ఐసీసీ కొత్త బాస్​ ఎవరు?..గంగూలీకి పెరుగుతున్న మద్దతు

ఐసీసీ  కొత్త బాస్​ ఎవరు?..గంగూలీకి పెరుగుతున్న మద్దతు

న్యూఢిల్లీఇంటర్నేషనల్​ క్రికెట్​ కౌన్సిల్​(ఐసీసీ) చైర్మన్​ పీఠం ఖాళీ అయ్యింది.  బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్​ శశాంక్​ మనోహర్​ ఐసీసీ చీఫ్​ పదవి నుంచి తప్పుకున్నారు. రెండుసార్లు రెండేళ్ల టర్మ్​ను పూర్తి చేసుకున్న శశాంక్​.. తనకు ఇంకోసారి అవకాశమున్నా వైదొలగ్గా… ప్రస్తుత డిప్యూటి చైర్మన్​ ఇమ్రాన్​ ఖవాజ తాత్కాలిక​ బాస్​గా బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాక సోమవారం లోపు చైర్మన్​ పదవికి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని ఇమ్రాన్​ వెల్లడించారు.  కానీ, దీనిపై ఐసీసీ నుంచి తదుపరి ప్రకటన రాకపోవడంతో గడువు పొడిగించే అవకాశం ఉంది.   అయితే శశాంక్​ స్థానాన్ని భర్తీ చేసేదెవరు ? బాస్​గా వరల్డ్​ క్రికెట్​ను నడిపించేదెవరూ ? అంటే.. పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారెవరో ఏంటో చూద్దాం.

కొలిన్​ గ్రేవ్స్​ ఫ్రమ్​ ఇంగ్లండ్​

ఐసీసీ ప్రెసిడెంట్​ రేసులో ఇంగ్లండ్​కు చెందిన కొలిన్​ గ్రేవ్స్​ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంగ్లండ్​ అండ్​ వేల్స్​ క్రికెట్​ బోర్డు(ఈసీబీ) మాజీ చైర్మన్​ అయిన గ్రేవ్స్​కు క్రికెట్​ పరిపాలన వ్యవహారాల్లో చాలా అనుభవం ఉంది. పైగా​ అడ్మినిస్ట్రేటర్​గా   మంచి మార్కులు సంపాదించారు. వీటిన్నింటికీ మించి ఈసీబీతోపాటు క్రికెట్​ ఆస్ట్రేలియా(సీఏ), బీసీసీఐ సపోర్ట్​ తనకు ఉంది. క్రికెట్ పెద్దన్నలైన ఆసీస్​, ఇండియా, ఇంగ్లండ్​ మద్దతు ఉన్నప్పటికీ సౌతాఫ్రికా వంటి ఇతర బోర్డుల నుంచి అండ లేకపోవడం అతనికి మైనస్​. కానీ బీసీసీఐ బహిరంగంగా తన మద్దతు ప్రకటిస్తే గ్రేవ్స్​కు తిరుగు ఉండదు.

ఇమ్రాన్​ ఫ్రమ్​ హాంకాంగ్​..

శశాంక్​ మనోహార్​ తన పదవికి రాజీనామా చేయడంతో డిప్యూటీ చైర్మన్​గా ఉన్న ఇమ్రాన్​ ఖవాజ  తాత్కాలిక  చైర్మన్​గా భాద్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాలతో ఇమ్రాన్​ కూడా చైర్మన్​ రేసులో నిలిచారు. సింగపూర్​ క్రికెట్​ అసోసియేషన్​ మాజీ ప్రెసిడెంట్​ అయిన ఇమ్రాన్​ వృత్తిపరంగా లాయర్​. కొన్ని బోర్డుల నుంచి అతనికి మద్దతు కూడా దొరికే అవకాశముంది. కానీ బిగ్​త్రీ (ఇండియా, ఇంగ్లండ్​, ఆస్టేలియా)ని కాదని ఓ అసోసియేట్​ నేషన్​ సభ్యుడు ఐసీసీ బాస్​ అవ్వడం అంత ఈజీ కాదు. ఒక వేళ అయినా బిగ్​త్రీ ఒత్తిడి దాటి నెట్టుకురాలేరు.

కామెరూన్​.. విండీస్​ మాజీ బాస్​

డేవ్​ కామెరూన్​.. వెస్టిండీస్​ క్రికెట్​ బోర్డు మాజీ ప్రెసిడెంట్. ఐసీసీ చైర్మన్​ పదవి కోసం ప్రయత్నిస్తానని ఇప్పటిదాకా అధికారికంగా చెప్పింది కామెరూనే. డేవ్​కు యునైటెడ్​ స్టేట్స్​ క్రికెట్​ హాల్​ ఆఫ్​ ఫేమ్​ నుంచి మద్దతు ఉంది. కానీ డేవ్​ నిజంగా బరిలోకి దిగాలంటే రెండు శాశ్వత సభ్య దేశాలు ఆయన్ని నామినేట్​ చేయాలి. డేవ్​ ముందున్న పెద్ద చాలెంజ్​ ఇదే. డేవ్​తోపాటు న్యూజిలాండ్​కు చెందిన గ్రెగర్​​ బార్ల్కీ, క్రికెట్​ సౌతాఫ్రికాకు చెందిన క్రిస్​ నెంజానీ కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు.

