వీరికి ఆటలంటే ఎంత ఇష్టమంటే.. ప్రాణం..జీవితం

వీరికి ఆటలంటే ఎంత ఇష్టమంటే.. ప్రాణం..జీవితం

ఆటలంటే అందరికీ ఇష్టమే. కానీ, కొందరికి మాత్రం ఆ ఆటలే జీవితం. అలా ఆటలే ప్రాణంగా బతికేవాళ్లు పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్‌లో వందల్లో ఉన్నారు. వీళ్లకి ఆటలపై ఉన్న ఇష్టం  కేవలం పతకాలకే పరిమితం కాలేదు. వేలల్లో తమలాంటి క్రీడాకారుల్ని తయారుచేయించింది. ఎంతోమందిని  జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా మలిచింది. వీటన్నింటికి వేదికయ్యింది జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్. 

సుల్తానాబాద్, వెలుగు: క్రీడల ఖిల్లాగా పిలువబడే సుల్తానాబాద్ ఖోఖో ఆటకి పెట్టింది పేరు. ఈ జిల్లానుంచి చాలామంది క్రీడాకారులు తమ కూతని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  వినిపించారు. ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులూ అందుకున్నారు. మిగతా ఆటల్లోనూ రాణించారు.  దాంతో స్పోర్ట్స్ కోటాలో  ప్రభుత్వ ఉద్యోగాలు ‘క్యూ’ కట్టాయి. కానీ, ఎన్ని ఉద్యోగాలొచ్చినా వద్దని ఏరికోరి   పీఈటీలుగా, కోచ్ లుగా పోస్టింగులు ఇప్పించుకున్నారు మాజీ క్రీడాకారులు. తమలాంటి క్రీడాకారుల్ని ఎందర్నో తయారుచేస్తున్నారు వీళ్లు ఇప్పుడు.  

ఎందరో ఉన్నారు
పిఈటి, కోచ్లుగానే కాకుండా  వివిధ స్పోర్ట్స్  అసోసియేషన్లకు ప్రతినిధులుగా పనిచేస్తున్నారు ఈ జిల్లా క్రీడాకారులు. కె. రాధా కిషన్ ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అథ్లెటిక్ కోచ్గా  పనిచేస్తున్నారు. రాజ కొమురయ్య సింగరేణి సంస్థ స్పోర్ట్స్ ఆఫీసర్ గా పనిచేశాడు. రాజవీరు  కరీంనగర్ జిల్లా స్పోర్ట్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. పారుపల్లి వెంకట ఉమాపతి తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.  ఎం.రవీందర్ వాలీ బాల్ అసోసియేషన్ ప్రతినిధిగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ క్రీడా కారుడు గెల్లు మధుకర్లు కూడా ఈ జిల్లాకి చెందిన వారే. వీళ్లంతా సుల్తానాబాద్ గ్రౌండ్లో ఆటల వైపు తొలి అడుగులు వేయడం విశేషం. 

దాతల సాయంతో 
కేవలం క్రీడల్లో మెలకువలు చెప్పడమే కాదు. సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ద్వారా  ప్రతిరోజూ టోర్నమెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు మాజీ క్రీడాకారులు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయిన వందలాది మంది సుల్తానాబాద్ క్రీడాకారులను  దాతల సాయంతో ప్రోత్సహిస్తున్నారు. 

పూర్తి సమయం గ్రౌండ్ లో..
నేను ఈ గ్రౌండ్ నుండే నా క్రీడా జీవితం మొదలుపెట్టా. ప్రస్తుతం ఇక్కడే పిఈటీగా పనిచేస్తున్నా. విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి ఈ ఉద్యోగం ఎంచుకున్నా. అన్ని క్రీడల్లోనూ ఇక్కడి క్రీడాకారులు ముందు ఉండటం చాలా ఆనందంగా ఉంది.-అంతటి శంకర్, పీఈటీ, సుల్తానాబాద్

పోలీసు ఉద్యోగం మాని పీఈటీగా.. 
స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. కానీ, రోజులో ఓ అరగంటైనా ఆటలకి టైం లేదు. ఏదో కోల్పోతున్న ఫీలింగ్. దాంతో మళ్లీ పీఈటీగా ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం కరీంనగర్ మండలంలోని చామనపల్లిలో పనిచేస్తున్నా. విద్యార్థులను మంచి  క్రీడాకారులుగా మలచాలన్నదే నా లక్ష్యం. కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తే ఎస్సై, సిఐ  ప్రమోషన్ వచ్చేవేమో కానీ, ఈ గ్రౌండ్లో వచ్చే ఆనందం ముందు అవి చాలా చిన్నవి. -బిట్ర శ్రీనివాస్ 

ప్రోత్సాహం వల్లే..
సుల్తానాబాద్ కాలేజీలోనే  చదువుకున్నా..ఆ గ్రౌండ్లోనే వాలీబాల్ ప్రాక్టీస్ చేసి నేషనల్, ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొన్నా. నాలాగా క్రీడల్లో రాణించాలి అనుకుంటున్న వాళ్లకోసం  సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ స్థాపించా. దాతల సాయంతో పేద క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం. తెలంగాణలోనే ఈ స్పోర్ట్స్ క్లబ్ కు ప్రత్యేక గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. -ఎం రవీందర్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు