుదలైంది.ఆగస్టు 26, 2020 నాటి సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారమే చార్జీలు చెల్లించాలని సర్కారు చెప్పింది. స్లాబ్‌లను మాత్రం మారుస్తూ జీవో ఇచ్చింది. 2015 ఎల్ఆర్ఎస్ స్కీమ్ తరహాలోనే 7 స్లాబ్‌లుగా మార్కెట్ వాల్యూను విభజించింది.

పేద, మధ్య తరగతికి తగ్గింది 5 శాతమే

ఇంటి స్థలాలు, లే ఔట్ల రెగ్యులరైజేషన్ చార్జీలను ప్రభుత్వం స్వల్పంగానే తగ్గించింది. స్లాబ్స్‌‌ మార్చడంతో పాటు బేసిక్ రెగ్యులరైజేషన్ చార్జీల్లో చెల్లించాల్సిన పర్సంటేజీని తగ్గించి ఈ వెసులుబాటు కల్పించింది. ఇటీవలి జీవోలో మార్కెట్ వాల్యూ 4 స్లాబ్‌‌లు ఉండగా వీటిని 7 స్లాబ్‌‌లుగా విభజించారు. గతంలో చదరపు గజానికి రూ. 3 వేల లోపు ఉంటే బేసిక్ రెగ్యులరైజేషన్ చార్జీల్లో 25 శాతం చెల్లించాల్సి ఉండేది. సవరణ ఉత్తర్వుల ప్రకారం దాన్ని 20 శాతానికి తగ్గించారు. ఈ లెక్కన మార్కెట్ వాల్యూ రూ.3 వేలలోపున్న ప్లాట్లకు తగ్గింది 5 శాతమే. మార్కెట్ వాల్యూ గజానికి రూ.3,001 నుంచి రూ. 5 వేల వరకు ఉంటే గత జీవోలో బేసిక్ చార్జీల్లో 50 శాతం చెల్లించాల్సి ఉండగా దాన్ని 30 శాతానికి తగ్గించారు. రూ. 5,001 నుంచి రూ.10 వేల వరకు గత జీవోలో 75 శాతం ఉండగా దాన్ని 40 శాతం చేశారు. మార్కెట్‌‌ వాల్యూ రూ. 10,001 దాటితే 100 శాతం చార్జీలు చెల్లించాలని గత జీవోలో ఉండగా దాన్ని మార్చి రూ.10,001 నుంచి రూ. 20 వేల వరకు 50 శాతం, రూ. 20,001 నుంచి రూ. 30 వేల వరకు 60 శాతం, రూ. 30,001 నుంచి రూ. 50 వేల వరకు 80 శాతం, రూ. 50 వేలకు పైగా మార్కెట్‌‌ ధర ఉంటే వంద శాతం రెగ్యులరైజేషన్ చార్జీలు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలకే..​

లే ఔట్‌‌లో 10 శాతం ఓపెన్ స్పేస్ లేనప్పుడు ప్లాట్ వాల్యూలో 14 శాతం చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం ఊరటనిచ్చింది. జీవో 131 ప్రకారం.. 10 శాతం ఓపెన్ స్పేస్ లేకుంటే ప్లాట్ రేటులో 14 శాతాన్ని ఆగస్టు 26 నాటి మార్కెట్ వాల్యూ ప్రకారం చెల్లించాల్సి ఉండగా దాన్ని మార్చింది. ప్లాట్ రిజిస్ట్రేషన్ టైమ్‌‌లోని మార్కెట్ వాల్యూ ప్రకారమే 14 శాతం చార్జీలు చెల్లించాలంది. నాలా చార్జీలు ఎల్‌‌ఆర్‌‌ఎస్ చార్జీల్లో కలిపే ఉంటాయని, సపరేట్‌‌గా కట్టాల్సిన అవసరం లేదని
వెల్లడించింది.

ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ అప్లికేషన్లతో రూ.18.50 కోట్లు

ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ అప్లికేషన్లతో రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం నాటికి 18 కోట్ల 50 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. మున్సిపాలిటీల్లో 74,998 అప్లికేషన్ల ద్వారా7 కోట్ల 57 లక్షల ఆదాయం, , పంచాయతీల్లో 63,338 అప్లికేషన్లతో 6 కోట్ల 52 లక్షలు, కార్పొరేషన్లలో 43,511 అప్లికేషన్లతో 4 కోట్ల 39 లక్షల రూపాయల ఆదాయం సర్కారుకు సమకూరింది.

ఆపండని ఉత్తర్వులివ్వలేం: హైకోర్టు

అక్రమ లే ఔట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 131ని సవాల్‌‌ చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ వాదనలు తెలుసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ కోసం ఇచ్చిన జీవో 131ని ఫోరమ్‌‌ ఫర్‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌ సవాల్‌‌ చేసింది. చట్ట నిబంధనలను ఉల్లంఘించేలా జీవో 131 ఉందని, ఆదాయం కోసమే ప్రభుత్వం జీవో ఇచ్చిందని, ఇది చట్ట వ్యతిరేకమని తీర్పు చెప్పాలని, కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి జీవో అమలు ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌‌ న్యాయవాది కోరారు. అయితే దీన్ని కోర్టు తోసిపుచ్చింది. మున్సిపల్, పంచాయతీ, జీహెచ్‌‌ఎంసీ, హెచ్‌‌ఎండీఏ, టౌన్‌‌ ప్లానింగ్‌‌ శాఖలు తమ వాదనలతో కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌‌ దాఖలు చేస్తామని, ఈలోగా మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని ప్రభుత్వ లాయర్‌‌ చెప్పడంతో అంగీకరించి తదుపరి విచారణను అక్టోబర్‌‌ 8కి వాయిదా వేసింది.