ఇలాంటి దరిద్రపు పాలన మరెక్కడా ఉండదు

ఇలాంటి దరిద్రపు పాలన మరెక్కడా ఉండదు

వికారాబాద్, వెలుగు : ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తెలంగాణ ప్రజలను మోసం చేశారని వైఎస్​ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. శుక్రవారం వికారాబాద్​ జిల్లా దౌల్తాబాద్ మండలంలో పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన మాటముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాజకీయ చరిత్రలో కేసీఆర్​అంత దరిద్రపు పాలన మరెక్కడా ఉండదన్నారు. మితిమీరిన అప్పులు చేసి రాష్ట్రాన్ని కేసీఆర్​ముంచారని ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణ అని చెప్పి, తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నారని విమర్శించారు. కేసీఆర్​అరాచకాలు, దోపిడీని ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నించడం లేదో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ‘‘తెలంగాణలో  పిల్లలను చదివించి తప్పు చేశామని తల్లి దండ్రులు మొత్తుకుంటున్నరు. కౌలురైతులు రైతే కాదట.  రైతుబంధు కౌలురైతులకు ఇవ్వరట.

రాష్ట్రంలో రూ.25 వేలు ఇచ్చే వ్యవసాయ పథకాలను బంద్ పెట్టి, ముష్టి రూ.5 వేలు ఇస్తున్నరు. రూ.5 వేలిస్తే  రైతులు కోటీశ్వరులవుతరా? ” అని షర్మిల నిలదీశారు. కేసీఆర్ కనీసం ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె విమర్శించారు. ఈసారి మళ్లీ గారడీ మాటలు చెప్తారని, గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని కేసీఆర్​ నమ్మిస్తారని, ఈసారి కూడా కేసీఆర్ కు ఓట్లు వేస్తే  తర్వాతి తరాలు క్షమించరని హెచ్చరించారు.  ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న దొంగను ఎండగట్టాల్సిన బీజేపీ, కాంగ్రెస్  పార్టీలు నిద్రపోతున్నాయని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ టికెట్​పై గెలిచిన ఎమ్మెల్యేలు  సంతలో పశువుల్లా అమ్ముడుపోతున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఫైర్​అయ్యారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో బీజేపీ మోసం చేసిందని విమర్శించారు.