90 సర్కార్ దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీ లేదు

90 సర్కార్ దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీ లేదు

80 దవాఖాన్లలో మంటలు ఆర్పే పరికరాలే లేవ్‌‌‌‌
గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌‌‌‌లో దవాఖాన్లలో
పనికిరాని స్థితిలోఫైర్‌‌‌‌ సేఫ్టీ వ్యవస్థ
ఇదే తీరుగా కొన్ని జిల్లా, ఏరియా హాస్పిటళ్లు
తక్షణం కొత్త పరికరాలు ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ రిపోర్ట్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగురాష్ట్రంలో 90 ప్రభుత్వ దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీ లేదు. ఇందులో కమ్యునిటీ హెల్త్ సెంటర్ల నుంచి గాంధీ, ఉస్మానియా వంటి టీచింగ్ హాస్పిటళ్ల వరకూ ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తేల్చింది. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్‌‌‌‌లో అగ్ని ప్రమాదం  జరగడంతో, సర్కారు దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీపై కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. అన్ని దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో సర్కారు దవాఖాన్ల పరిస్థితిని తెలుసుకునేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు, సీనియర్ డాక్టర్లతో కూడిన కమిటీని నియమించారు.

ఈ టీమ్‌‌‌‌ వివిధ హాస్పిటళ్లను పరిశీలించి 90 దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీ లేదని గుర్తించింది. 80 దవాఖాన్లలో తక్షణమే ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ సహా పలు టీచింగ్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నప్పటికీ, అవి ప్రస్తుతం పనిజేసే పరిస్థితిలో లేవని తన రిపోర్ట్‌‌‌‌లో తెలిపింది. వేల మంది ఇన్‌‌‌‌పేషెంట్లు ఉండే ఈ ఆస్పత్రుల్లో ఊహించని అగ్ని ప్రమాదం ఏదైనా సంభవిస్తే భారీ నష్టం జరిగే ముప్పు ఉందని హెచ్చరించింది.

రూ.14.2 కోట్లు కావాలె

ఏయే హాస్పిటల్‌‌‌‌కు ఎట్లాంటి పరికారాలు అవసరం, ఎంత డబ్బులు ఖర్చు అవుతుందనే దానిపై ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు లెక్కలేశారు. మ్యానువల్ ఫైర్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ ఎక్స్‌‌‌‌స్టింగ్విషర్లతో పాటు, ఆటోమేటిక్‌‌‌‌గా మంటలు ఆర్పే పరికరాలు, స్ర్పింక్లర్లు, ఫైర్ అలార్మ్స్‌‌‌‌ తదితర వాటి ఏర్పాటుకు రూ.14.2 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఒకటి, రెండు అంతస్తులు ఉండే దవాఖాన్లలో యంత్రాలు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. కానీ, గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద దవాఖాన్లలో ప్రస్తుతం ఉన్న ఫైర్ సేఫ్టీ సిస్టమ్‌‌‌‌ మొత్తాన్ని మార్చాల్సిందేనని రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్నారు. గాంధీ దవాఖాన ప్రాంగణంలోనే మినీ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అగ్నిమాపకశాఖ అధికారులు ప్రతిపాదించారు. కమిటీ సిఫార్సులను ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై తాము ఓ నిర్ణయం తీసుకున్నాక, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం