వడాపావ్ బంగారమాయె

వడాపావ్ బంగారమాయె

నగల తయారీలో బంగారం వాడతారని తెలుసు. కానీ, ఈ మధ్య బంగారంతో వంటలు కూడా చేస్తున్నారు. మొన్నామధ్య స్వీట్స్​ వ్యాపారం బాగా సాగాలని, ఒక వ్యాపారి బంగారు రేకుతో స్వీట్స్​ తయారుచేయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా కస్టమర్లని ఆకర్షించడానికి దుబాయి​లోని ఒక రెస్టారెంట్ వాళ్లు కూడా బంగారంతో ఒక ఎక్స్​పెరిమెంట్​ చేశారు.
ముంబైవాసుల ఫేవరేట్ స్ట్రీట్​ ఫుడ్​ వడాపావ్. అది ఇప్పుడు దుబాయి​ వీధుల్లో కనువిందు చేస్తోంది. అయితే ఇది మామూలు వడాపావ్​ కాదు, బంగారు వడాపావ్​. నమ్మకం కలగట్లేదా! కానీ, ఇది నిజం. ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్​ వడాపావ్​ ఇది. ఇందు​లో బటర్, చీజ్​లు వేసి ఎంతో టేస్టీగా తయారుచేశారు. దాని పైన ఏకంగా 22 క్యారెట్​ల బంగారు పూత పూసారు. నోరూరించే ఈ వడాపావ్ తినాలంటే దుబాయి​ కరెన్సీ ప్రకారం100 దీనార్లు చెల్లించాలి. అంటే, మన కరెన్సీలో అక్షరాల రెండువేలన్నమాట. దీన్ని ఒక అందమైన బాక్స్​లో పెట్టి ఉంచారు. ఆ బాక్స్​ మూత తెరవగానే పొగలు కక్కుతున్న వేడి వేడి టేస్టీ వడాపావ్​ కనిపిస్తుంది. ఒక వ్యక్తి దీన్ని చూపిస్తూ, టేస్ట్ చేస్తాడు. ఇదంతా వీడియో తీసి, సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేశారు. ఆ వీడియోలో దాన్ని తయారుచేసిన ప్రాసెస్​ కూడా చూపించారు. ఆ వీడియోని ఒక మహిళ తన ట్విట్టర్ అకౌంట్​లో పోస్ట్ చేసింది.