సీఎం ఎంపికపై వీడని సస్పెన్స్... ఢిల్లీకి భట్టి, ఉత్తమ్

సీఎం ఎంపికపై  వీడని సస్పెన్స్... ఢిల్లీకి భట్టి, ఉత్తమ్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 4 నుంచి ఈ అంశంపై  చర్చలు  జరుపుతున్న  కాంగ్రెస్ అధిష్టానం, ఏఐసీసీ నేతలు డిసెంబర్4న  రాత్రి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు, ఏఐసీసీ పరిశీలకుల బృందం ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే రాజ్ భవన్ లో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి కాగా.. ఇప్పటికీ సీఎం అభ్యర్థిపై క్లారిటీ రాకపోవడంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఈ క్రమంలో నేడు ముఖ్యమంత్రి ఎంపికపై నేతలు ఢిల్లీలో కసరత్తు చేయనున్నారు. 

ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోగతం తెలుసుకున్నారు. నేడు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సహా అధిష్టానం పెద్దలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజు జరిగే భేటీలో ఎమ్మెల్యేల మనోగతం, సీనియర్ నేతల అభ్యంతరాలపై ఏఐసీసీ పరిశీలకులు నివేదికను అధిష్టానం నేతలకు సమర్పించనున్నారు.

ముఖ్యమంత్రి ఎంపికపై చర్చ జరుగుతుండగా.. ఏఐసీసీ పరిశీలకుల బృందంలో మొదట్నుంచీ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సీఎం ఎవరన్నది అధిష్టానం ఖరారు చేసిన తర్వాత ఏఐసీసీ పరిశీలకులు మళ్లీ హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్ లొనే ముఖ్యమంత్రిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరో వైపు  భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు.