జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణపై నీలినీడలు 

జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణపై నీలినీడలు 

సర్కార్ ఆఫీస్ లను విస్తరించి వదిలేసిండ్రు
బాధితులకు పరిహారంపై చేతులెత్తేసిన ప్రభుత్వం
అమలుకాని మినిస్టర్​ కేటీఆర్​హామీ
ఇరుకు రోడ్డుపై ప్రజల ఇబ్బందులు

జగిత్యాల, వెలుగు : జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలగడం లేదు. ఈ పాలక వర్గంలోనైనా సమస్య పరిష్కారమవుతుందని ఆశపడ్డ జిల్లావాసులకు నిరాశే ఎదురవుతోంది. మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అక్రమణలు తొలగించి 80 ఫీట్ల రోడ్డును100 ఫీట్లుగా విస్తరణకు చర్యలు తీసుకున్నా.. మిగితా చోట్ల విస్తరణకు వీలుకాకపోవడంతో ఆఫీసర్లు చేతులెత్తేశారు. జిల్లా కేంద్రంలో ముఖ్య సమస్యగా ఉన్న ఈ రోడ్డు విస్తరణ ప్రతీసారి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతోంది. దశాబ్దాలుగా ఊరిస్తున్న యావర్ రోడ్డు విస్తరణ పనులు ప్రైవేటు స్థలాల వద్ద మళ్లీ ఆగిపోయాయి. విస్తరణ చేయకుండా రోడ్డు వేయడం, డివైడర్స్, సెంట్రింగ్ లైడ్స్, కరెంట్ పోల్స్ ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు విస్తరణ అవుతుందని ఆశించిన పట్టణ ప్రజలు నిరాశకు గురవుతున్నారు. 

మినిస్టర్ కేటీఆర్ హామీ నెరవేరకపాయె..
జగిత్యాల పర్యటనలో 2017లో అప్పటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ యావర్ రోడ్డును వెడల్పు చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పాలకవర్గం ఏర్పాడ్డక గతేడాది యావర్ రోడ్డు అంశంపై కేటీఆర్ ను కలిసి ఆస్తి నష్టపోతున్న మని పరిహారం మంజూరు చేయాలని కోరారు. రోడ్డు విస్తరణకు మినిస్టర్ ఓకే చెప్పినా బాధితులకు నష్ట పరిహారం అంశంపై సుముఖంగా లేరని సమాచారం. ఈ రోడ్డు విస్తరణ లో సుమారు 212 మంది బాధితులు భూములు కోల్పోతున్నారు. కమర్షియల్ ఎరియా కావడంతో రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ కాకుండా సుమారు గుంటకు రూ.70 లక్షల నుంచి రూ. కోటికి ఓపెన్ మార్కెట్ లో రేటు ఉంది. ఈ లెక్కన ఎలా చూసిన బాధితులకు అందించాల్సిన నష్ట పరిహారం రూ.100 కోట్లకు పైగా ఉండనుంది. దీంతో బల్దియా పాలకవర్గం చేసేదేం లేక సర్కార్ ఆఫీస్ ల వద్ద విస్తరణ చేపట్టి ప్రైవేట్ అస్తుల జోలికి పోలేదని తెలుస్తోంది.

పరిహారం ఇస్తే బాధితులు సిద్ధమే..
యావర్ రోడ్డు మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా 80–100 ఫీట్లు విస్తరిస్తే సుమారు 212 మంది నష్టపోతున్నారు. ఇందులో 22 మంది తమ బిల్డింగ్ లలో సుమారు 40 నుంచి50 శాతం వరకు కోల్పోవడంతోపాటు పూర్తి నిర్మాణం దెబ్బతినే ఆవకాశం ఉంది. మిగిలిన సుమారు 190 మంది తమ బిల్డింగ్​లలో10 నుంచి 40 శాతం స్థలాన్ని కోల్పోతున్నారు. వీరిలో కొందరు నష్ట పరిహారం ఇస్తే స్వచ్ఛందంగా తొలగించేందుకు సిద్ధంగా ఉన్నారు. నష్ట పరిహారానికి ప్రత్యామ్నాయంగా జగిత్యాల బల్దియాకు చెందిన కమర్షియల్ బిల్డింగ్స్ లో షెటర్స్ లేదా బల్దియాకు చెందిన స్థలాలను కేటాయించి, రోడ్డు వెడల్పు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్
 చేస్తున్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ఉన్న యావర్ రోడ్డులో టవర్ సర్కిల్, తహసీల్ చౌరస్తా, ప్రభుత్వ ఆస్పత్రి, మున్సిపాలిటీ, ఎమ్మార్వో ఆఫీసు, కోర్టు, ఆర్డీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ఫారెస్ట్ ఆఫీస్, ఆర్అండ్ బీ ఆఫీస్, ఫైర్ స్టేషన్, మున్సిపల్ పార్క్, అంగడి బజార్ ఉండటంతో కీలకంగా మారింది. ఇక్కడ రోడ్డు చిన్నగా ఉండి.. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో స్వయంగా మినిస్టర్ కేటీఆర్ యావర్ రోడ్డు వెడల్పు చేస్తానని హామీ ఇచ్చినా ఇప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

పరిహారం అందజేయాలి
యావర్ రోడ్డు వెడల్పులో స్థలాలు కోల్పోతున్న బాధితులకు నష్ట పరిహారం అందజేసి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రతి ఒక్క బాధితుడికి నష్ట పరిహారం అందాలి. 
- గాజుల రాజేందర్,  కాంగ్రెస్ నేత, మాజీ కౌన్సిలర్

ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలి
సర్కార్ స్థలాల్లో ఉన్న ఆఫీసుల్లో విస్తరణ పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. పట్టణవాసుల 30 ఏళ్ల కలగా ఉన్న యావర్ రోడ్డు విస్తరణ చేపట్టాలి. బాధితులకు నష్ట పరిహారం అందజేయాలి. లేకపోతే కమర్షియల్ ఏరియాల్లో ఉన్న బల్దియా బిల్డింగ్స్ లో షెటర్స్, సర్కార్ స్థలాలను కేటాయించాలి.
- అనుమల్ల జయశ్రీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్, జగిత్యాల