దాదా మనసులో ఏముంది?

‘బీసీసీఐ,గంగూలీ తలుచుకుంటే వాళ్లని ఆపగలిగే వారెవరు?. బీసీసీఐ చాలా సింపుల్​గా దాదాకు ఓట్లు తీసుకొస్తుంది. నిజానికి ఐసీసీ బాస్​ పదవికి సౌరవ్​ అన్ని విధాలా అర్హుడు’  టీమిండియా మాజీ కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ గురించి ఐసీసీ బోర్డు మెంబర్​ ఒకరు చేసిన వ్యాఖ్యలివి. ఐసీసీ చైర్మన్​ రేసులో దాదా స్థానం ఏంటో చెప్పేందుకు ఇవి సరిపోతాయి. నిజానికి, ఐసీసీ ఎన్నికల అంశంలో బీసీసీఐతోపాటు  గంగూలీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సంకేతాలు రాలేదు. కానీ చైర్మన్​  రేసులో సౌరవ్‌కు మాత్రం రోజురోజుకి మద్దతు పెరిగిపోతోంది.  ఐసీసీ చైర్మన్​గా గంగూలీ మాకు ఓకే అంటూ పలు బోర్డులు కూడా ప్రకటనలు చేశాయి. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే దాదా సై అంటే ఐసీసీ సింహాసనాన్ని ఎక్కడం ఖాయం. కానీ దాదా మనుసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు.   వాస్తవంలోకి వస్తే ఇండియా మాజీ కెప్టెన్​ గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్​గా ఉన్నాడు. ఆ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఆ పదవీకాలం పొడిగింపు అంశం ప్రస్తుతం సుప్రీం కోర్డులో ఉంది. సుప్రీం నుంచి సానుకూల తీర్పు వస్తే దాదా బీసీసీఐ బాస్​గా కొనసాగుతాడనే దానిలో  ఎలాంటి సందేహం లేదు. కానీ సుప్రీం.. లోధా కమిటీ సూచనలను అమలు చేయాలని చెబితే మాత్రం గంగూలీ ఐసీసీ పీఠంపై కన్నేసి అవకాశం ఉంది.

శశాంక్ వైదొలగడం.. బీసీసీఐకి బూస్టప్

టీ20 వరల్డ్​కప్​ రద్దు లేదా వాయిదా పడితే  సెప్టెంబర్– అక్టోబర్​ విండోలో ఐపీఎల్​ నిర్వహించాలని  బీసీసీఐ ప్రస్తుతం ప్లాన్స్​ చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇండియాకు చెందిన శశాంక్​ మనోహార్​ ఐసీసీ పదవిని వదిలేయడం బీసీసీఐకి ఎదురుదెబ్బ కావాలి. కానీ శశాంక్​ లేకపోవడమే ఇండియన్​ బోర్డుకు ప్లస్​ అని పలువురు అంటున్నారు. శశాంక్​ బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచి బీసీసీఐ, ఐసీసీ మధ్య వివాదాలు పెరగడమే ఇందుకు కారణం. 570 మిలియన్​ డాలర్లుగా ఉండే బీసీసీఐ షేర్​ను శశాంక్​ వచ్చాక కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఐసీసీ దానిని 365 మిలియన్​ డాలర్లు చేసింది.  దీనికి తోడు ప్రకటనల రెవెన్యూలో పెద్ద  వాటాదారైన బీసీసీఐకి ఐసీసీకి చెందిన ఫైనాన్షియల్​ అండ్​ కమర్షియల్​ అఫైర్స్​ కమిటీలో ప్రాతినిధ్యం లేకపోవడం చాలా కాలంగా సమస్యగా మారింది. ఆయా సమస్యలను పరిష్కరించడంలో శశాంక్​ పూర్తిగా ఫెయిలయ్యారు. దీంతో  కొత్త చైర్మన్​ ద్వారా ఆ  సమస్యలను బీసీసీఐ ఈజీగా  పరిష్కరించుకోగలదని చెబుతున్నారు. ఆ కొత్త బాస్​ గంగూలీనే అయితే ఇండియన్​ బోర్డుకు అడ్డే ఉండదని అంటున్నారు.

నెహ్రూ జూపార్క్ లో బెంగాల్ టైగర్ మృతి