టీచర్లు, ఉద్యోగుల మ్యూచువల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లపై రాని క్లారిటీ

టీచర్లు, ఉద్యోగుల మ్యూచువల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లపై రాని క్లారిటీ
  • అప్లికేషన్లకు గడువు 15తో ముగిసినా.. ఇప్పటికీ సైట్‌‌‌‌‌‌‌‌ ఓపెన్ 
  • 4,815 మంది దరఖాస్తు.. ఇంకా స్క్రూటినీ స్టార్ట్ కాలే

హైదరాబాద్, వెలుగు: జిల్లా స్థాయిలో టీచర్లు, ఉద్యోగుల మ్యూచువల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లపై ఇంకా క్లారిటీ రావట్లేదు. ఈ నెల15తోనే అప్లికేషన్ల ప్రక్రియ ముగిసినా, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ల కోసం అప్లై చేసుకునే వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ ఇంకా ఓపెన్‌‌‌‌‌‌‌‌గానే ఉంది. సర్కారు షెడ్యూల్ ప్రకారం మార్చి31తోనే ప్రక్రియ ముగుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అప్లికేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో మ్యూచువల్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లకు మరింత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. జీవో 317తో ఇతర జిల్లాలకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన టీచర్లు సొంత జిల్లాలకు వచ్చేందుకు రాష్ట్ర సర్కారు పరస్పర బదిలీలకు(మ్యూచువల్ ట్రాన్స్​ఫర్లకు) అంగీకరించింది. దీనికి ఫిబ్రవరి 2న జీవో ఇచ్చింది. దరఖాస్తులకు ఈ నెల 15వ తేదీదాకా గడువు పెట్టగా.. ఆ గడువు ముగిసినా ఇప్పటికీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అప్లికేషన్ పెట్టుకునే ఆప్షన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్ అవుతోంది. గడువులోగా 4,423 మంది మ్యూచువల్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లకు అప్లై చేసుకోగా.. మొత్తం 4,815 మంది దరఖాస్తు చేసుకున్నారు. జీవో 317తో ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ అయినోళ్లు మాత్రమే మ్యూచువల్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్లై చేసుకోవడానికి అర్హులు కాగా, ఇతర జిల్లాల వాళ్ల దరఖాస్తులను కూడా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ యాక్సెప్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుండడం గమనార్హం. దీంతో అప్లై చేసుకున్నోళ్లలో అర్హత ఉన్న వాళ్లెందరో, లేనోళ్లు ఎందరో అనేదానిపై దానిపై స్పష్టత కరువైంది.

అందరికీ చాన్స్ ఇవ్వాలి: మ్యూచువల్, స్పౌజ్ టీచర్లు

మ్యూచువల్ బదిలీల్లో 317 జీవో ఎఫెక్ట్ తో సంబంధం లేకుండా దరఖాస్తు పెట్టుకున్న టీచర్లు, ఉద్యోగులందరికీ అవకాశం ఇవ్వాలని అంతర్ జిల్లా మ్యూచువల్, స్పౌజ్ టీచర్ల ప్రతినిధులు నందారం జైపాల్ రెడ్డి, శెట్టి గీతాంజలి, ఆర్కే ఆచార్య, త్రివేణి కోరారు. తెలంగాణ వచ్చిన నుంచి అంతర్ జిల్లా మ్యూచువల్ బదిలీలు జరగలేదని, బదిలీ కోసం అప్లై చేసుకున్న వారందరికీ అవకాశం ఇవ్వాలన్నారు. మ్యూచువల్ బదిలీల తర్వాత మిగిలిన 13 జిల్లాల స్పౌజ్ టీచర్లు, స్థానికత కోల్పోయి వేరే జిల్లాలకు కేటాయించిన టీచర్లకు దశలవారీగా ప్రమోషన్లలో ఏర్పడిన ఖాళీల ద్వారా చాన్స్ ఇవ్వాలన్నారు. సమస్య పరిష్కారం కోసం టీచర్ ఎమ్మెల్సీలు సహకరించాలని కోరారు.

అప్లికేషన్ల పరిశీలనే మొదలుకాలె 

దరఖాస్తులకు గడువు ముగిసి 15 రోజులయినా ఇప్పటికీ అప్లికేషన్ల పరిశీలనే మొదలు కాలేదు. పరిశీలించాలన్న ఆదేశాలు డీఈవోలకు కూడా అందలేదు. దీంతో ఈ ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించట్లేదు. ఈ అప్లికేషన్లను పరిశీలించాల్సిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లంతా టీచర్ల ట్రైనింగ్, మన ఊరు–మన బడి పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఫైనాన్స్ ఆఫీసర్ల నుంచి అప్లికేషన్లు అందినా వాటిని పక్కన పెట్టేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికీ మ్యూచువల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లు స్కూల్ నుంచి స్కూలుకా? లేక జిల్లా నుంచి జిల్లాకా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో టీచర్లలో ఆందోళన మొదలైంది.