కొత్త పెన్షన్ కోసం 15లక్షల మంది ఎదురుచూపులు

కొత్త పెన్షన్ కోసం 15లక్షల మంది ఎదురుచూపులు
  • 57 ఏండ్లు నిండినోళ్లకు ఇస్తమని చెప్పి మూలకు పడేసిన్రు
  • కొత్తగా వితంతువులు, దివ్యాంగులు, 65 ఏండ్లు నిండినోళ్లకు కూడా ఇస్తలే
  • వివిధ కారణాలతో రెండున్నరేండ్లలో 2.1 లక్షల పెన్షన్లు తొలగింపు
  • వాటి స్థానంలోనూ కొత్తవి రావట్లే 
  • ఉప ఎన్నికలు ఉన్న చోటనే మంజూరు చేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేండ్లుగా చెప్తున్న కొత్త ఆసరా పెన్షన్లకు అతీగతీ లేదు. 65 ఏండ్లు దాటినోళ్లకే కాదు.. 57 ఏండ్లు నిండినోళ్లకు కూడా ఆసరా పెన్షన్ ఇస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్​  హామీ ఇచ్చి అటకెక్కించారు. రేపు మాపు అంటూ  తప్పించుకుంటున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లను కూడా మంజూరు చేస్తలేరు. ఎక్కడన్న ఎలక్షన్​ ఉంటే అక్కడ కొన్ని పెండింగ్​ అప్లికేషన్లను బయటకు తీసి ఏదో ఇచ్చినట్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం వితంతువులు, వికలాంగులతోపాటు 57 ఏండ్లు నిండినోళ్లు కలిపి సుమారు 15 లక్షల మంది దాకా ఎదురుచూస్తున్నారు. గడిచిన రెండున్నరేండ్లలో దాదాపు 2 లక్షల మందికిపైగా లబ్ధిదారులను లిస్టులో నుంచి ప్రభుత్వం తొలగించింది. లబ్ధిదారులు చనిపోతే వాళ్ల పేర్లను తీసేస్తున్నారు తప్ప.. కొత్తగా ఎవరికీ పెన్షన్​ ఇవ్వడం లేదు. 

బై ఎలక్షన్లు ఎక్కడుంటే అక్కడ్నే!

ఉప ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడ తప్ప ఇతర ప్రాంతాల్లో పెన్షన్ల ఊసెత్తడం లేదు. మొన్నామధ్య హుజూర్‌‌‌‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ పెండింగ్​ పెన్షన్​ అప్లికేషన్లలో కొందరికి మంజూరు చేశారు. అది కూడా  57 ఏండ్లు నిండినోళ్లకు ఇయ్యలేదు. త్వరలో బై ఎలక్షన్​ ఉండటంతో హుజూరాబాద్​లో  కొత్త పెన్షన్ల ప్రక్రియ స్టార్ట్​ చేశారు. వాస్తవానికి  2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లను సర్కార్ ఆపేసింది. 65 ఏండ్లు దాటిన వారి అప్లికేషన్లకే రెండున్నరేండ్లుగా మోక్షం లభించడం లేదు. 57 ఏండ్లు నిండినోళ్లకు ఆగస్టు నెల నుంచి పెన్షన్ ఇస్తామని ఇటీవల సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల డీఆర్డీఏలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఎలాంటి కసరత్తు మొదలు పెట్టలేదు. కేవలం త్వరలో ఎన్నికలు జరగబోయే హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 57 ఏండ్లు నిండినోళ్ల లిస్టును రెడీ చేశారు. 

ప్రతినెలా 10 వేల అప్లికేషన్లు

ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా సగటున 10 వేల అప్లికేషన్లు వస్తున్నాయి. ఇవన్నీ దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులతోపాటు 65 ఏండ్లు దాటిన వృద్ధుల నుంచే వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇలా రెండేండ్ల కాలంలో రెండున్నర లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ఊళ్లలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో ఇతర ఆఫీసర్లు ఎప్పటికప్పుడు వెరిఫై చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తున్నారు. ఆన్​లైన్​లో ఈ అప్లికేషన్లు అప్రూవ్డ్​గా చూపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో శాంక్షన్ చేయడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. 

తీసేసిన దాంట్లోనే కొత్తవి ఇయ్యొచ్చు
2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పెన్షన్​ లబ్ధిదారుల సంఖ్య 39.14 లక్షలుగా ఉంది. వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, 65 ఏండ్లు నిండినోళ్లు, ఇతరులకు నెలకు రూ. 2,016 ఇస్తుండగా, దివ్యాంగులకు రూ. 3.016 ఇస్తున్నారు. అయితే అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయిన లబ్ధిదారులు, వరుసగా మూడు నెలలు పింఛన్‌‌ తీసుకోని లబ్ధిదారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తోంది. ఇట్ల నెలనెలా 6 వేల నుంచి 8 వేల మంది పేర్లను ఆసరా పెన్షనర్ల జాబితా నుంచి తీసేస్తోంది. గడిచిన రెండున్నరేండ్లలో  రెండు లక్షల 10 వేల మందిని తొలగించినట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో 39.14 లక్షలు ఉన్న లబ్ధిదారుల సంఖ్య  37.04 లక్షలకు చేరింది. 2019లోనే 1,16,534 పేర్లను ఆసరా జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. 2019 డిసెంబర్ లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్​లో  52,082 మంది పేర్లను ఒకేసారి తీసేసింది. దీంతో ప్రతి నెలా సుమారు రూ. 30 కోట్ల ఆసరా నిధులు మిగిలిపోతున్నాయి. తొలగించిన వారి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త వాళ్లకు  ఇచ్చే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం స్పందించడం లేదు. 

హామీ అమలు ఎప్పుడో..?

57 ఏండ్లు నిండినోళ్లకు పెన్షన్లు ఇస్తామంటూ సర్కారు చెబుతోంది తప్ప అమలు చేయడంలేదు. వీటిపై 2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఎన్నికలు అయిపోగానే 2018 అసెంబ్లీ ఎలక్షన్ ఓటర్ లిస్టు ఆధారంగా వృద్ధాప్య పెన్షన్ కు అర్హులైన 57 ఏండ్లు నిండిన వారిని లెక్కించగా హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 6.30 లక్షల మంది ఉన్నట్లు తేలింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో లక్ష మంది వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ రెండున్నరేండ్లలో మరో లక్ష మంది వరకు పెన్షన్​కు  అర్హత సాధించినట్లు తెలుస్తోంది.  57 ఏండ్లు నిండినోళ్లకు పెన్షన్ ఇస్తామని 2019 బడ్జెట్‌‌లోనూ ప్రభుత్వం చెప్పింది. అదే ఏడాది అక్టోబర్​లో  జరిగిన హుజూర్​నగర్ బై ఎలక్షన్​లోనూ సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో మళ్లీ ప్రకటించారు. దుబ్బాక బై ఎలక్షన్​ టైంలోనూ 57 ఏండ్ల వారికి పెన్షన్ అంటూ ఊదరగొట్టారు. సీఎం కొత్త పింఛన్లు ఇస్తామని నాగార్జున సాగర్ ఎన్నికల సభలో ప్రకటించారు. మొన్నటికి మొన్న సిరిసిల్లలోనూ ప్రకటన చేశారు. కానీ అమలు మాత్రం జరగడం లేదు.