కూలీలుగా మారిన ఫీల్డ్​ అసిస్టెంట్లు

కూలీలుగా మారిన ఫీల్డ్​ అసిస్టెంట్లు

ఆసిఫాబాద్, వెలుగు:15 ఏండ్లు ప్రజలకు ఉపాధి కల్పించిన వారికే ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది. సర్కారు నిర్ణయంతో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిన 2005లోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కాంట్రాక్టు పద్ధతిపై ఫీల్డ్​అసిస్టెంట్లను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,700 మంది ఫీల్డ్​అసిస్టెంట్లు15 ఏండ్లుగా పథకం అమల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో పనుల ఎంపిక, జాబ్​కార్డుల జారీ, కూలీలకు పని కల్పన వంటి కీలక బాధ్యతలు చూస్తున్నారు. జాబ్​కార్డు పొందిన ప్రతి కుటుంబానికి ఎఫ్ఏలు కనీసం 40 రోజుల పని కల్పించాలని గత ఏడాది డిసెంబర్​లో ప్రభుత్వం రూల్​పెట్టింది. ఈ రూల్​ఆధారంగా ఫీల్డ్​అసిస్టెంట్లను గ్రేడింగ్​చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఏడాది మార్చి 12న ఎఫ్ఏలు సమ్మె బాట పట్టారు. కరోనా నేపథ్యంలో 8 రోజులకే సమ్మె ముగించారు. అయితే ప్రభుత్వం మాత్రం వారిని డ్యూటీలోకి తీసుకోలేదు. సమ్మె చేశారన్న సాకుతో ఐదు నెలల క్రితం ఫీల్డ్​అసిస్టెంట్ల వ్యవస్థను రద్దు చేసింది. వారి డ్యూటీని పంచాయతీ సెక్రటరీలకు అప్పజెప్పింది. దీంతో 15 ఏండ్లుగా ‘ఉపాధి’నే నమ్ముకున్న ఎఫ్ఏలు ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బతుకు బండి నడిపించడానికి కొందరు కూలీలుగా మారితే, మరికొందరు గొర్లు బర్లు కాస్తూ జీవనం గడుపుతున్నారు.

తాపీ మేస్త్రీ పని చేస్తున్న

ఉద్యోగం అన్నం పెడుతోందనుకుంటే సర్కారు తీసేసింది. జాబ్​పోవడంతో కుటుంబం రోడ్డున పడింది. పనులు లేక బెల్లంపల్లి పట్టణంలో మేస్త్రీ పని చేస్తున్నా. కుటుంబాన్ని సాదడం తక్లీఫ్​ అయితాంది. పనులు రోజూ దొరకవు. పస్తులు ఉండాల్సి వస్తోంది. ఇబ్బందులు పడుతున్నం. సర్కార్ మమ్మల్ని ఆదుకోవాలె.

– రాయిసిడాం రామకృష్ణ, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్, తిర్యాణి

ప్రత్యేక రాష్ట్రంలో రోడ్డున పడ్డం

ఈజీఎస్​ మదలైనప్పటి నుంచి జైనూర్ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేశా. తక్కువ జీతం ఉన్నా పని చేశాం. రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగానికి భద్రత దొరుకుతుందని అనుకున్న. కానీ, టీఆర్ఎస్ సర్కార్ మా బతుకులను రోడ్డుపాలు చేస్తదని ఉహించలేదు. ఇప్పుడు పొయ్యి కట్టెలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా.

– ఆత్రం రవీందర్, జైనూర్

పెయింటింగ్​పనులు చేస్తున్న

ఊర్లో కూలీలకు ఉపాధి కల్పిస్తూ 15 ఏండ్లు పని చేసిన. రూపాయి కూడా వెనకేయలే. జాబ్ ఉందనే  భరోసాతో ఉన్న సమయంలో సర్కార్ మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించింది. మామీద ఎందుకింత కక్ష . ఇప్పుడు పని దొరుకుతలేదు. నాకు వచ్చిన కళ ఇప్పుడు అన్నం పెడుతోంది. పల్లె ప్రకృతి వనం కోసం గేటుకు, బెంచీలకు పెయింటింగ్ వేస్తున్న.

– దేవాజి, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్

For More News..

క్లోజ్ ఫ్రెండ్‌తో గొడవలా.. అయితే ఇలా చేయండి

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

సినిమాల్లోనే విలన్.. రియల్ లైఫ్‌లో మాస్ హీరో