వంట చేసే రోబో మెషిన్లు

వంట చేసే రోబో మెషిన్లు

పది మంది పది నిమిషాల్లో చేసే పనిని ఒక మెషిన్ ఒక్క నిమిషంలో చేయగలదని మనకు తెలుసు. ఇదే ఫార్ములాను వంటింట్లో ప్రవేశపెట్టారు ఈశ్వర్, సుదీప్‌‌లు. వంట చేయడం కోసం బోలెడన్ని పాత్రలు, స్టవ్, గ్యాస్ ఇవన్నీ అవసరం లేకుండా ఒక్కో వంటకు ఒక్కోరకమైన మెషిన్ తయారు చేస్తున్నారు. దోశెల నుంచి బర్గర్స్ వరకూ రకరకాల ఐటెమ్స్ చేసే రోబోటిక్ చెఫ్స్‌‌ను రెడీ చేస్తున్నారు.

బెంగళూరుకి చెందిన ఈశ్వర్ కె వికాస్, సుదీప్ సబత్‌‌లు కలిసి చదువుకున్నారు. వీళ్లిద్దరికీ ఫుడ్ అంటే ఇష్టం. కొత్త రుచులను ఎక్స్‌‌ప్లోర్ చేయడం కోసం దేశమంతటా తిరిగారు. ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ బ్రాండ్‌‌ను మొదలుపెడదాం అనుకున్నారు. 2009లో క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్‌‌ కొన్ని పెట్టారు. కానీ, చెఫ్‌‌ల కొరత, అన్నీ చోట్ల ఒకేరకమైన క్వాలిటీ, టేస్ట్ కుదరకపోవడంతో రెస్టారెంట్ అవుట్‌‌లెట్స్‌‌ను మూసేశారు. తక్కువ మంది చెఫ్స్‌‌తో, ప్రతిచోట ఒకేరకమైన క్వాలిటీ, టేస్ట్ మెయింటెయిన్ చేయడం ఎలా అని ఆలోచించారు.  అప్పుడే కిచెన్ ఆటోమేషన్ ఐడియా వచ్చింది వాళ్లకు. దక్షిణాది వంటకాల నుంచి వెస్టర్న్ ఫుడ్స్ వరకూ అన్ని వెరైటీలు తయారుచేసేలా రోబోటిక్ మెషిన్స్‌‌ తయారుచేయాలనుకున్నారు. అలా పుట్టిందే ‘ముకుంద ఫుడ్స్’. 

దోసెతో మొదలుపెట్టి..

ముకుంద ఫుడ్స్.. ఒక  కిచెన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కంపెనీ.  ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఈశ్వర్, సుదీప్‌‌లు నాలుగేళ్లపాటు కష్టపడి ‘దోశెమాటిక్’ అనే దోశె మెషిన్‌‌ను తయారుచేశారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఆటోమేటిక్ దోశె మెషిన్. ఇది గంటకు 50 దోశెలు వేయగలదు.  పిండి అందులో వేసి బటన్ నొక్కితే చాలు. ఎర్రగా కాలిన దోసెలు బయటకు వస్తాయి. కొద్ది కాలంలోనే ఇలాంటి మెషిన్లు వెయ్యి తయారుచేసి  22 దేశాల్లో అమ్మారు. రాష్ట్రపతి భవన్, నేవీ షిప్పుల్లో కూడా వీటిని వాడుతున్నారు. దోశెమాటిక్ సక్సెస్ అయిన తర్వాత సమోసా, మోమోస్ లాంటివి తయారుచేసే మెషిన్లు కూడా కావాలని రిక్వెస్ట్‌‌లు వచ్చాయి. దాంతో మరిన్ని రోబోటిక్ చెఫ్స్‌‌ను తయారుచేసే పనిలో పడ్డారు.

