పెర్రీ క్లాస్.. వోల్ మాస్.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల ఘన విజయం 

పెర్రీ క్లాస్.. వోల్ మాస్.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల ఘన విజయం 

Australia vs Bangladesh: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు తమ జైత్రయాత్రను జోరుగా కొనసాగిస్తోంది. ఈరోజు (బుధవారం) హెడింగ్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో కంగారూలు అదరగొట్టారు. బంగ్లాదేశ్ జట్టును కేవలం 77 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. ఆపై కేవలం 9.3 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

కంగారూల బౌలింగ్ దాడి.. విలవిల్లాడిన బంగ్లాదేశ్: 
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఆస్ట్రేలియా పేసర్ కిమ్ గార్త్ పవర్‌ప్లేలోనే గట్టి షాక్ ఇచ్చింది. గత మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై హాఫ్ సెంచరీతో మెరిసిన జువైరియా ఫెర్దోస్‌ను కేవలం 8 రన్స్ కే ఔట్ చేయడంతో పాటు మరో ఓపెనర్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చింది. ఆ తర్వాత ఆసీస్ కెప్టెన్ సోఫీ మోలిన్యూక్స్, స్టార్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీలు చెరో రెండు వికెట్లతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ నడుం విరిచారు. ఒక దశలో బంగ్లాదేశ్ 27 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, తమ వరల్డ్ కప్ అత్యల్ప స్కోరు (46 పరుగులు) రికార్డును బద్దలు కొట్టేలా కనిపించినప్పటికీ.. కెప్టెన్ నిగర్ సుల్తానా (27) పట్టుదలతో ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 77/8 స్కోరు చేసింది. 

►ALSO READ | మెంటార్ అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ: యంగ్ ప్లేయర్‌తో సీరియస్ డిస్కషన్!

10 ఓవర్లలోనే ముగించేసిన ఆసీస్: 
78 రన్స్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్ జార్జియా వోల్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన వోల్.. ఈ మ్యాచ్‌లో మాత్రం బంగ్లా బౌలర్లపై విరుచుకుపడింది. 32 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సూపర్ సిక్సర్‌తో 45 రన్స్ తో నాటౌట్ గా నిలిచింది. ఓపెనర్ బెత్ మూనీ (10) వికెట్ కోల్పోయినప్పటికీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎలిస్ పెర్రీ (19 నాటౌట్) తో కలిసి జార్జియా వోల్ ఆస్ట్రేలియాను 9.3 ఓవర్లలోనే విజయం అందించింది. 

హిట్టర్లు లేరంటూ బంగ్లా కెప్టెన్ ఆవేదన:
మ్యాచ్ ముగిసిన అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా మాట్లాడుతూ.. తమ బ్యాటింగ్ వైఫల్యంపై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తమ జట్టులో ఇన్నింగ్స్ వేగాన్ని పెంచే పవర్ హిట్టర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది, అంతర్జాతీయ స్థాయిలో అలాంటి హిట్టింగ్ చేయగల బ్యాటర్లను కనుగొనడం ప్రస్తుతానికైతే చాలా కష్టంగా మారిందని వెల్లడించింది. ఈ అద్భుత విజయంతో గ్రూప్-1లో దూసుకుపోతున్న ఆస్ట్రేలియా, శనివారం జరగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో వరల్డ్ కప్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన నెదర్లాండ్స్ జట్టుతో పోటీ పడనుంది.