
- కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ వస్తరా..?
- పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌ను అసెంబ్లీలో చర్చకు పెట్టనున్న ప్రభుత్వం
- ఫాంహౌస్‌లో కేటీఆర్, హరీశ్‌తో వరుసగా భేటీలు నిర్వహిస్తున్న కేసీఆర్
- అసెంబ్లీలో పీపీటీకి అనుమతివ్వాలని స్పీకర్‌కు బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం కమిషన్రిపోర్ట్పై బీఆర్ఎస్పార్టీ పెద్దల్లో టెన్షన్మొదలైంది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనున్న నేపథ్యంలో.. ఎలా ఎదుర్కోవాలన్న దానిపై గులాబీ పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. అసలు కాళేశ్వరం కమిషన్రిపోర్టు, ప్రాజెక్టుపై చర్చకు.. ఆ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ వస్తారా? రారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కేసీఆర్ఈ చర్చకు దూరంగానే ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
ప్రతిపక్ష నేతగా ఒకట్రెండు సార్లు అసెంబ్లీకి వచ్చిపోయిన కేసీఆర్.. ఆ తర్వాత ఏ చర్చలోనూ పాల్గొనలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు కూడా ఆయన హాజరుకారని అంటున్నారు. ఆ బాధ్యతలను మళ్లీ ఎప్పటిలాగానే హరీశ్‌రావుకు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. కానీ అధికారపార్టీ నేతలు మాత్రం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంపై కేసీఆర్‌కు సవాల్ కూడా విసిరారు.
అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు..
కమిషన్ రిపోర్ట్‌ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తనకున్న అన్ని మార్గాలనూ వెదుక్కుంటున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్, హరీశ్‌రావులే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, మేడిగడ్డ కుంగుబాటుకు వాళ్లే కారణమని కమిషన్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్‌రావు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కానీ వాళ్ల విజ్ఞప్తిని హైకోర్టు కొట్టిపారేసింది. కమిషన్ రిపోర్టుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో.. అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టే చర్చను ఎలా ఎదుర్కోవాలన్నది ఇప్పడు ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందని తెలుస్తున్నది. దీంతో అసెంబ్లీలో చర్చను వీలైనంతవరకు అడ్డుకోవాలన్న ఎత్తుగడలో గులాబీ పార్టీ పెద్దలున్నట్లు తెలుస్తున్నది.
అందులో భాగంగానే ప్రభుత్వం కమిషన్ రిపోర్టుపై చర్చకు పెడితే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే వ్యూహం అనుసరించాలని భావిస్తున్నా.. ఇందుకు స్పీకర్ఒప్పుకుంటారా? అన్నది అనుమానంగానే ఉన్నది.
ఫాంహౌస్‌లో వరుస భేటీలు..
కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టు వచ్చినప్పటి నుంచి ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో హరీశ్‌రావుతో కేసీఆర్ వరుసగా భేటీ అవుతున్నారు. పలుమార్లు కేటీఆర్, వినోద్ కుమార్, జగదీశ్‌రెడ్డిని పిలిపించుకున్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని హైకోర్టుకు వెళ్లారు. అక్కడ చెక్ పడడంతో.. అసెంబ్లీలో కమిషన్ రిపోర్టుపై చర్చలోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. తాజాగా.. శుక్రవారం కూడా కేటీఆర్, హరీశ్‌రావుతో కేసీఆర్ మరోసారి ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో సమావేశమయ్యారు.
హరీశ్‌రావు గురువారం నుంచి అక్కడే ఉన్నట్టు తెలిసింది. నిజానికి అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఎల్పీ సమావేశం నిర్వహించాల్సి ఉండగా, ఆ జోలికే వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాళేశ్వరం రిపోర్ట్‌పై జరిగే చర్చలో పార్టీ తరుఫున ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా హరీశ్‌రావుకే కేసీఆర్ వదిలేసినట్లు పార్టీవర్గాలు చెప్తున్నాయి. గతంలో జరిగిన సమావేశాల్లోనూ హరీశ్‌రావే ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడారు.
మరోవైపు ఈ సమావేశాల్లో కొత్త ఎత్తుగడను అనుసరించాలనే నిర్ణయానికి హైకమాండ్వచ్చింది. ఇప్పటికే సందర్భం దొరికినప్పుడల్లా ఏపీ కడుతున్న బనకచర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతున్నారని హరీశ్‌రావుతో పాటు కేటీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలోనూ ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. దానికి తోడు గోదావరి –కావేరి లింక్‌నూ కాళేశ్వరానికి లంకె పెట్టాలని భావిస్తుండడంతో అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి నెలకొన్నది.