హరితహారంలోమొక్కలు నాటిన చోటే మళ్లీ నాటుతున్నరు

హరితహారంలోమొక్కలు  నాటిన చోటే మళ్లీ నాటుతున్నరు
  • నాటిన చోటే మళ్లీ నాటాల్సిన పరిస్థితి
  •     రాష్ట్ర వ్యాప్తంగా 6.37 కోట్ల మొక్కలు లక్ష్యం 
  •     ఈసారి ఇరిగేషన్​ ల్యాండ్స్​టార్గెట్​
  •     ఆ స్థలాల్లో ఆల్​రెడీ నాటామంటున్న అధికారులు
  •     గతంలో నాటిన 236.54 కోట్ల మొక్కల లెక్కేది?  
  •     మొక్కల పర్యవేక్షణకు ఇన్​టైంలో నిధులివ్వట్లేదంటున్న ఆఫీసర్లు 

నల్గొండ, వెలుగు : హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం అభాసుపాలవుతోంది. ప్రతి ఏటా లక్షల మొక్కలు నాటుతున్నట్లు కాగితాలపై చూపిస్తున్న అధికారులు.. వాటిల్లో ఎన్ని మొక్కలు బతికున్నాయనే వివరాలు మాత్రం పక్కాగా చెప్పలేకపోతున్నారు. నాటిన చోటే మళ్లీ నాటుడు తప్పా కొత్తగా మొక్కలు నాటడానికి స్థలాలు లేవని అధికారులే చెప్తున్నారు. 2015లో సీఎం కేసీఆర్​ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ఇప్పటికే 8 విడతల్లో పూర్తయ్యింది. వచ్చే వానాకాలం సీజన్​లో తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇన్నేండ్లపాటు నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి త్వరలో చేపట్టబోయే ప్రోగ్రామ్​కు కొంత తేడా చూపించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలో 6.37 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్​ పెట్టింది. కార్యక్రమం కోసం సర్కారు రూ.937 కోట్లు కేటాయించింది. దీని కోసం ఇప్పటి నుంచే నర్సరీల్లో మొక్కల పెంపకంతో పాటు, అవసరమైన స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు కూడా వచ్చాయి.  

నాటిన మొక్కలకు లెక్కలేవి? 

రాష్ట్రంలో 2015 నుంచి 2022 సంవత్సరం వరకు నిర్వహించిన ఎనిమిది విడతల హరితహారం కార్యక్రమాల్లో సుమారు 236.54 కోట్ల మొక్కలు నాటినట్లు గణాంకాలు చెప్తున్నాయి. దీనికోసం ప్రభుత్వం సుమారు రూ. 6 వేల కోట్ల దాకా ఖర్చు చేసింది. ఏ ఏటికాయేడు హరితహారం యాక్షన్​ ప్లాన్​లో మార్పులు తీసుకువస్తున్న ప్రభుత్వం ఆరో విడతలో మియావాకీ పద్ధతిని అవలంబించాలని చెప్పింది. అప్పటికే రాష్ట్రంలో మొక్కలు నాటేందుకు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల కొరత తీవ్రంగా ఉండడంతో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ‘జపాన్’​ పద్ధతిని ఫాలో కావాలని సూచించింది. స్వదేశీ చెట్ల ద్వారా దేశీయ అడవులను పునర్​నిర్మించే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ మియావాకీ పద్ధతి అన్ని జిల్లాలో సక్సెస్​ కాలేకపోయింది. ఆ తర్వాత ఉపాధి హామీ స్కీం కింద ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలాలు గుర్తించి పల్లె ప్రకృతి వనాలు, బృహత్​ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలనే టార్గెట్​ పెట్టింది. కానీ, గ్రామాల్లో, పట్టణాల్లో స్థలాలు లేకపోవడంతో ఎక్కడో ఊరికి దూరంగా రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. బృహత్​ప్రకృతి వనాల లక్ష్యాన్ని కూడా అధికారులు పూర్తి స్థాయిలో చేరుకోలేకపోయారు. హరితహారం కొనసాగించాలనే పట్టుదలతో జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన, గ్రామీణ రోడ్ల పక్కన స్థలాలు, ఇరిగేషన్ ల్యాండ్స్​ను కూడా వదిలిపెట్టలేదు. నల్గొండ జిల్లాలోని విజయవాడ--‌‌–-హైదరాబాద్​ ప్రధాన జాతీయ రహదారిపైన నాటిన మొక్కల విషయంలో పర్యవేక్షణ లేకపోవడంతో చాలా వరకు చనిపోయాయి. రాష్ట్ర రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలదీ అదే పరిస్థితి. కోతుల ఆహార వనాలు పేరుతో ఒకే చోట గంపగుత్తగా నాటిన పండ్ల మొక్కల జాడ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరం మళ్లీ ఇరిగేషన్​ల్యాండ్స్​లో మొక్కలు నాటాలనే కొత్త లక్ష్యా న్ని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ధేశించింది. 

ఈ సారి 932 కోట్ల కేటాయింపు

9వ విడత హరితహారంలో భాగంగా ఈ ఏడాది నీటిపారుదల శాఖ పరిధిలోని ల్యాండ్స్​లో మొక్కలు నాటాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6.37కోట్ల మొక్కలు నాటాలని చెప్పిన సర్కారు రూ.932 కోట్లు కేటాయించింది. తక్కువ ప్లేస్​లో ఎక్కువ మొక్కలు నాటి సంపద వనాలు సృష్టించాలని ఆదేశించింది. దీంట్లో భాగంగా జిల్లాల్లోని నీటి ప్రాజెక్టులు, కాల్వల కింద సేకరించిన ప్రభుత్వ భూములు గుర్తించాలని, దీనికోసం ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇరిగేషన్​ ఆఫీసర్లు జాయింట్ సర్వే చేయాలని ఆర్డర్స్​ ఇచ్చింది. కానీ, ఇప్పటికే ఇరిగేషన్ ల్యాండ్స్​లో మొక్కలు నాటేశామని, కొత్తగా ఎక్కడ నాటాలో అర్థం కావట్లేదని అధికారులంటున్నారు. 8 విడతల్లో ఇరిగేషన్​కాలువలు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల పరిధిలో మొక్కలు పెట్టేశామని, అర్బన్ ​ఏరియాల్లో వార్డుల్లో ఖాళీ జాగా లేకపోవడంతో రిజర్వాయర్ల వద్ద మొక్కలు నాటామని చెప్తున్నారు. ప్రభుత్వం మొక్కల పర్యవేక్షణకు అవసరమైన నిధులు సకాలంలో ఇవ్వట్లేదని, దీంతో అవి చనిపోతున్నాయంటున్నారు. నాటినే చోటే మళ్లీ మొక్కలు నాటాల్సిన పరిస్థితి తప్పా కొత్తగా మొక్కలు నాటేందుకు ఇరిగేషన్​ స్థలాలు కూడా అందుబాటులో లేవంటున్నారు. నల్గొండ జిల్లాలో ఏఎమ్మార్పీ, ఎస్సారెస్పీ, డిస్ట్రిబ్యూటరీ కాల్వ గట్లు కంపచెట్లతో నిండిపోయాయని, వాటిని తొలగిస్తే తప్పా కొత్తగా మొక్కలు నాటే ఛాన్స్​ లేదని సీనియర్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు.