మెడిటేషన్​ ఇలా కూడా ..

మెడిటేషన్​ ఇలా కూడా ..

సరే... అందరూ చెప్తున్నారు కదా అని ఎటువంటి డిస్టర్బెన్స్​ లేకుండా ఒక గదిలో కూర్చుని, కళ్లు మూసుకుంటే.. బుర్రలో ఆలోచనల సునామి. ఇదేందబ్బా! ఆలోచనల్ని అదుపులో పెట్టేందుకు ట్రై చేస్తుంటే... ఇంత గందరగోళం ఏంటని అనుకునే వాళ్లలో మీరూ ఉన్నారా? అయితే ఈ నాన్​ ట్రెడిషనల్​ మెడిటేటివ్​ ఐడియాస్​ ట్రై చేయాల్సిందే అంటున్నాడు మైండ్​ఫుల్​నెస్​ ప్రాక్టీషనర్, రచయిత జాయ్​ రెయిన్స్. అందుకు ఏడు పద్ధతులు​ కూడా చెప్పాడు.

నడకతో బుర్ర శుభ్రం

ఫ్రెష్​ ఎయిర్​లో వాకింగ్​ చేస్తే మూడ్​ బూస్ట్​ అవుతుందనేది తెలిసిందే. వాకింగ్​ చేసేటప్పుడు దృష్టంతా నడక మీదే ఉంటుంది. అలాగని ఆలోచనలు రావని కాదు. అవి వస్తుంటాయి. వాటిని బలవంతంగా ఆపేయొద్దు. ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నప్పుడు మైండ్​కి ఒక సిగ్నల్​ ఇవ్వాలి... అదెలాగంటే వాకింగ్​ చేస్తున్న మీ పాదాల చప్పుడు వినమనాలి. శ్వాసని గమనించాలి. మార్నింగ్​ వాక్​లో శరీరాన్ని తాకుతున్న లేత సూర్యకిరణాల్ని ఫీలవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆలోచనలకి బ్రేక్​ పడుతుంది.

ప్రకృతిని ఆస్వాదించాలి

ప్రకృతిలో ఉన్నప్పుడు అన్నింటినీ మర్చిపోయి పదిహేను సెకన్లు ఆనందాన్ని ఆస్వాదించగలిగితే అద్భుతమైన మూడ్​ బూస్టర్​గా పనిచేస్తుంది​. దాన్ని ఎక్స్​పీరియెన్స్​ చేసేందుకు పెద్ద పార్క్​లకి వెళ్లక్కర్లేదు. మీ ఇంటి చుట్టు పక్కల ఉన్న చెట్లు, ఆకాశం, సూర్యోదయం చూస్తే చాలు. అప్పుడు కలిగే భావన... ఫోన్​ మాట్లాడితేనో, జూమ్​ కాల్​ అటెండ్​ అయితేనో రాదు. ఆ ఫీలింగ్​ నాడీ వ్యవస్థను కూల్​ చేస్తుంది. ప్రశాంతతను ఇస్తుంది.

డ్రాయింగ్​ ప్రాక్టీస్​ 

ఆర్ట్స్​, క్రాఫ్ట్స్​ లాంటి హాబీస్​ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. డ్రాయింగ్​ వేసేటప్పుడు... బ్రెయిన్​ పూర్తిగా ఎంగేజ్​ అవుతుంది. వేరే ఆలోచనలేవీ రావు. ఎందుకంటే కాన్​సన్​ట్రేషన్​ అంతా డ్రాయింగ్​ మీదనే ఉంటుంది కాబట్టి.

ఇంటి పని కూడా రెమెడీనే!


ఆ క్షణాన్ని లేదా చేస్తున్న పనిని ఫీలవుతూ ఉంటే... అది మెడిటేటివ్​ మోడ్​లోకి తీసుకెళ్తుంది. నిజానికి రెగ్యులర్​గా చేసే ఇంటి పనుల్ని ఆటో పైలట్​ మోడ్​లో... అంటే యాధృచ్ఛికంగా చేస్తుంటాం. అందుకే ఒక పక్క పనిచేస్తున్నా మైండ్​లో ఆలోచనలు గిర్రున తిరుగుతుంటాయి. వాటిని ఆపేసి చేస్తున్న పని మీద దృష్టి పెడితే ఆలోచనలకు బ్రేక్​ పడుతుంది.

