- ఆ పార్టీ ఉద్యమకారులను విస్మరించింది: మంత్రి పొన్నం
- కాంగ్రెస్‌లోకి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఆమె భర్త శోభన్
- అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చినట్టుంది: మోతె శ్రీలత
- మాతోనే గ్రేటర్లో టీఆర్ఎస్ పుట్టింది.. మాతోనే ఖతమైతది: శోభన్
- బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా.. ఇయ్యాల కాంగ్రెస్‌లో చేరిక
హైదరాబాద్, వెలుగు: అమరుల త్యాగాల పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ.. ఉద్యమకారులను విస్మరించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పార్టీ కోసం 24 ఏండ్లు కష్టపడిన వారిని కాకుండా పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పదవులు కట్టబెట్టారని, ఆ అవమానాన్ని భరించలేక చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని చెప్పారు.
ఆదివారం గాంధీ భవన్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఆమె భర్త శోభన్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిందన్నారు.
అందుకు తగ్గట్టుగా ప్రజల సంక్షేమం, వారిని అభివృద్ధివైపు నడిపించేందుకు కాంగ్రెస్ సర్కారు కట్టుబడి ఉందన్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ 2000వ సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీలోనే పనిచేశానని, కానీ, ఉద్యమకారులైన తమకు బీఆర్ఎస్లో సరైన న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరడం అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. ఎవరి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా కాంగ్రెస్‌లో చేరుతున్నానన్నారు.
ఉద్యమకారులను కేసీఆర్ పక్కనపెట్టడం వల్లే పార్టీకి రాజీనామా చేశామని బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ మోతె శోభన్ రెడ్డి అన్నారు. కేవలం ధనబలం ఉన్న వ్యక్తులనే కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఉద్యమకారుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై నమ్మకంతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో తమతోనే టీఆర్ఎస్ పార్టీ మొదలైందని, ఇప్పుడు తమతోనే ఆ పార్టీ ఖతం అవుతుందని అన్నారు.
తలుపులు మూసి బిల్లు పెట్టారని మోదీ అనడం సరికాదు..
పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లు పెట్టారంటూ ప్రధాని నరేంద్ర మోదీ అనడం సరి కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రొసీజర్ ప్రకారం బిల్లులు పాస్ చేసే సమయంలో సభ్యులు బయటకులోపలకు తిరగకుండా తలుపులు మూస్తారని, దానికే తలుపులు మూసి బిల్లు పెట్టారనడం ఏంటని ఫైర్ అయ్యారు. మోతె శ్రీలత కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్లే బిల్లును పాస్ చేసే ఘట్టాన్ని లైవ్ ఇవ్వలేదన్నారు.
లైవ్ టెలీకాస్ట్ ఇస్తే గొడవలు జరుగుతాయంటూ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఎఫ్ డీఐ బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు.. తాము ఓటేసే ప్రసక్తే లేదని తెలంగాణ ఎంపీలమంతా వేరే దగ్గర కూర్చున్నామని నాటి సన్నివేశాన్ని గుర్తు చేశారు. ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే ఓటు వేస్తామని చెప్పామన్నారు. ఆ తర్వాత తెలంగాణ బిల్లు మద్దతు కోసం సభకు వెళ్తే తమపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపేలా నాటి బీజేపీ ఎంపీ సుష్మా స్వరాజ్‌ను తామే ఒప్పించామని గుర్తు చేశారు.
