ఏడేండ్లలో రూ.70 వేల కోట్లు వసూలు 

ఏడేండ్లలో రూ.70 వేల కోట్లు వసూలు 

న్యూఢిల్లీ, వెలుగు: నిత్యావసర ధరలపై మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ ఎంపీలకు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆర్టీసీ నుంచి భూముల ధరల వరకు అన్నీ పెంచి పేద ప్రజలపై దాదాపు రూ.5,596 కోట్ల భారం మోపారన్నారు. మిగులు రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ, రూ.3.50 లక్షల అప్పులతో లోటు రాష్ట్రంగా మారిపోయిందన్నారు. మంగళవారం నిత్యావసర ధరల పెంపుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ ఎంపీల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ధరల పెంపుపై టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి చేసిన విమర్శలను లక్ష్మణ్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలు ‘‘షేమ్ షేమ్..’’అంటూ నినాదాలు చేస్తే, టీఆర్ఎస్ ఎంపీలు లక్ష్మణ్ స్పీచ్‌‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొదట టీఆర్ఎస్ నుంచి సురేశ్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ కాల్ అని చెబుతోందని, అయితే సాధారణ ప్రజలను మాత్రం ఇబ్బంది పెడుతోందన్నారు. పుట్టుక నుంచి చావు దాకా జీఎస్టీ వేయాల్సి ఉండేదని ఎద్దేవా చేశారు. అంతిమ యాత్రపైన కూడా జీఎస్టీ వేయాలని ఎద్దేవా చేశారు. 2014 ముందు దేశంలో తెలంగాణ అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా ఉందని, ఇప్పుడు దేశానికి ఆర్థికంగా చేయూతనిస్తోన్న 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. 

ఏడేండ్లలో రూ.70 వేల కోట్లు వసూలు 

ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఉన్నా, దేశం మాత్రం మెరుగ్గా ఉందని లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించిందని సభకు వివరించారు. తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌‌పై రూ.35, డీజిల్‌‌పై రూ. 27 శాతం వసూళ్లతో 2014 నుంచి ఇప్పటి వరకు రూ.70 వేల కోట్లు వసూలు చేసిందని చెప్పారు. 5 నెలల్లో రెండు సార్లు తెలంగాణ సర్కార్ భూముల ధరలు పెంచిందని చెప్పారు. స్టాంప్ డ్యూటీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచిందన్నారు. ఆర్టీసీ చార్జీలు 50% పైగా పెరిగాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ను రూ.లక్షా 20 వేల కోట్లకు పెంచారన్నారు. ఇటీవల వర్షాలు, వరదలతో పంపులు, మోటార్లు మునిగిపోయాయని, వీటిని పునరుద్ధరించడానికి వందల కోట్లు అవసరం అవుతాయని ఎంపీ లక్ష్మణ్​ సభ దృష్టికి తెచ్చారు.