బిహార్‌‌లో ఎన్నికలు జరుగుతుంటే.. రాహుల్ షిమ్లాలో ఎంజాయ్ చేశారు

బిహార్‌‌లో ఎన్నికలు జరుగుతుంటే.. రాహుల్ షిమ్లాలో ఎంజాయ్ చేశారు

పాట్నా: బిహార్ ఎన్నికల్లో మహాగట్బంధన్ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణమని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సీనియర్ నేత శివానంద్ తివారీ విమర్శించారు. మహాగట్బంధన్ మెజారిటీ సీట్లు దక్కించుకోవడంలో విఫలమైనప్పటికీ.. ఆర్జేడీ 75 సీట్లతో బిహార్‌‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదే కాంగ్రెస్ 19 సీట్లతో తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో బిహార్‌ ఎన్నికల్లో కూటమి ఓటమికి కారణమంటూ రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ లీడర్లపై శివానంద్ విరుచుకుపడ్డారు.

‘బిహార్‌‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో షిమ్లాలోని ప్రియాంక ఇంటికి రాహుల్ గాంధీ పిక్నిక్‌‌కు వెళ్లారు. ఎవరైనా పార్టీని ఇలా నడిపిస్తారా? కాంగ్రెస్ తన చర్యలతో బీజేపీకి ప్రయోజనం చేకూర్చుతోంది. వాళ్లు 70 మంది అభ్యర్థులను బరిలో నిలబెట్టారు. కానీ 70 పబ్లిక్ ర్యాలీలు కూడా నిర్వహించలేదు. రాహుల్ మూడ్రోజులు ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రియాంక అసలు రానే లేదు. బిహార్‌‌తో సంబంధం లేని వారు ప్రచారానికి వచ్చారు. ఇది సరైన తీరు కాదు. బిహార్‌తోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అలాగే వ్యవహరిస్తోంది. ఎక్కువ స్థానాల్లో పోటీలో నిలబడాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కానీ అందుకు తగ్గట్లే ప్రచారం చేయడం లేదు. దీంతో ఓటమి పాలవుతున్నారు. దీని గురించి ఆ పార్టీ అధిష్టానం ఆలోచించాలి’ అని తివారీ పేర్కొన్నారు.