- కేరళ బీజేపీ కార్యకర్తలతో వర్చువల్‌గా ప్రసంగం
న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు(యూడీఎఫ్, ఎల్డీఎఫ్) ఇతర శక్తులతో చేతులు కలిపి, సమాజాన్ని విభజించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. గురువారం కేరళలోని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. కాంగ్రెస్ తన గాంధేయ భావజాలాన్ని విడిచిపెట్టిందని, ప్రస్తుతం అది మావోయిస్ట్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ గా మారిందని ఎద్దేవా చేశారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ పార్టీలు మతవిశ్వాసాలతో ఆడుకుంటున్నాయని, అయ్యప్ప స్వామి భక్తుల పట్ల ఈ ప్రభుత్వాల తీరు సరిగ్గా లేదని విమర్శించారు. కేరళ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడ్డారని, అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న బాధ్యతారహితమైన వ్యాఖ్యల వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాల తీరుతో యువత విసిగిపోయిందన్నారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలంటే బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలనుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు 75 ఏండ్లు ఇచ్చారు.. బీజేపీ- ఎన్డీఏ కూటమికి కేవలం ఐదేండ్లు ఇచ్చి చూడమని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు.
క్రికెటర్ సంజూ శాంసన్‌తో పోలిక
కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ ప్రతిభను ప్రధాని కొనియాడారు. ‘సంజూ శాంసన్ ప్రపంచకప్‌లో కీలక దశల్లో తన ప్రదర్శనను ఎలాగైతే పతాక స్థాయికి తీసుకెళ్తారో, బూత్ కార్యకర్తలు కూడా పోలింగ్ రోజున అదే ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో పని చేయాలి’ అని చెప్పారు. తిరువనంతపురం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కేరళలో మార్పును సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