ఉదాహరణకు... ఉతికిన బట్టలు మడత పెట్టేటప్పుడు.. ఆ పనిని హడావిడిగా  చేయొద్దు. బట్టల నుంచి వస్తున్న లాండ్రీ డిటర్జెంట్​ వాసన, బట్టల టెక్చర్​ ఎలా ఉందో గమనించాలి. అలాగే ఎలా మడత పెడుతున్నారనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇందులో ఏముంది అనుకుంటున్నారేమో! కానీ ఇది కూడా మైండ్​ని రిలాక్స్​ చేయడమే. అలాగే గిన్నెలు కడిగేటప్పుడు, వ్యాక్యూమ్​ చేసేటప్పుడు కూడా మెడిటేటివ్​ మోడ్​లోకి వెళ్లిపోవచ్చు. ఏ పని చేస్తున్నా మనలోని ఆ పనిని ఫీలవ్వాలి. అప్పుడే చేస్తున్న పని నుంచి కూడా ప్రశాంతత దొరుకుతుంది.

పెన్నుతో పేపర్​ మీద రాయాలి

ఆలోచనలు, భావోద్వేగాలకి బ్రేక్​ ఇవ్వాలి. మనసులోని భావాలను పేపర్​మీద రాస్తున్నప్పుడు కూడా మైండ్​ మెడిటేటివ్​ స్టేజ్​లోనే ఉంటుంది​. రాస్తున్నప్పుడు చాలాసార్లు బుర్ర జడ్జిమెంటల్​గా ఆలోచిస్తుంటుంది. రాస్తున్న భావం మధ్యలోకి ఆలోచనలు చొరబడుతుంటాయి. ఇలాంటప్పుడు జడ్జిమెంట్​ ఫీలింగ్స్​ పక్కనపెట్టి.... ఏది వాస్తవమో అదే రాయాలి. రాస్తున్న విషయం మీదే దృష్టి నిలపాలి. రాయడం కోసం రోజుకి ఐదు నిమిషాలు ఏ డిస్టర్బెన్స్​ లేని టైం తీసుకోవాలి. ఆ టైం ఉదయాన్నే కాఫీ తాగాక లేదా రాత్రి నిద్రపోయే ముందు.. ఏదైనా కావచ్చు.

సినిమాకి వెళ్లడం కూడా...

నేచర్​లోకి వెళ్లినప్పుడు ‘వావ్’​ అనే ఫీలింగ్​ ఎలాగైతే వస్తుందో... సినిమా చూసినప్పుడు కూడా అలానే అనిపించే ఛాన్స్​ ఉంది. ఆలోచనల నుంచి బ్రేక్​ తీసుకునేందుకు సినిమా బెస్ట్​ టూల్. సినిమా చూస్తున్నప్పుడు బయటి ప్రపంచం గురించిన ఆలోచనలేవీ ఉండవు. మరీ ముఖ్యంగా మొబైల్​ఫోన్​ పక్కన పెడతారు. ఆలోచనలు రీ డైరెక్ట్​ అవుతాయి. అదెలాగంటే... సినిమా చూస్తున్నప్పుడు నెక్స్ట్​ సీన్​ ఏం జరుగుతుంది? ఎండింగ్​ ఇలా ఉంటుందేమో? అని బ్రెయిన్... తెర మీద కనపడుతున్న స్టోరీ గురించే ఆలోచిస్తుంటుంది. అంటే అదీ మెడిటేషనే కదా!

ఛాలెంజింగ్​ క్రాఫ్ట్​ ట్రై చేయాలి

ఛాలెంజింగ్​గా ఉండే స్కిల్​ నేర్చుకుంటే ఆ క్షణానికి అందులో పూర్తిగా లీనమవడం సహజం. సెల్ఫ్​ క్రిటికల్​ థాట్స్​... అంటే ఎవరి మీద వాళ్లకి నమ్మకం కోల్పోయే ఆలోచనలు.. కొన్నిసార్లు ఈ స్థితి బాగా ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు మైండ్​ సెట్​చేసి​ రీఫోకస్​ చేసేందుకు ఇది బాగా పనిచేస్తుంది. ఉదాహరణకు కుమ్మరి చక్రం గురించి చెప్పుకోవచ్చు. కుండ చేస్తున్నప్పుడు చేత్తో పట్టుకున్న మట్టి టెక్చర్​, టెంపరేచర్​ను సెన్స్​ చేయాలి. చక్రం తిరుగుతున్నప్పుడు వస్తున్న సౌండ్​ను​ ఏకాగ్రతతో వినాలి. ఆలోచనల్ని పక్కకు నెట్టి ఆ చక్రం చేస్తున్న సౌండ్​ మీదకు దృష్టి మళ్లించాలి.
రకరకాల ఆలోచనలతో బుర్రంతా గందరగోళం... విపరీతమైన ఒత్తిడి... ఆందోళన... వీటినుంచి బయటపడాలంటే మెడిటేషన్​ బెస్ట్​. ‘‘నిజానికి ఇవన్నీ మనసుకు సంబంధించిన అంశాలు. ఎప్పుడైతే మనసును స్థిరంగా ఉంచుతామో.. అప్పుడే సరిగ్గా ఆలోచించగలం’’ అని యోగ, మైండ్​ఫుల్​నెస్​ కోచ్​లు చెప్తుంటారు.