
మధిర, వెలుగు: తెలంగాణ స్టూడెంట్లకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఎడ్యుకేషన్ విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడొద్దని ఆఫీసర్లకు సూచించారు.
యంగ్ ఇండియా స్కూల్ కోసం సూచించిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలని, అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, అవసరమైతే కూలీల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. అనంతరం యంగ్ ఇండియా స్కూల్‌ను అనుసంధానిస్తూ నిర్మించే రోడ్లపై ఆఫీసర్లతో చర్చించారు. ఆయన వెంట కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మధిర అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ఉన్నారు.