పెద్దోళ్లను వదిలి.. చిన్నోళ్లపై వేటు .. సాంస్కృతిక సారథి కళాకారులపై చర్యలు

పెద్దోళ్లను వదిలి.. చిన్నోళ్లపై వేటు  .. సాంస్కృతిక సారథి కళాకారులపై చర్యలు
  • కారు పార్టీ క్యాండిడేట్లను గెలిపించాలంటూ ప్రచారం
  • ముగ్గురు కళాకారులపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఆఫీసర్లు
  • లీడర్ల సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఉన్నవారిని వదిలేస్తున్నారంటున్న ప్రజలు

హనుమకొండ, వెలుగు : ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, మూఢ నమ్మకాలు, సామాజిక రుగ్మతలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన సాంస్కృతిక సారథి కళాకారులు అధికార పార్టీకి మద్దతుగా ఆడిపాడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా ‘కారు’ పార్టీ సభల్లో పాల్గొంటూ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలను గెలిపించాలంటూ బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు ఫిర్యాదులు అందడంతో ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన ముగ్గురు కళాకారులపై సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ వేటు వేశారు. అయితే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేతల సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఉన్న ‘పెద్ద’ కళాకారులను వదిలి సాధారణ కళాకారులపైనే వేటు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

550 మంది కళాకారులు

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది కళాకారులు తమ ఆట పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించారు. వాడవాడలా ప్రోగ్రామ్స్ నిర్వహించి తెలంగాణ సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారులను గుర్తించాలన్న ఉద్దేశంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’ని ఏర్పాటు చేసి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌‌‌‌‌‌‌‌ను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 550 మంది కళాకారులను గుర్తించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ సర్కార్‌‌‌‌‌‌‌‌ ఖజానా నుంచే జీతాలు చెల్లించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, మూఢనమ్మకాలపై చైతన్యం చేయాలని సూచించారు. కానీ సారథి కళాకారులంతా అధికార పార్టీ లీడర్లకే వంతపాడటం తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదు. 

ఆఫీసర్ల ఆదేశాలు బేఖాతర్‌‌‌‌‌‌‌‌

అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 9 నుంచి రాష్ట్రంలో ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వచ్చింది. దీంతో సారథి కళాకారులు ఏ పార్టీకి మద్దతుగా సభలు, సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటూ సాంస్కృతిక శాఖ సెక్రటరీ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు. కానీ కొందరు కళాకారులు అధికార పార్టీ లీడర్లతో ప్యాకేజీలు మాట్లాడుకుని సభల్లో ఆడిపాడుతున్నారు. గులాబీ కండువాలు వేసుకొని ధూంధాంలు చేస్తూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్లను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. 

కొందరిపైనే వేటు

సారథి కళాకారులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతూ ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉన్న టైంలో ఒక పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడంపై ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇటీవల ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో బండారి అనిత, సోదరి సురేందర్, కొయ్యడ సంధ్య అనే కళాకారులపై సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ వేటు వేశారు. అయితే అధికార పార్టీ నేతల సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఉన్న కళాకారులను వదిలి చిన్న ఆర్టిస్టులపైనే చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ALSO READ : ఢిల్లీ పార్టీలకు ఓటెందుకెయ్యాలె .. రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగమే : కేసీఆర్

అక్టోబర్​ 27న వర్ధన్నపేటలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న బండారి అనితను విధుల నుంచి తొలగించిన ఆఫీసర్లు.. అదే సభలో ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడి, అధికార పార్టీ ఎమ్మెల్యేలను పొగడ్తలతో ముంచెత్తిన కళాకారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. భూపాలపల్లి, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో నిర్వహించిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సభల్లో సైతం కళాకారులు పాల్గొని అధికార పార్టీకి మద్దతుగా ప్రదర్శనలు ఇచ్చారు. లీడర్ల సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఉండడం వల్లే ‘పెద్దోళ్ల’పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు అంటున్నారు.