రకరకాల వంటలు

ముకుంద ఫుడ్స్ కొన్ని నెలల్లోనే రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేసే మెషిన్స్ తయారుచేశారు.  రైస్ మేకర్, నూడుల్స్, ఇండియన్, చైనీస్ గ్రేవీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, పాస్తా, కబాబ్స్, కేక్స్.. ఇలా 14 రకాల వంటలను ప్రిపేర్ చేసే మెషిన్స్‌‌ను రెడీ చేశారు. ప్రపంచంలో పేరున్న రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లలో చాలావాటికి ఈ మెషిన్లను సప్లై చేశారు. ముకుంద ఫుడ్స్‌‌కు ప్రస్తుతం మూడు వేల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. అందులో ఐటీసీ ఫుడ్స్, ఓలా ఫుడ్స్, జొమాటో, కార్నివాల్ ఫుడ్స్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. మనదేశంతో పాటు యుకె, యూఎస్, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో వీళ్ల రోబోటిక్ కిచెన్‌‌లు వాడుతున్నారు.

ఏఐ సాయంతో..

మెషిన్ అంటే ఏదో పిండి కలిపేసి వంట చేసేది కాదు. మెషిన్ తయారుచేసే ముందు వీళ్లు ప్రొఫెషనల్ చెఫ్‌‌ల సాయం తీసుకుని, ఏది ఎంత మోతాదులో వేయాలో తెలుసుకుంటారు. ఇంగ్రెడియెంట్స్‌‌ను సరైన కొలతలతో బ్యాలెన్స్ చేస్తూ  రుచికరమైన డిష్ ప్రిపేర్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌తో  మెషిన్‌‌ను డిజైన్ చేస్తారు. మెషిన్స్‌‌ను ఆపరేట్ చేసేందుకు, ఇన్‌‌స్ట్రక్షన్స్ ఇచ్చేందుకు ఆండ్రాయిడ్ యాప్స్ కూడా డెవలప్ చేశారు. ఈ మెషిన్ల ధరలు 40 వేల నుంచి 
లక్ష రూపాయల వరకూ ఉంటాయి. 

‘వోకీ’ బాగా పాపులర్

ఒకప్పుడు కట్టెలపొయ్యిపై వంట చేసేవాళ్లు. కొంతకాలానికి గ్యాస్ స్టౌవ్‌‌లు, తర్వాత ఎలక్ట్రిక్, ఇండక్షన్ స్టవులు వచ్చాయి. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతగా డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా కిచెన్ వేడిలో మగ్గిపోవడం ఏంటి? అని మాకు అనిపించింది. అందుకే కిచెన్ ఆటోమేషన్‌‌పై ఫోకస్ పెట్టాం. ఇన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తామని మేము కూడా ఊహించలేదు. కానీ అనుకోని విధంగా దాదాపు అన్నిపాపులర్​ వంటకాలకు రోబోటిక్ సొల్యూషన్స్ కనిపెట్టగలిగాం. మా మెషిన్స్‌‌లో ఎక్కువ పాపులర్ అయింది ‘వోకీ’. నూడుల్స్, పాస్తా,  ఫ్రైడ్ రైస్, కర్రీస్, పోహా, ఉప్మా ఇలా..  చాలా రకాల వంటలు చేయగలదు ఇది. సరైన కొలతలతో డిష్‌‌ను పక్కాగా ప్రిపేర్ చేస్తుంది. ఏదైనా తప్పు జరిగితే.. చిన్న ఇన్‌‌స్ట్రక్షన్ ఇస్తే చాలు. ఆ తప్పు మళ్లీ జరగకుండా చూసుకుం టుంది. మా మెషిన్లన్నీ మనిషి కంటే 4 రెట్లు వేగంగా పనిచేస్తాయి. అందుకే ఇవి మనదేశం లోని అన్ని రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లకు మంచి సొల్యూషన్. దేశమంతటా ఆటోమేటెడ్ కిచెన్లను డెవలప్ చేయాలన్నదే మా గోల్.

- ఈశ్వర్ కె వికాస్