కడుపున పుట్టిన బిడ్డ రా : కూతురును చంపేసిన తల్లి, అన్న

కడుపున పుట్టిన బిడ్డ రా : కూతురును చంపేసిన తల్లి, అన్న

జీవిత గమనంలో అందరూ కోరుకునేది పరువు.. ప్రతిష్ట. అందరూ పరువుతో బతకాల్సిందే.. దానికి ఆర్థిక తారతమ్యాలు లేవు. మరి పరువు కోసం ఏమైనా చేయొచ్చా...? చేస్తారా..? తరచుగా వినిపిస్తున్న పరువు హత్యల పరమార్థం ఏంటి..? తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఒక సంఘటన మరోసారి సభ్య సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. 

అసలేం జరిగిదంటే... 

పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో ఓ కన్న తల్లి తన కుమారుడితో కలిసి కూతురిని చంపేసిన సంఘటన కలిచి వేస్తోంది. ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టిస్తోంది. కోటంక గ్రామానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయికి ఆమె తల్లి, సోదరుడు పెళ్లి సంబంధం చూశారు. అయితే.. ఆ సంబంధం వద్దని, తనకు నచ్చిన వ్యక్తితోనే పెళ్లి చేయండని కోరింది ఆ యువతి. 

తెచ్చిన సంబంధం ఇష్టం లేదని సదరు యువతి ముందుగానే చెప్పింది. నచ్చిన వ్యక్తిని చేసుకుంటానంటూ తల్లితో చెప్పింది. దీంతో ఆమెతో కుటుంబ సభ్యులు వారించారు. చేసుకోవాలంటూ పట్టుపడ్డటంతో ఆమె వారి మాట వినలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. పెళ్లి సంబంధం చూసిన వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలంటూ ఆమెను తల్లి, సోదరుడు కలిసి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. 

అంతటితో ఆగకుండా చున్నీతో గొంతు బిగించి దారుణంగా చంపేశారు. చంపిన తర్వాత.. ఆమె తల్లి, సోదరుడు దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారు. యువతి మృతితో గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. తల్లి, కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పరువు, ప్రతిష్ట అంటూ ఓ కన్నతల్లే కడుపున పుట్టిన కూతుర్ని చంపేసిన తర్వాత ఇప్పుడు ఆ పరువు వచ్చిందా..? ఉన్న పరువు కాస్త పోయింది. అందరి ముందు తలవంచాల్సిన పరిస్థితి తలెత్తింది. కుమారుడిని కూడా వారించాల్సిన తల్లే.. కూతుర్ని చున్నీతో దారుణంగా చంపేసింది. బిడ్డను చంపిన తర్వాత ఇప్పుడు ఒకే ఇంట్లోని తల్లి, కుమారుడు జైలు పాలయ్యారు. ఉన్న కుమార్తె ఇంకెప్పుడు ఎవరికీ కనిపించకుండా పోయింది.