
- ట్రాప్‌లో 14 వేల మంది వ్యభిచారం నుంచి ఇద్దరు బాలికలకు విముక్తి
- డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారంలోకి దింపి.. బాధిత మహిళలతోనే డ్రగ్స్ సప్లై
- బాధితుల్లో వివిధ రాష్ట్రాల మహిళలతో పాటు విదేశీయులు
- ముఠాను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు.. 17 మంది అరెస్టు
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఆన్ లైన్ సెక్స్ రాకెట్‌ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. వెబ్ సైట్, వాట్సాప్, కాల్ సెంటర్ల ద్వారా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ కేసులో 17 మంది నిందితులను అరెస్టు చేసి, వారి చెర నుంచి 14,190 మంది మహిళలను కాపాడారు. బాధితుల్లో మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నిందితులపై 39 కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. వారి వద్ద నుంచి రూ.95 వేలు, 34 స్మార్ట్ఫోన్లు, మూడు కార్లు, ఒక ల్యాప్ టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో షీ టీమ్ డీసీపీ కవిత, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
అమ్మాయిలను ట్రాప్ చేసి...
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌కు చెందిన మహ్మద్అదీమ్అలియాస్ అర్ణబ్(31), టోలిచౌకీకి చెందిన మహమ్మద్సమీర్ (27)తో కలిసి 2019లో ఈ బిజినెస్ మొదలుపెట్టాడు. వీరు మరో 15 మంది ఆర్గనైజర్లతో కలిసి వ్యభిచార దందా నిర్వహించారు. వివిధ రాష్ర్టాల్లో బ్రోకర్లను నియమించుకొని వారికి కమీషన్లు ఇస్తూ అమ్మాయిలను వ్యభిచార దందాలోకి దింపారు. పేదరికంతో ఇబ్బందులు పడుతూ ఉద్యోగాల కోసం వెతుకుతున్న అమ్మాయిలను టార్గెట్ చేసుకొని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెద్ద ఎత్తున డబ్బు వస్తుందని, విలాసవంతమైన లైఫ్ ఉంటుందని ట్రాప్ చేశారు. తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ర్ట, ముంబై, కోల్‌కతా, ఢిల్లీలోని అమ్మాయిల ఫొటోలను బ్రోకర్ల ద్వారా తెప్పించుకొని.. వాటిని తమ వెబ్ సైట్లు, వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా కాల్ సెంటర్లు కూడా నడిపారు. ఫొటోలు, వీడియోలు చూసి కస్టమర్లు ఫోన్ చేస్తే అన్నీ మాట్లాడి అమ్మాయిలకు ఫ్లైట్ టికెట్లు, హోటల్ రూమ్స్ బుక్‌చేసేవారు. వచ్చిన డబ్బుల్లో బాధిత మహిళలకు 30 శాతం ఇచ్చేవారు.
బాధితుల్లో 50 శాతం మంది బెంగాల్ వాళ్లే..
మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశాలకు చెందిన అమ్మాయిలను కూడా రప్పించి వ్యభిచారం నిర్వహించారు. బంగ్లాదేశ్, నేపాల్, థాయ్ లాండ్, ఉజ్బెకిస్తాన్, రష్యా నుంచి మహిళలను టూరిస్ట్ వీసాపై హైదరాబాద్ కు తీసుకొచ్చి దందా నడిపించారు. వారికి నకిలీ ఆధార్‌కార్డులు సృష్టించి ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశారు. బాధిత మహిళల్లో అత్యధికంగా 50 శాతం మంది పశ్చిమ బెంగాల్ వాళ్లే ఉన్నారు. కర్నాటక నుంచి 20 శాతం, మహారాష్ర్ట నుంచి 15 శాతం, ఢిల్లీ నుంచి 7 శాతం మంది, ఇతర రాష్ర్టాలోళ్లు 5 శాతం, విదేశీయులు 3 శాతం ఉన్నారు. ట్రాప్ చేసిన అమ్మాయిలకు నిర్వాహకులు డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారం చేయించేవారు. ఇందుకు అర్ణవ్ కు హర్బిందర్ కౌర్ అనే మహిళ సాయం చేసేది. అర్ణవ్ బాధిత యువతులతోనే నగరంలో డ్రగ్స్ సప్లై చేయించి డబ్బులు సంపాదించేవాడు. టోలిచౌకీకి చెందిన గుడ్డు అలీసాం సాయంతో డ్రగ్ డీలర్ సోఫిన్ పటేల్ అలియాస్ అబ్బాస్ దగ్గర అర్ణవ్ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకునేవాడు.
ఇట్ల దొరికిన్రు...
సిటీలో జరుగుతున్న వ్యభిచారం, హ్యూమన్ ట్రాఫికింగ్‌పై సైబరాబాద్ పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు ప్రత్యేక టీమ్ గా ఏర్పడి ఆపరేషన్ చేపట్టారు. పోయిన నెల 15న బేగంపేట్ ప్రకాశ్‌నగర్‌కు చెందిన సల్మాన్ అలియాస్ వివేక్(23), సన్‌సిటీకి చెందిన ఇర్ఫాన్ అలియాస్ వికాస్(36) ను అరెస్టు చేశారు. వీళ్లిచ్చిన సమాచారం ఆధారంగా మొత్తం ముఠాను పట్టుకున్నారు. ప్రధాన నిందితులు అర్ణవ్, సమీర్ తో పాటు హర్బిందర్ కౌర్ ను పోయిన నెల 18న అరెస్టు చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గచ్చిబౌలిలోని రాడిసన్హోటల్ మేనేజర్ రాకేశ్ కూడా ఉన్నాడు. కాగా, సోమాజిగూడకు చెందిన హర్బిందర్ కౌర్(29) భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకొని అర్ణవ్‌తో ఉంటోంది.