అన్ని చార్జీలు పెంచి జనాలను దోచుకుంటున్నరు : వివేక్​ వెంకటస్వామి

 అన్ని చార్జీలు పెంచి జనాలను దోచుకుంటున్నరు : వివేక్​ వెంకటస్వామి
  • ధరణితో బీఆర్ఎస్​ లీడర్లు భూములు ఆక్రమిస్తున్నరు
  • మానేరువాగులో ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్​

పెద్దపల్లి, వెలుగు: సంక్షేమం పేరుతో ప్రజల చేతిలో రూపాయి పెడుతున్న సీఎం కేసీఆర్..​ రూ.100 గుంజుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి​ ఫైర్​ అయ్యారు. కరెంట్, రిజిస్ట్రేషన్లు, లిక్కర్, ఆర్టీసీ చార్జీలతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేక్​ మాట్లాడారు. రాష్ట్రంలో తుగ్లక్​ పాలన నడుస్తోందని,  ధరణి పోర్టల్ తీసుకొచ్చి బీఆర్ఎస్​ లీడర్లకు దందా చేసుకునే అవకాశం ఇచ్చారని ఆయన ఆరోపించారు. ధరణిలో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్​ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నారు. ధరణితో పేద రైతులు భూములు కోల్పోయి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో లిక్కర్​ను అధిక రేట్లకు అమ్ముతున్నారన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మద్యం అమ్మకాలపై ఆధారపడేలా సర్కార్​ చేసిందని, ఏటా రూ.48 వేల కోట్లు మద్యం ద్వారానే రాబడుతున్నారని అన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్​ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తేనే రేట్లు తగ్గి, ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని, కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని వివేక్​ సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ పెట్రోల్, డీజీల్​పై వ్యాట్ ను రూ.10 నుంచి రూ.14 వరకు తగ్గించాయన్నారు. కానీ తెలంగాణలో రూపాయి కూడా తగ్గించలేదన్నారు. పక్కనున్న కర్నాటకలో కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు తెలంగాణ కంటే తక్కువగా ఉన్నాయని, అందుకే బార్డర్​లోని జనాలు అక్కడికి వెళ్లి పెట్రోల్, డీజిల్​ కొంటున్నారన్నారు. ప్రధాని మోడీ ఉక్రెయిన్​ వార్ సమయంలో రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్ కొని ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు.

ప్రజల కోరిక మేరకే రైలు హాల్టింగ్

ప్రజల కోరిక మేరకే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్​ను కలిశానని, మంత్రి సానుకూలంగా స్పందించి రామగిరి, అజ్ని ఎక్స్​ప్రెస్​లు ఓదెల రైల్వేస్టేషన్​లో ఆగేలా ఆదేశాలిచ్చారని వివేక్​ చెప్పారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడే కొత్త రైలు సర్వీసుల కోసం కృషి చేశానని, పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్​ పరిధిలోని రైల్వే స్టేషన్లలో అన్ని రైళ్లు ఆగేలా కేంద్రాన్ని ఒప్పించానన్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఓదెలలో శ్రీమల్లికార్జున స్వామి ఆలయం ఉందని, సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో స్థానికులు తనను సంప్రదించారన్నారు. ప్రజల కోరికను గౌరవించిన రైల్వే మంత్రికి ఈ సందర్భంగా వివేక్​ కృతజ్ఞతలు తెలిపారు.

ఇసుక దందాపై కఠిన చర్యలు తీసుకోవాలి

పెద్దపల్లి నియోజకవర్గంలోని మానేరువాగులో ఇసుక దందాపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని వివేక్​ డిమాండ్​ చేశారు. ఇసుకను అక్రమంగా హైదరాబాద్​ లాంటి దూరప్రాంతాలకు తరలించి కోట్లు గడిస్తున్నారని, ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులే ఉన్నారని ఆరోపించారు. చెక్​డ్యాంల వద్ద డీసిల్టేషన్​ పేరుతో అనుమతులు పొంది, ఇసుకను విచ్చలవిడిగా మైనింగ్​ చేసి నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారన్నారు. ఇసుక అక్రమ దందాపై గ్రీన్​ ట్రిబ్యునల్​లో కేసు వేసినా సర్కార్​ పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు కూడా పూర్తిగా ఇసుక కాంట్రాక్టర్లకే సహకరిస్తున్నారన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్య, గొట్టిముక్కుల సురేష్​రెడ్డి, సయ్యద్​ సజ్జాద్, అడ్డగుంట శ్రీనివాస్, బాలసాని సతీష్, గుండేటి ఐలయ్య, గజభీంకార్​ పవన్, కూకట్ల నాగరాజు, బుర్ర సతీశ్​, ఆరెపల్లి రాహుల్, అల్లం సతీశ్​, రావుల రాజ్​కుమార్, కారెంగుల శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.