డీలర్లకు కంపెనీల టార్గెట్ డీఏపీతో కాంప్లెక్స్ లింక్..బస్తాకు రూ.150 అదనంగా వసూలు 

డీలర్లకు కంపెనీల టార్గెట్  డీఏపీతో కాంప్లెక్స్ లింక్..బస్తాకు రూ.150 అదనంగా వసూలు 
  •      హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌లోనే డీలర్లతో బస్తాకు రూ.150 అదనంగా వసూలు 
  •      డీఏపీ కావాలంటే ఇతర మందులు కొనాలని రైతులకు వ్యాపారుల మెలిక
  •      లేకపోతే డీఏపీ స్టాక్​లేదంటూ తిప్పి పంపుతున్న వైనం
  •      ఫీల్డ్ లెవల్‌‌‌‌‌‌‌‌లో కరువైన వ్యవసాయ శాఖ తనిఖీలు!

మహబూబ్​నగర్, వెలుగు : వానాకాలం పంటల సీజన్​ ప్రారంభం కావడంతో రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర మందుల కొనుగోళ్లు ప్రారంభించారు. అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు వ్యవసాయ శాఖ వద్ద, విత్తన వ్యాపారుల వద్ద అందుబాటులో ఉండగా, డీఏపీ ఎరువు కోసం రైతులు తంటాలు పడుతున్నారు. మార్కెట్​లో డిమాండ్​కు తగ్గ స్టాక్​ లేకపోవడంతో, ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు ఈ ఎరువు కావాలంటే లింక్​ ప్రాడక్ట్స్​ను కొనాలని మెలిక పెడుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 


హోల్​ సేల్​లోనే బస్తాపై రూ.150 అదనం..
50 కిలోల డీఏపీ బస్తాను కంపెనీలు 

రూ.1,350కి సప్లై చేయాల్సి ఉండగా ఎక్కువ రేటుకు ఇస్తున్నాయి. రేటును రూ.100 పెంచడంతోపాటు హమాలీ చార్జీల కింద మరో రూ.50 వసూలు చేస్తున్నారు. డీలర్​కే బస్తా డీఏపీ రూ.1450కి సప్లై అవుతోంది. రైతులు ఇతర ఎరువులు కొంటేనే డీఏపీ అమ్మాలని, లేదంటే బస్తా రూ.1800 కు విక్రయించాలని కంపెనీలు షరతు పెట్టినట్టు తెలుస్తోంది.  రైతులకు అధిక ధరలకు డీఏపీ అమ్మాల్సి వస్తుండంతో ఇబ్బందులు వస్తాయనే భయంతో పలువురు డీలర్లు డీఏపీ స్టాక్​ను తెప్పించుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం మార్కెట్​లో డీఏపీ కొరత ఏర్పడింది.

పత్తి రైతుల పరేషాన్.. 

మమబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో రైతులు పత్తి సాగును ప్రారంభించారు. నారాయణపేటలో 1.85 లక్షల ఎకరాల్లో, మహబూబ్​నగర్​లో 95 వేల ఎకరాల్లో పత్తి  సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మేలో వేసవి దుక్కులు పూర్తి చేసుకున్న రైతులు రోహిణి, మృగశిర కార్తెలలో విత్తనాలను విత్తుకుంటున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల మొలకలు వచ్చాయి. అవి బలంగా పెరగాలంటే డీఏపీ వేయాల్సి ఉంటుంది. దీని కోసం రైతులు ఆయా ప్రాంతాల్లోని ఎరువుల దుకాణాలకు వెళ్తుండగా, డీఏపీతో పాటు లింక్​ ప్రాడక్ట్​ కొనాలని ఇబ్బందులు 
పెడుతున్నారు. 

ఫీల్డ్​ లెవల్​లో తనిఖీలు నిల్..​

పంటల సీజన్​ ప్రారంభం కావడంతో ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీకంటే అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల వ్యవసాయ శాఖ హెచ్చరించింది. నిత్యావసర వస్తువుల చట్టం 1955, ఎరువుల నియంత్రణ చట్టం 1985 కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది. కానీ ఫీల్డ్​ లెవల్​లో వ్యాపారులు రైతులను అధిక ధరల పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఎరువులు, విత్తన దుకాణాల వద్ద వ్యవసాయ శాఖ తనిఖీలు చేయకపోవడం, నిఘా పెట్టకపోవడంతో అధిక ధరలను నియంత్రించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

ఎన్ని షాపులు తిరిగినా దొరకట్లే..

నాకున్న ఎకరన్నరలో డ్రాగన్​ ఫ్రూట్​ తోట పెట్టిన. ప్రస్తుతం పూత దశలో ఉంది. ఈ టైంలో తోటకు డీఏపీ పెడితే పూత బలంగా ఏర్పడి, దిగుబడి బాగా వస్తుంది. డీఏపీ కోసం ఎన్ని షాపుల వద్దకు వెళ్లినా స్టాక్​ లేదని చెబుతున్నారు. డీఏపీ పెట్టకపోతే ఆశించిన దిగుబడి వచ్చేలాలేదు. 
-మండ్ల మాస్​, రైతు, అమ్మాపూర్​ గ్రామం, 
మహబూబ్​నగర్​ జిల్లా

అవసరం లేకున్నా అంటగట్టిన్రు..

నాకు ఆరు ఎకరాల భూమి ఉంది. బోరు సౌలత్ కూడా ఉంది. దీంతో వరి సాగు చేయాలని తుకం పోసుకున్న. పంటకు డీఏపీ అవసరం అవుతుందని రెండు రోజుల కిందట మన గ్రో మోర్​ షాపునకెళ్లిన. 12 సంచుల డీఏపీ కొన్న. డీఏపీతో పాటు ఎఫ్​ 20 కాంప్లెక్స్​ ఎరువులను కూడా అంటగట్టిన్రు.  ఒక బస్తా ఎఫ్​ 20 ఎరువులకు రూ.1,090 చొప్పున రూ.5450 తీసుకున్నారు. డీఏపీ తప్పనిసరి కావడంతో అవసరం లేకున్నా కాంప్లెక్స్​ ఎరువులు కొనాల్సి వచ్చింది. 
-రాకేశ్​, రైతు, గూడూరు గ్రామం, మహబూబ్​నగర్​ జిల్లా